ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డిప్యూటీ సీఎంగా నా మెయిన్ ఫోకస్ అదే.. పవన్ కళ్యాణ్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Jun 15, 2024, 07:30 PM

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్.. మంత్రివర్గంలో తనకు కేటాయించిన శాఖలపై స్పందించారు. దీనికి సంబంధించి సుధీర్ఘమైన పత్రికా ప్రకటన విడుదల చేశారు. చంద్రబాబు మంత్రివర్గంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, అటవీ, పర్యావరణం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖలను పవన్ కళ్యాణ్‌కు కేటాయించారు. ఈ నేపథ్యంలో మంత్రిగా తాను చేయబోయే పనులు, తన ప్రాధాన్యాలను పవన్ కళ్యాణ్‌ను వివరించారు. సీఎం చంద్రబాబు తనకు కేటాయించిన శాఖలు అన్నీ తన మనసుకు, జనసేన మూల సిద్ధాంతాలకు చాలా దగ్గరగా ఉన్నాయని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. మంత్రిత్వశాఖలపై సంతోషం వ్యక్తం చేశారు.


"ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా నేను నిర్వర్తించబోయే శాఖలు నా మనసుకు, జనసేన మూల సిద్ధాంతాలకు చాలా దగ్గరగా ఉన్నాయి. ఈ బాధ్యతలు సంతోషం కలిగిస్తున్నాయి. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణం, అటవీ, శాస్త్ర సాంకేతికత శాఖలన్నీ ప్రజలకు ప్రత్యక్షంగా ఉపయోగపడేవి, ప్రభుత్వాన్ని ప్రజల దగ్గరకు చేర్చేవిగా నేను భావిస్తున్నా. 2008 నుంచి ప్రత్యక్ష రాజకీయాలలో ఉన్న నేను ఉభయ తెలుగు రాష్ట్రాలలో విస్తృతంగా పర్యటించా. 2019 ఎన్నికలకు ముందు ప్రజా సమస్యలపై అవగాహన, మౌలిక సదుపాయాల కల్పనపై అధ్యయనం కోసం ప్రజా పోరాట యాత్రను తలపెట్టాను." అని పవన్ కళ్యాణ్ ప్రకటనలో తెలిపారు. విశాఖ మన్యంలో పర్యటిస్తున్నపుడు కురిడి అనే గిరిజన గ్రామానికి వెళ్ళానన్న పవన్ కళ్యాణ్.. అక్కడి గిరిజనుల అవస్థలు తనను కలిచి వేశాయని చెప్పారు.


" కురిడి గ్రామ ఆడపడుచులు గుక్కెడు నీళ్ళ కోసం తాము పడుతున్న అవస్థలను చెబుతూ, అక్కడి బావిలో కలుషితమైపోయిన నీటిని నాకు చూపించారు. తోటవలస గ్రామానికి వెళ్లినప్పుడు తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఆ ఊరి ప్రజలు వివరించారు. గోదావరి జిల్లాలలో మత్యకార గ్రామాలవాసులు తాగు నీటి కోసం ఎన్ని ప్రయాసలుపడుతున్నామో చెప్పారు. గుక్కెడు మంచి నీటి కోసం మైళ్ళ దూరం వెళ్తున్న ఆడపడుచుల అవస్థలు చూసాను. కలుషితమైన నీటినే తాగు నీరుగా తప్పని పరిస్థితులలో వాడుకుంటున్న పల్లెవాసులను గమనించాను" అని పవన్ కళ్యాణ్ తన అనుభవాలను పేర్కొన్నారు.


  గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా మంత్రిగా ఉపాధి హామీ నిధులను సద్వినియోగం చేసుకోవడంతో పాటుగా, గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభిప్రాయపడ్డారు. అలాగే జల్ జీవన్ మిషన్ ద్వారా పల్లెలకు రక్షిత తాగు నీరు అందించి ప్రజల దాహం తీరుస్తానని చెప్పారు, ఇక పర్యావరణ మంత్రిగా ప్రజల ఆరోగ్యాలకు ఇబ్బందులు కలిగించకుండా.. పరిశ్రమలు ఆధునిక సాంకేతికను అందిపుచ్చుకునేలా వాటికి చేయూత అందిస్తామని పవన్ కళ్యాణ్ ప్రకటనలో తెలిపారు. గ్రీన్ ఎనర్జీని ఉపయోగించుకునేలా పరిశ్రమలను ప్రోత్సహిస్తామన్నారు.


తమ ప్రభుత్వంలో అడవులను కంటికి రెప్పలా కాపాడతామన్న పవన్ కళ్యాణ్.. ఎర్రచందనం, అటవీ సంపద అక్రమ రవాణాపై ఉక్కు పాదం మోపుతామని హెచ్చరించారు. అడవుల వినాశనానికి పాల్పడినా, ప్రయత్నించినా ఎంతటి వారైనా సరే కటకటాల వెనక్కు వెళ్ళవలసిందేనని స్పష్టం చేశారు. సామాజిక వనాలను పెంచటంతో పాటుగా.. మడ అడవుల పరిరక్షణపై ప్రత్యేక దృష్టి పెడతామన్నారు.ప్రజా పంపిణీ వ్యవస్థను అభివృద్ధి, రేషన్ కార్డుదార్లకు నిత్యావసరాలు పంపిణీపై దృష్టి పెడతామని.. రైతుల నుంచి పంటల కొనుగోలు విధానంతో పాటుగా వారికి సొమ్ములు చెల్లించడంలో మెరుగైన విధానాలు అనుసరిస్తామని పవన్ కళ్యాణ్ ప్రకటన విడుదల చేశారు.


ఏపీలో పర్యాటకం అభివృద్ధి జరిగితే ఉపాధి అవకాశాలు చాలా పెరుగుతాయన్న డిప్యూటీ సీఎం పవన్.. ఆహ్లాదకర పర్యాటకంతోపాటు, ధార్మిక, భక్తి పర్యాటకం అభివృద్ధిపై దృష్టి పెడతాని చెప్పారు. పర్యాటక కేంద్రాలలో మెరుగైన వసతులు కల్పిస్తామని.. సినిమా రంగానికి ప్రోత్సాహం అందిస్తామని చెప్పారు. చిత్రీకరణ ప్రాంతాలలో సినీ పరిశ్రమకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించడంతోపాటు ఈ రంగంలో రాష్ట్ర యువతకు ఉపాధి దక్కేలా చూస్తామని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com