ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అయోధ్య రామాలయాన్ని కూల్చేస్తుంది: నరేంద్ర మోదీ

national |  Suryaa Desk  | Published : Fri, May 17, 2024, 09:53 PM

దేశంలో లోక్‌సభ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. అధికార విపక్షాలు పరస్పర విమర్శలతో హోరాహోరీ పోరు సాగిస్తున్నారు. ఇక ఎన్నికలు చివరి దశకు చేరుకుంటుండటంతో మాటల్లో పదును పెరుగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఉత్తర్‌ప్రదేశ్‌లో పర్యటించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. ఇండియా కూటమిపై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలు కలిసి ఇండియా కూటమిలో భాగంగా పోటీ చేస్తున్నాయని.. అయితే ఒక వేళ ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి గెలిస్తే అయోధ్య రామ మందిరం ఉండదని తీవ్ర దుమారం రేపే వ్యాఖ్యలు చేశారు.


కాంగ్రెస్ పార్టీ, సమాజ్ వాదీ పార్టీలు తీవ్ర ప్రమాదకరమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ రెండు పార్టీలు కలిసి ఉన్న ఇండియా కూటమి అధికారంలోకి వస్తే అయోధ్యలో రామ మందిరంపైకి బుల్డోజర్లు పంపించి కూల్చేస్తారని నరేంద్ర మోదీ ఆరోపించారు. అయితే బుల్డోజర్లు ఎక్కడ నడపాలనే విషయంపై ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ వద్ద క్లాసులు చెప్పించుకోవాలని ప్రధాని కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీలకు హితవు పలికారు. ఈ క్రమంలోనే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి వరుసగా మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టబోతోందని జోస్యం చెప్పారు.


రామ మందిరం పనికి రాదని శ్రీరామనవమి రోజున సమాజ్ వాదీ పార్టీకి చెందిన ఓ నేత అన్నారని ప్రధాని గుర్తు చేశారు. అదే సమయంలో రామమందిరంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తోసిపుచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధమవుతోందని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి గాంధీల కుటుంబం, అధికారం మాత్రమే ముఖ్యమని మోదీ ఆరోపించారు. ఎస్పీ-కాంగ్రెస్ కూటమి అధికారంలోకి వస్తే రామ్ లల్లాను మరోసారి గుడారంలోకి పంపి.. అయోధ్య రామాలయాన్ని కూల్చేస్తారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉత్తర్‌ప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం.. రాష్ట్రంలో నేరస్తులను జైలుకు పంపిస్తూ.. వారి ఆస్తులను బుల్డోజర్లను ఉపయోగించి కూల్చేస్తోందని చెప్పారు.


కొత్తగా ఏర్పడే ప్రభుత్వంలో పేదలు, మహిళలు, యువత, రైతుల కోసం ఎన్నో భారీ నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని ప్రధాని మోదీ వెల్లడించారు. అందుకోసమే తాను ఇక్కడికి వచ్చానని.. ఉత్తర్‌ప్రదేశ్‌లోని బారాబంకీ, మోహన్‌లాల్ గంజ్ నియోజకవర్గ ప్రజలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇక లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడే జూన్ 4 వ తేదీ ఎంతో దూరంలో లేదని.. ఆ రోజు కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం హ్యాట్రిక్ కొట్టబోతోందని.. ఈ దేశంతోపాటు ప్రపంచానికి కూడా తెలుసని తెలిపారు.


భారతదేశ ప్రయోజనాలను రక్షించేందుకు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఒకవైపు ప్రయత్నిస్తుంటే.. మరోవైపు దేశంలో అస్థిరత సృష్టించేందుకు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ప్రయత్నాలు చేస్తోందని ప్రధాని మోదీ తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికలు జరుగుతున్న కొద్దీ దేశంలో ఇండియా కూటమిని ప్రజలు పేకమేడలా కూల్చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ఎంపీలు కావాలి కానీ.. మోదీని తిట్టేవారు కాదని.. అభివృద్ధి కోసం బీజేపీకే ఓటు వేయాలని ప్రజలకు ప్రధాని విజ్ఞప్తి చేశారు. 100 సీసీ ఇంజన్‌తో 1000 సీసీ స్పీడ్‌ని సాధించగలరా.. వేగంగా అభివృద్ధి చెందాలనుకుంటే.. బలమైన ప్రభుత్వం మాత్రమే దాన్ని చేరుకోగలదని మోదీ చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com