ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్వేతపత్రాల పేరుతో చంద్రబాబు అబద్దాలు చెబుతున్నారు,,,వైఎస్ జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Jul 26, 2024, 07:44 PM

టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో దాడులు, అత్యాచారాలు, ఆస్తుల ధ్వంసాలు జరుగుతున్నాయని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్.  ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న ప్రభుత్వ పాలన చూస్తుంటే.. రాష్ట్రం పురోగతి వైపు వెళ్తుందా.. రివర్స్‌ వెళ్తోందా అనే అనుమానం కలుగుతోందన్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే.. వాళ్లను అణచివేసే ధోరణితో వ్యవహరిస్తున్నారని.. బాధితులపై కేసులు పెట్టే పరిస్థితులు ఉన్నాయన్నారు. ఇంత జరుగుతున్నా.. పోలీసులు ప్రేక్షకపాత్ర వహించడం దారుణమన్నారు. ఆంధ్రప్రదేశ్ అంటే అరాచక పాలన, ఆటవిక పాలనగా మారిందని.. ఏపీలో రెడ్‌బుక్‌ పాలన నడుస్తోందని ఘాటు వ్యాఖ్యలు చేశారు.


 కూటమి ప్రభుత్వం కనీసం బడ్జెట్‌ కూడా పెట్టలేని అధ్వానమైన స్థితిలో ఉందన్నారు జగన్. ఏడు నెలల ఓటాన్‌ బడ్జెట్‌ పెడుతోందని.. పూర్థిస్థాయి బడ్జెట్‌ పెట్టే ధైర్యం కూడా లేదంటే.. వీరి పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. ఒకవేళ పూర్తి బడ్జెట్‌ పెడితే చంద్రబాబు నాయుడు మోసపూరిత హామీలకు కేటాయింపులు చూపించాల్సి వస్తుందని.. అందుకే బడ్జెట్ ప్రవేశపెట్టడం లేదన్నారు. చంద్రబాబు అంటేనే మోసం, వంచన, గోబెల్స్ ప్రచారమని విమర్శించారు. సొంత మామ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడవటం దగ్గర నుంచి ప్రజల్ని మోసం చేసే వరకు ఇదే జరుగుతోందన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అబద్దాలు చెబుతా.. ఆర్థికంగా రాష్ట్రం ధ్వంసమైందనే బడ్జెట్‌ పెట్టడం లేదని చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.


ఎన్నికల సమయంలో 14 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయని చెప్పారని.. అన్ని అప్పులు ఉన్నాయంటూనే సూపర్‌ సిక్స్‌ హామీలు ఇచ్చారన్నారు జగన్. ఇప్పుడు అధికారం వచ్చిన తర్వాత అప్పులు, పథకాల విషయంలో పాట్లు పడుతున్నారన్నారు. గవర్నర్‌ ప్రసంగంలో రూ.10 లక్షల కోట్ల అప్పు అయ్యిందని చూపించారని.. ఇప్పుడేమో శ్వేతపత్రాల పేరుతో అందర్ని మభ్యపెట్టాలని చూస్తున్నారన్నారు. 2014-2019 మధ్య చంద్రబాబు హయాంలో 21.63 శాతం వరకు అప్పులు చేస్తే.. వైఎస్సార్‌సీపీ హయాంలో 12.9 శాతం అప్పు చేశామన్నారు. తమ ప్రభుత్వ పనితీరును కేంద్ర ఎకనామిక్‌ సర్వే ప్రశంసించిందని.. బడ్జెట్‌లోనూ ఈ లెక్కలన్నీ చెప్పాల్సి వస్తుందనే చంద్రబాబు ప్రభుత్వం బడ్జెట్ పెట్టడం లేదన్నారు.


