ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విస్మయ ఆత్మహత్య కేసు.. భర్తను దోషిగా తేల్చిన కోర్టు

national |  Suryaa Desk  | Published : Tue, May 24, 2022, 12:15 PM

కేరళలో గతేడాది మెడికల్‌ విద్యార్థి విస్మయ ఆత్మహత్య కేసు సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో సోమవారం తీర్పు వెలువడింది. విస్మయ భర్త కిరణ్​ కుమార్ ​ను కేరళ కోర్టు దోషిగా తేల్చింది. కట్నం కోసం వేధించి, విస్మయను భర్తే ఆత్మహత్యకు పాల్పడేలా చేశాడని కోర్టు నిర్దారించింది. మంగళవారం శిక్ష ఖరారు చేయనుంది. ప్రస్తుతం బెయిల్‌ పై ఉన్న కిరణ్​ ను తీర్పు వెలువడిన వెంటనే పోలీసులు అదుపులోకి తీసుకుని, జైలుకు తరలించారు. ఈ కేసులో దోషికి సాధ్యమైనంత ఎక్కువ శిక్ష పడేలా చూస్తామని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ మోహన్​రాజ్ పేర్కొన్నారు.


విస్మయ చదువు పూర్తి కాకముందే 2019 మే 19న ఆమెకు తన తల్లిదండ్రులు పెళ్లి చేశారు. అసిస్టెంట్ మోటర్ వెహికిల్ ఇన్​స్పెక్టర్​ అయిన కిరణ్​ కుమార్‌ తో పెళ్లి జరిపించారు. కట్నంగా 100 సవర్ల బంగారం, ఎకరం భూమి, రూ.10లక్షల కారు ఇచ్చారు. అయితే కారు నచ్చలేదని, తనకు రూ.10లక్షలు డబ్బు ఇవ్వాలని కిరణ్‌ డిమాండ్ చేశాడు. ఇదే విషయమై విస్మయను చిత్రహింసలకు గురిచేసేవాడు.


2021 జూన్​ 20న విస్మయ తన కుటుంబ సభ్యులకు ఓ వాట్సాప్ మెసేజ్ చేసింది. కట్నం కోసం కిరణ్​ తనను వేధిస్తున్నాడని, అతడు కొట్టడంతో శరీరంపై అయిన గాయాలను ఫొటోలు తీసి అందరికీ పంపింది. ఆ మరుసటి రోజే కొల్లాం జిల్లా సస్థంకొట్టాలోని కిరణ్ ఇంట్లో ఆమె శవమై కనిపించింది. కాగా విస్మయ మృతికి కిరణే కారణమని ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసుపై పోలీసులు ముమ్మర దర్యాప్తు జరిపి, వరకట్న వేధింపుల కారణంగానే విస్మయ ఆత్మహత్యకు పాల్పడిందంటూ 500పేజీలకు పైగా అభియోగ పత్రాలు దాఖలు చేశారు. ఈ ఛార్జ్​షీట్​ ను పరిగణనలోకి తీసుకున్న కోర్టు సోమవారం కిరణ్​ ను దోషిగా తేల్చింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com