బంగాళాఖాతంలో వాయుగుండం ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రెండు రోజులుగా ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలనూ కుండపోత వానలతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాల ధాటికి తిరుమల ఘాట్ రోడ్డులో ఇవాళ ఉదయం కొండ చరియలు విరిగిపడ్డాయి. రెండో ఘాట్ రోడ్డులోని హరిణి దగ్గర విరిగిపడగా.. ఆ సమయంలో వాహనాలు లేకపోవడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. వెంటనే అప్రమత్తమైన టీటీడీ అధికారులు సహాయచర్యలు చేపట్టారు. జేసీబీల సాయంతో బండరాళ్లను తొలగించారు. భారీ వర్షాల నేఫథ్యంలో కొండ చరియలు విరిగిపడే అవకాశముందని టీటీడీ ముందుగానే అంచనా వేసింది. ఆ క్రమంలోనే అన్ని విభాగాలను అప్రమత్తం చేసింది.
తిరుమల ఘాట్ రోడ్లలో సహాయచర్యల కోసం జేసీబీలు, ట్రక్కులు, అంబులెన్సులు సిద్ధంగా ఉంచారు. అయితే వాహనాలు లేని సమయంలో ఈ ఘటన చోటుచేసుకోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బుధవారం అతిభారీ వర్షాలు కురిసే అవకాశముందన్న వాతావరణ హెచ్చరికల నేపథ్యంలోనే టీటీడీ వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేసింది. వర్షాలు తగ్గేవరకూ భక్తులు తిరుమల ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిదని టీటీడీ అధికారులు సూచించారు. తిరుమలతో పాటుగా శ్రీవారి పాదాలు, ఆకాశ గంగ, జాపాలి, పాపవినాశనానికి భక్తులను టీటీడీ అనుమతించడం లేదు. భారీ వర్షాలతో మాల్వాడిగుండం ప్రవహిస్తోంది.
మరోవైపు తిరుమల కొండల నుంచి వస్తున్న నీటితో తిరుపతి కాలనీల్లోకి వరద వచ్చి చేరుతోంది. నగరంలోని రాజీవ్‌గాంధీ కాలనీ, ఆటోనగర్, కొరమీనుగుంటలో వరద నీరు వచ్చి చేరుతోంది. తిరుపతి జిల్లా ఏర్పేడు మండలం గుడిమల్లం దగ్గర సీత కాల్వ కాజ్‌వేపై వరద ప్రవహిస్తోంది. అలాగే భారీ వర్షాలతో రేణిగుంట రన్‌వేపైకి నీరు చేరగా.. ల్యాండింగ్ సమస్యతో ఇండిగో విమానాన్ని చెన్నైకి దారి మళ్లించారు. ఈ విమానం హైదరాబాద్ నుంచి రేణిగుంటకు రావాల్సి ఉంది.
రాష్ట్రంలో భారీ వర్షాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఆకస్మిక వరదల విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు సహా పలు జిల్లాల్లో వర్షాలపై అధికారులతో చంద్రబాబు సమీక్ష చేశారు. వర్ష ప్రభావిత జిల్లాల్లోని పరిస్థితులను ఎప్పటికప్పుడు నివేదించాలని సూచించారు.