2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి రూ.2 లక్షల 72 వేల కోట్ల అప్పు ఉందని.. వైఎస్సార్‌సీపీ హయాంలో ఆ అప్పు రూ.5 లక్షల 18 వేల కోట్లకు చేరిందన్నారు మాజీ ముఖ్యమంత్రి. గ్యారెంటీలు, విద్యుత్‌ ఒప్పందాలు కలిపితే 7లక్షల 48 వేల కోట్లు మాత్రమేనని తెలిపారు. కానీ రూ.14 లక్షల కోట్ల అప్పు ఉందని చెప్పడం ధర్మమా? అని ప్రశ్నించారు. తాము ఈ వాస్తవాలను తెలియజేస్తూ గవర్నర్‌కు లేఖ రాస్తామని.. ప్రభుత్వం చెప్పించిన అబద్ధాలు గవర్నర్ విషయాన్ని దృష్టికి తీసుకెళ్తామన్నారు. చంద్రబాబు అధికారం చేపట్టేనాటికి రాష్ట్ర ఖజానాలో రూ.7 వేల కోట్లకుపైగా నిధులు ఉన్నాయన్నారు. కానీ తాము 2019లో అధికారం చేపట్టేనాటికి రూ.100 కోట్లే ఉందన్నారు.


తమ ప్రభుత్వ పాలనలో ఎన్నికల సమయంలో మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని అమలు చేశామన్నారు జగన్. గత ఐదేళ్లలో డీబీటీ ద్వారా రూ.2.71 లక్షల కోట్ వివిధ పథకాల రూపంలో అకౌంట్‌లో జమ చేశామన్నారు. తమ పాలనలో కేంద్రం ఇచ్చిన అనుమతుల కన్నా తక్కువ అప్పు చేశామని.. కరోనా సమయంలో కూడా పూర్తి స్థాయి బడ్జెట్‌ పెట్టామని గుర్తు చేశఆరు. ఆ సమయంలో కేంద్రం నుంచి పన్నుల వాటా తగ్గినా సరే.. సంక్షేమం మాత్రం ఆపలేదన్నారు. ఈ లెక్కలన్నీ బడ్జెట్‌లో చెప్పాల్సి వస్తుందనే చంద్రబాబు ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టడం లేదన్నారు.


చంద్రబాబు దృష్టి మళ్లించడంలో ఎక్స్‌పర్ట్‌ అన్నారు వైఎస్ జగన్. మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్నిప్రమాదం జరిగిన రోజే.. తాను రషీద్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వినుకొండకు వెళ్లానన్నారు. ఆ అంశాన్ని డైవర్ట్‌ చేయడానికే మదనపల్లె సబ్‌ కలెక్టర్‌ కార్యాలయం ఘటనను ప్రభుత్వం హైలెట్ చేసిందన్నారు. ఈ ఘటనలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్‌రెడ్డి ఏదో చేశారంటూ రాశారన్నారు. ఫైల్స్ తగలబడితే.. ఆన్‌లైన్‌లోనూ ఆ డాక్యుమెంట్లు ఉంటాయని.. కానీ ప్రభుత్వం మాత్రం ఏదో జరిగిపోయినట్లు హడావిడిగా డీజీపీని హెలికాప్టర్‌లో మదనపల్లె పంపించిందన్నారు. జగన్ అధికారంలో ఉండుంటే.. ఈపాటికే తమకు సంక్షేమం అంది ఉండేదని రాష్ట్ర ప్రజల్లో ఇప్పటికే చర్చ మొదలైందన్నారు. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై అన్యాయం కేసులు పెట్టారని.. ఆయన్ను ప్రజలు నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించారన్నారు. ముఖ్యమంత్రి కుమారుడు, మంత్రి నారా లోకేష్‌ ఏకంగా రెడ్‌బుక్‌ ప్రదర్శిస్తూ.. బెదిరింపులకు దిగారన్నారు జగన్. రాష్ట్రమంతా హోర్డింగ్‌లు ఏర్పాటు చేశారని.. ఎంత దారుణం అన్నారు. ఆంధ్రప్రదేశ్‌ అంటే అరాచకం, ఆటవికం, రెడ్‌బుక్‌ పాలనగా మారింనదన్నారు. రాష్ట్రంలో ఎవరూ రోడ్లపైకి రావొద్దని.. ఎన్నికల్లో హామీలు అమలు చేయకపోయినా, చంద్రబాబును ప్రశ్నించకూడదా అన్నారు. చంద్రబాబు విడుదల చేస్తుంది శ్వేతపత్రాలు కాదని.. అబద్దాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com