ప్రపంచంలోనే అతిచిన్న యువతిగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బడ్వానీ జిల్లాకు చెందిన సోనాలి రికార్డుల్లోకి ఎక్కనుంది. ఆమ్దా గ్రామానికి చెందిన సోనాలి కంటిలాల్ వయసు 17 ఏళ్లు. ఆమె ఎత్తు ఒకటిన్నర అడుగులు మాత్రమే. జన్యులోపంతో పుట్టిన ఆమె వయసుకు తగినట్లు ఎదగలేదు. ఇప్పుడు ఆమె ప్రపంచంలోనే అతిచిన్న యువతిగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకునే అవకాశం కనిపిస్తోంది. సోనాలి 2005లో జన్మించింది. ఆమె దాదాపు రెండేళ్ల వయసున్న పాపలా కనిపిస్తుంది. ఇటీవల డాక్టర్లు ఆమెకు అన్ని పరీక్షలు చేసి దివ్యాంగుల ధ్రువపత్రం జారీ చేశారు. కంటిలాల్ కు నలుగురు పిల్లలున్నారు. వారిలో సోనాలి అందరికన్నా పెద్ద. ఆమె తర్వాత జన్మించిన ముగ్గురు మగ పిల్లలు సాధారణంగానే ఉన్నారు. కానీ, సోనాలి వయసుకు తగినట్లుగా ఎదగలేదు. ఆమెకు నెలకు రూ.1000 పింఛన్ వస్తుందని కంటిలాల్ తెలిపారు.
ప్రపంచంలోనే అతిచిన్న మహిళ అనగానే మహారాష్ట్రలోని నాగ్‌పుర్ కు చెందిన జ్యోతి కిసాంజి అమ్గె గుర్తుకు వస్తారు. 2 అడుగుల ఎత్తున్న ఆమె గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో చోటు సంపాదించారు. అయితే సోనాలి ఎత్తు జ్యోతి కంటే తక్కువ కావడంతో ప్రపంచంలోనే అతిచిన్న యువతిగా సోనాలి పేరు త్వరలోనే గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో ఎక్కనుందని బడ్వానీ జిల్లా ఆసుపత్రి వైద్యులు తెలిపారు.