ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉత్తర చైనాలో అంతుచిక్కని న్యూమోనియా కేసులు,,,,రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం సూచనలు

national |  Suryaa Desk  | Published : Wed, Nov 29, 2023, 09:54 PM

చైనాలో పెరుగుతున్న కొత్తరకం న్యూమోనియా కేసులపై కేంద్రం హెచ్చరికల నేపథ్యంలో పలు రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. కనీసం ఐదు రాష్ట్రాలు ఆరోగ్య మౌలిక వసతులను సిద్ధం చేసుకుంటున్నాయి. రాజస్థాన్, కర్ణాటక, గుజరాత్, ఉత్తరాఖండ్, తమిళనాడులోని రాష్ట్ర ప్రభుత్వాలు శ్వాసకోశ సమస్యలతో వచ్చే రోగుల చికిత్సకు సంసిద్ధంగా ఉండాలని ఆసుపత్రులు, ఆరోగ్య సంరక్షణ సిబ్బందిని కోరాయి. సీజనల్ ఫ్లూ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కర్ణాటక ఆరోగ్య శాఖ సూచించింది. సీజనల్ ఫ్లూ లక్షణాలు, ప్రమాద కారకాలను జాబితా చేసిన ప్రభుత్వం.. చేయాల్సినవి, చేయకూడనవి కూడా పేర్కొంది. దగ్గు లేదా తుమ్మినప్పుడు నోరు, ముక్కుకు అడ్డుపెట్టుకోవడం, తరచుగా చేతులు శుభ్రం చేసుకోవడం, ముఖాన్ని తాకకుండా ఉండటం, రద్దీ ప్రదేశాలలో మాస్క్‌లను ఉపయోగించడం వంటివి ఇందులో ఉన్నాయి. ఇక, రాజస్థాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ సైతం సూచనలు చేసింది. ‘పరిస్థితి ప్రస్తుతం ఆందోళనకరంగా లేదు కానీ వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి.. అంటు వ్యాధుల వ్యాప్తిని నిరోధించాలి. పీడియాట్రిక్ యూనిట్లు, మెడిసిన్ విభాగాల్లో తగిన ఏర్పాట్లు చేయాలి’ అని పేర్కొంది.


గుజరాత్‌ ఆరోగ్య మంత్రి రుషికేశ్ పటేల్ మాట్లాడుతూ.. కోవిడ్ -19 మహమ్మారి సమయంలో సృష్టించిన ఆరోగ్య సంరక్షణ మౌలిక సదుపాయాలను చైనా పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ముందుజాగ్రత్త చర్యగా బలోపేతం చేస్తున్నామని చెప్పారు. సంసిద్ధతను సమీక్షించాలని అధికారులను రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఉత్తరాఖండ్ ప్రభుత్వం శ్వాసకోశ వ్యాధుల కేసులపై నిఘా పెంచాలని ఆరోగ్య అధికారులను ఆదేశించింది. ఉత్తరాఖండ్‌లోని చమోలి, ఉత్తరకాశీ, పితోరాఘర్ జిల్లాలు చైనాతో సరిహద్దులను పంచుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్రం ముందస్తు చర్యలు చేపట్టింది. అయితే, పిల్లల్లో న్యుమోనియా కేసులు నమోదు కానప్పటికీ, ముందుజాగ్రత్త చర్యగా అప్రమత్తంగా ఉండాలని అధికారులను కోరినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.


చైనాలో కొత్తరకం న్యూమోనియా బారినపడి పిల్లలు పెద్ద సంఖ్యలో ఆస్పత్రుల్లో చేరుతున్నట్టు డబ్ల్యూహెచ్ఓ గతవారం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో భారత్ సహా ప్రపంచ దేశాలు అప్రమత్తమయ్యాయి. ఇందులో భాగంగా కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాస్తూ.. ఎటువంటి పరిస్థితిని ఎదుర్కొడానికి సిద్ధంగా ఉండాలని సూచించింది. ప్రస్తుతం పరిస్థితి ఆందోళనకరంగా లేదు, కానీ, నిశితంగా పరిశీలిస్తున్నామని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. కోవిడ్-19 నేపథథ్యంలో ఇన్‌ఫ్లూయెంజా వంటి తీవ్ర శ్వాసకోశ అనారోగ్య కేసుల సమీక్ష కోసం ఈ ఏడాది మొదట్లో సూచించిన కార్యాచరణ మార్గదర్శకాలను అమలు చేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించాం.. ’ అని కేంద్రం పేర్కొంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com