ఎమ్మెల్యేలను పట్టుకుని కొట్టడం ఏంటి?.. వారు మనుషులా? పశువులా?.. బుచ్చయ్య చౌదరి వంటి సీనియర్ నేత పట్ల ఇలా వ్యవహరించడం తగదు అని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమితో వైసీపీ నిరాశ కలిగి ఉంది. నిరక్షరాస్యులకు ఓటు హక్కు కల్పించి మరి దొంగ ఓట్లు వేయించుకున్నారు. అయినా సరే ఓడిపోవడంతో నిరాశలో కూరుకుపోయారు. అందుకే అసెంబ్లీలో ఇలాంటి అరాచకాలకు పాల్పడుతున్నారు. గతంలో అసెంబ్లీలో తోపులాట జరిగిందే తప్ప, ఇలాంటి దాడులు చోటు చేసుకోలేదు. టీడీపీ ఎమ్మెల్యేలకు సమాధానం చెప్పలేక, కొడతారా?..స్పీకర్, సీఎం ఇద్దరిదీ తప్పు ఉంది. స్పీకర్ , సీఎం జగన్ ఇద్దరూ బహిరంగంగా క్షమాపణ చెప్పాలి. అధికారం, సీఎం పదవి శాశ్వతం కాదు. రేపు నువ్వు అటు వైపు ఉంటావు.. దాడికి పాల్పడ్డ ఎమ్మెల్యేలను శాశ్వతంగా సస్పెండ్ చేయాలి. దాడికి పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవడం మాని, బాధితులను సస్పెండ్ చేయడం తగదు. ఇలాంటి ఘటన ప్రజాస్వామ్యంలో చీకటి రోజు’’ అని నారాయణ అన్నారు.