ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ నెల 10 నుంచి మళ్లీ జనాల్లోకి చంద్రబాబు,,,జిల్లాల వారీగా పర్యటనలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Dec 02, 2023, 08:05 PM

టీడీపీ అధినేత చంద్రబాబు జనాల్లోకి వెళ్లేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలో పూర్తిస్థాయిలో పార్టీ కార్యకలాపాల్లో నిమగ్నం కాబోతున్నారు. ఈ నెల 10 నుంచి జిల్లాల పర్యటనలకు వెళ్లేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రాష్ట్రంలోని నాలుగు ప్రాంతాల్లో పంచాయతీరాజ్‌ ఛాంబర్‌, సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే సమావేశాల్లో పాల్గొంటారు. ఈ నెల 10న శ్రీకాకుళం, 11న కాకినాడ, 14న నరసరావుపేట, 15న కడపల్లో ఈ సమావేశాలు జరుగుతాయి. అంతేకాదు ఓటర్ల జాబితాలో వైఎస్సార్‌సీపీ చేస్తున్న అక్రమాలపై ఢిల్లీ వెళ్లి కేంద్ర ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు ఫిర్యాదు చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. ఇందుకోసం సమయం ఇవ్వాలని సీఈసీకి చంద్రబాబు లేఖ రాయనున్నట్టు సమాచారం.


మరోవైపు చంద్రబాబు శనివారం ఉదయం విజయవాడ కనకదుర్గమ్మ దర్శనం చేసుకోనున్నారు. ఆదివారం సింహాచలం అప్పన్నను, ఈ నెల 5న శ్రీశైలం మల్లన్నను దర్శించుకుంటారు. అనంతరం కడపలోని అమీన్‌పీర్‌ దర్గా, విజయవాడలోని గుణదల మేరీమాత ఆలయాల్ని సందర్శిస్తారు. శుక్రవారం రోజు తిరుమల శ్రీవారిని కూడా దర్శించుకున్న సంగతి తెలిసిందే. అక్కడి నుంచి బయల్దేరి ఉండవల్లి నివాసానికి చేరుకున్నారు.


ఉండవల్లి లో నారా చంద్రబాబు నివాసంలో టీడీపీ పార్లమెంటరీ సమావేశం నిర్వహించారు. పార్టీ ఎంపీలు, రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు, ఇతర నేతలు హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల కింది రాష్ట్రానికి నిథులు ఇస్తున్నా..వాటని సద్వినియోగం చేసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలుగు దేశం పార్లమెంటరీ పార్టీ అభిప్రాయ పడింది. రానున్న పార్లమెంట్ సమావేశంలో రాష్ట్రానికి సంబంధించి ప్రస్తావించాల్సిన అంశాలపై ఈ సమావేశంలో చర్చించామన్నారు. కేంద్రం పథకాలకు విరివిగా నిథులు ఇస్తుందని.. అయితే నేడు రాష్ట్ర వాటా నిథులు విడుదల చేయకపోవడం వల్ల అనేక పథకాలు నిలిచిపోయాయన్నారు. దీని వల్ల అంతిమంగా రాష్ట్ర ప్రజలు నష్టపోయారని సమావేశం అభిప్రాయ పడింది.


రాష్ట్ర ప్రభుత్వానికి రాజకీయ కక్ష సాధింపులపై ఉన్న శ్రద్ద నిధుల సద్వినియోగంపై లేదని నేతలు అన్నారు. రాష్ట్రంలో వ్యవస్థలు గాడి తప్పి వ్యవహరిస్తున్న విధానాన్ని పార్లమెంట్ లో ప్రస్తావించాలని ఎంపిలకు చంద్రబాబు సూచించారు. అన్ని విధాలా విఫలమైన జగన్ ప్రభుత్వం ఓట్ల జాబితాలో అక్రమాల ద్వారా లబ్ది పొందాలని చూస్తుందని...ఈ అంశంపై డిల్లీలో గళం వినిపించాలని పార్టీ అధినేత చంద్రబాబు ఎంపిలకు సూచించారు. పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం, విభజన చట్టం హామీల సాధనలో విఫలమవడం వంటి అంశాలను లేవనెత్తాలని చంద్రబాబు సూచించారు. రాష్ట్రంలో ప్రజా సమస్యలపై పార్లమెంట్ లో ప్రస్తావన ద్వారా జగన్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చంద్రబాబు సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com