తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక. 2025 జనవరి నెలకు సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అక్టోబర్ 19న విడుదల చేయనుంది. అక్టోబరు 19వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో టికెట్ల కోటా విడుదల చేస్తారు. ఈ సేవా టికెట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం అక్టోబరు 21వ తేదీ ఉదయం పదిగంటల వరకూ ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని టీటీడీ తెలిపింది. టికెట్లు పొందిన భక్తులు అక్టోబర్ 23వ తేదీ మధ్యాహ్నం 12లోగా సొమ్ము చెల్లించాల్సి ఉంటుంది. సొమ్ము చెల్లించిన భక్తులకు లక్కీడిప్ ద్వారా టికెట్లు మంజూరుచేస్తారు. ఇక తిరుమల శ్రీవారి కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవా టికెట్లను అక్టోబర్ 22 ఉదయం పది గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు.
అలాగే వర్చువల్ సేవలకు సంబంధించి జనవరి కోటా టికెట్లను అక్టోబర్ 22 మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. ఇక జనవరి నెలకు సంబంధించి శ్రీవారి అంగప్రదక్షిణం టోకెన్ల కోటాను అక్టోబరు 23న ఉదయం 10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేస్తారు. అలాగే శ్రీవాణి ట్రస్టు టికెట్ల కోటాను అదే రోజు ఉదయం 11 గంటలకు విడుదల చేస్తారు. ఇక వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి కల్పించే ఉచిత ప్రత్యేక దర్శనం టికెట్ల కోటాను అక్టోబరు 23న మధ్యాహ్నం 3 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. అలాగే 2025 జనవరి నెల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను అక్టోబరు 24న ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు. తిరుమల, తిరుపతిలలో గదుల కోటాను అక్టోబరు 24న మధ్యాహ్నం 3 గంటలకు విడుదల చేస్తారు. శ్రీవారి ఆర్జిత దర్శనం, సేవాటికెట్లను అధికారిక వెబ్ సైట్ ద్వారా బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది.
అక్టోబరు 17న పౌర్ణమి గరుడ సేవ
మరోవైపు ప్రతి నెలా నిర్వహించిన విధంగానే ఈ నెల కూడా తిరుమలలో పౌర్ణమి గరుడ సేవ వైభవంగా జరగనుంది. తిరుమల శ్రీవారి ఆలయంలో అక్టోబరు 17న పౌర్ణమి గరుడసేవ నిర్వహించనున్నారు. ప్రతినెలా పౌర్ణమి రోజున టీటీడీ గరుడ సేవ నిర్వహించడం ఆనవాయితీ ఇందులో భాగంగా రేపు రాత్రి 7 నుంచి 9 గంటల వరకూ మలయప్పస్వామి గరుడునిపై తిరుమాడ వీధులలో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. ఇక పౌర్ణమి గరుడ సేవలో పాల్గొనేందుకు భక్తులు కూడా తరలివస్తుంటారు.