టీడీపీ నాయకులు దాడి చేస్తుంటే పోలీసులు నిలువరించలేకపోయారు..లాఅండ్‌ఆర్డర్ కంట్రోల్‌లో పెట్టడంలో హోం మంత్రి విఫలమయ్యారని వైయస్ఆర్‌సీపీ డాక్టర్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ధ్వజమెత్తారు. హోం మంత్రి అనిత మైక్‌ల మంత్రిగా మారారని విమర్శించారు. వైయస్ జగన్ హయాంలో అన్ని వర్గాలకు రక్షణ కల్పించారని మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు చెప్పారు. మహిళల భద్రత కోసం దిశ చట్టం తీసుకొచ్చారన్నారు. సోమవారం(అక్టోబర్ 28)శ్రీకాకుళంలో సీదిరి అప్పలరాజు మీడియాతో మాట్లాడారు. ‘కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే టీడీపీ నాయకులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారు. రాష్ట్రంలో టీడీపీ నాయకులు అరాచకం సృష్టిస్తున్నారు.
పలాసలో మైనర్ బాలికలపై టీడీపీ నేతలు అత్యాచారం చేశారు. నిందితులను టీడీపీ నాయకులు వెనకేసుకొచ్చారు. వైయస్‌ఆర్‌సీపీ కార్యకర్తలపై పోలీస్‌స్టేషన్‌లోనే దాడి చేశారు. చంద్రబాబు అసమర్థత వల్ల పోలీసు వ్యవస్థ నిర్వీర్యమైంది. కాశీబుగ్గలో దాడికి పాల్పడిన టీడీపీ నేతలపై చర్యలు తీసుకోవాలి. దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోకపోతే పోలీస్‌స్టేషన్‌కు పసుపు రంగు వేస్తామని సీదిరి అప్పలరాజు హెచ్చరించారు.