ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మహారాష్ట్ర సర్కార్ సంక్షోభం ఇలా సాగింది

national |  Suryaa Desk  | Published : Thu, Jun 23, 2022, 03:17 PM

దేశ రాజకీయాలలో ఇపుడు మహారాష్ట్ర సర్కార్ సంక్షోభంపై హాట్ టాపిక్ నడుస్తోంది. మహారాష్ట్రలో ఎంవీఏ సర్కార్ ఇక కష్టసాధ్యమేనని తేలిపోయింది. అయితే మహారాష్ట్ర భవిష్యత్తు ఏమిటీ అన్న చర్చలు కూడా ప్రారంభమయ్యాయి. మంత్రి ఏక్‌నాథ్ షిండే తిరుగుబాటు తర్వాత మహారాష్ట్ర రాజకీయాలు రోజురోజుకు మరింత వేడుకెక్కుతున్నాయి. అటు షిండే కానీ, ఇటు ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే కానీ వెనక్కి తగ్గకపోవడంతో ప్రభుత్వం పతనం అంచుకు చేరుకుంది. ఇక, అధికారంలో కొనసాగడం కష్టమని ఊహించిన ఉద్ధవ్.. రాజీనామాకు ముందే అధికారిక నివాసాన్ని ఖాళీ చేయడం చూస్తుంటే ఎమ్మెల్యేలను నిలుపుకుని అధికారాన్ని కాపాడుకోవడం అసాధ్యమన్న అంచనాకు సీఎం వచ్చారని అర్థమవుతోంది. మరోవైపు, అధికార మహా వికాస్ అఘాడీ కూటమి(ఎంవీఏ) పార్టీలైన కాంగ్రెస్, ఎన్సీపీలు తమ ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఇదిలావుంటే ఈ నెల 20న మంత్రి ఏక్‌నాథ్ షిండే తన మద్దతుదారులైన శివసేన ఎమ్మెల్యేలతో బీజేపీ పాలిత రాష్ట్రమైన గుజరాత్‌లోని సూరత్ వెళ్లి ఓ హోటల్‌ క్యాంపు వేశారు. షిండే తిరుగుబాటులో మహారాష్ట్రలో రాజకీయ అలజడి నెలకొంది. రంగంలోకి దిగిన పార్టీ ముఖ్య నేతలు ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు పలు ప్రయత్నాలు చేశారు. ఏక్‌నాథ్ షిండే, ఇతర ఎమ్మెల్యేలతో చర్చలు జరుపుతున్నామని, వారు తిరిగి వస్తారని సేన ఎంపీ సంజయ్ రౌత్ నిన్నటి వరకు చెప్పుకొచ్చారు. సంజయ్ రౌత్ వ్యాఖ్యలను షిండే కొట్టిపడేశారు. ఎమ్మెల్యేలతో తప్ప తానెవరితోనూ టచ్‌లో లేనని స్పష్టం చేశారు.  శివసేన తన దూతలను సూరత్‌లో ఎమ్మెల్యేలు క్యాంపు వేసిన హోటల్‌కు పంపడంతో ఇక లాభం లేదని, షిండే తన ఎమ్మెల్యేలతో కలిసి అసోంలోని గౌహతికి మకాం మార్చారు. ఇది కూడా బీజేపీ పాలిత రాష్ట్రమే కావడం గమనార్హం. శివసేనకు చెందిన 55 మంది ఎమ్మెల్యేలలో తనకు 42 మంది మద్దతు ఉందని షిండే తేల్చిచెప్పారు. ఫిరాయింపుల నిరోధక చట్టం నుంచి తప్పించుకోవాలంటే కనీసం మూడింట రెండొంతుల మంది ఎమ్మెల్యేల మద్దతు ఆయనకు అవసరం. కాగా, నిన్న సాయంత్రం శివసేనకు చెందిన మరో ఇద్దరు శాసనసభ్యులు షిండే శిబిరంలో చేరారు. మరో ముగ్గురు కూడా చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఎంవీఏలోని మిత్ర పక్షాలైన కాంగ్రెస్, ఎన్‌సీపీ మాత్రం తాము సేనతోనే ఉన్నామని తేల్చి చెప్పాయి. తిరుగుబాటు అనేది ఆ పార్టీ అంతర్గత విషయమని అన్నారు. అంతేకాదు, రాష్ట్రంలో రాజకీయ సంక్షోభానికి బీజేపీనే కారణమని నిందించారు. 


ఇదిలావుంటే సంక్షోభం మధ్య శివసేన మంగళవారం ఏకనాథ్ షిండేను శాసనసభా పక్ష నేతగా తొలగించింది. మరోవైపు గువాహటిలో ఉన్న సేన రెబల్ ఎమ్మెల్యేలు మొదటిసారిగా మహారాష్ట్ర గవర్నర్ భగత్‌సింగ్ కోష్యారీకి లేఖ రాస్తూ.. షిండే ఇప్పటికీ శాసనసభా పక్ష నేతగానే ఉన్నారని పేర్కొన్నారు.  తిరుగుబాటు నేపథ్యంలో మహా సర్కారు మైనారిటీలో పడిపోవడంతో స్పందించిన ఉద్ధవ్ థాకరే.. ఎమ్మెల్యేలు కోరితే తాను సీఎం పదవికి రాజీనామా చేస్తానని చెప్పారు. రాజీనామా లేఖను సిద్ధం చేసినట్టు కూడా చెప్పారు. తిరుగుబాటు ఎమ్మెల్యే ఎవరైనా ఇక్కడికొచ్చి రాజీనామా లేఖను తీసుకెళ్లి గవర్నర్‌కు ఇవ్వాలని కోరారు.  షిండే తిరుగుబాటు తర్వాత నిన్న ఉద్ధవ్ థాకరే తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేశారు. సబర్బన్ బాంద్రాలోని తన కుటుంబ నివాసమైన మాతోశ్రీకి మారారు. ఫిరాయింపుల నిరోధక చట్టం నుంచి తప్పించుకోవడానికి అవసరమైన ఎమ్మెల్యేల సంఖ్యను షిండే కలిగి ఉన్నారు.  


మహారాష్ట్ర అసెంబ్లీలో మొత్తం బలం 287. సభలో విశ్వాస తీర్మానం జరిగితే 144 సభ్యుల బలం అవసరం. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌తో కూడిన అధికార కూటమికి 169 సీట్లు ఉన్నాయి. షిండే నేతృత్వంలోని ఎమ్మెల్యేలు రాజీనామా చేస్తే మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం మైనారిటీలో పడిపోతుంది. ఫలితంగా ప్రభుత్వం కుప్పకూలుతుంది. శివసేనకు 55 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అమలు చేయాలంటే ఉద్ధవ్‌కు కనీసం 37 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. 


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com