ఆంధ్రప్రదేశ్ యువతకు 20 లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా ఏపీ ప్రభుత్వం నూతన పాలసీలు తీసుకువచ్చింది. బుధవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఆరు నూతన పాలసీలను తీసుకువచ్చినట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వెల్లడించారు. ఏపీ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ పాలసీ, ఏపీ ఎంఎస్ఎంఈ అండ్ ఎంటర్‌ప్రెన్యూయర్ డెవలప్‌మెంట్ పాలసీ, ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ, ఏపీ ఎలక్ర్టానిక్స్ పాలసీ, ఏపీ ప్రైవేట్ పార్క్ పాలసీ, ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీలను తీసుకువచ్చినట్లు చంద్రబాబు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో ఈ ఆరు పాలసీలు గేమ్ ఛేంజర్‌గా మారతాయని చంద్రబాబు విశ్వాసం వ్యక్తం చేశారు. వీటితో పాటుగా టూరిజం, ఐటీ, వర్చువల్ వర్కింగ్ పాలసీలను కూడా త్వరలోనే తీసుకురానున్నట్లు చెప్పారు. వన్ ఫ్యామిలీ- వన్ ఎంటర్ ప్రెన్యూర్ నినాదంతో ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తోందన్న చంద్రబాబు.. ఉద్యోగం చేయడం మాత్రమే కాకుండా.. ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
మరోవైపు ఏపీ రాజధాని అమరావతిలో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు కానుంది. ఈ విషయాన్ని చంద్రబాబు వెల్లడించారు. దీనికి అనుబంధంగా ఐదు జోన్లలో ఐదు హబ్‌లు ఏర్పాటు చేయనున్నారు. విశాఖపట్నం, రాజమహేంద్రవరం, అనంతపురం, తిరుపతి, విజయవాడ లేదా గుంటూరులో ఐదు ఇన్నోవేషన్ హబ్‌లు ఏర్పాటు చేస్తామని చంద్రబాబు చెప్పారు. వీటి ద్వారా ఏపీలో పారిశ్రామిక అభివృద్ధి జరుగుతుందన్నారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌కు రూ.30 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్న చంద్రబాబు.. నవంబరు మొదటి వారంలో స్వర్ణాంధ్ర 2047 విజన్ డాక్యుమెంట్ విడుదల చేస్తామన్నారు. విశాఖపట్నం నుంచి భావనపాడు వరకూ రహదారిని నిర్మిస్తామని.. భావనపాడులో 10 వేల ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేస్తామన్నారు.
మరోవైపు ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో రూ.30 వేల కోట్ల పెట్టుబడులు, 3 లక్షల ఉద్యోగాలు లక్ష్యంగా పెట్టుకున్నామన్న చంద్రబాబు.. ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి అండగా ఉండటానికి రూ.500 కోట్లు కార్పస్ ఫండ్ పెడతామని తెలిపారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు అండగా ఉంటామని, రాయతీలు కల్పిస్తామని చెప్పారు. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించామన్న సీఎం.. విశాఖని బెస్ట్ సిటీగా, ఆర్థిక రాజధానిగా మార్చుతామని అన్నారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేస్తామని.. అన్ని ప్రాంతాల అభివృద్ధే ధ్యేయంగా ముందుకెళ్తామన్నారు.