ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భారత్‌లో కరోనా బీభత్సం.. ఐదు రోజుల్లో లక్ష కేసులు

national |  Suryaa Desk  | Published : Sat, Jul 04, 2020, 04:43 PM

భారత్‌లో కరోనా విజృంభణకు రికార్డులు బద్దలవుతున్నాయి. కేవలం ఒక్క నెల.. 30 రోజులు.. 3,94,958 మంది బాధితులు. దేశంలో జూన్‌ నెలలో కరోనా ఉధృతికి నిదర్శనం ఈ గణాంకాలు. నెల రోజుల్లోనే దాదాపు 4 లక్షల మంది కరోనా మహమ్మారి బారిన పడడం గమనార్హం. రాబోయే రోజుల్లో వైరస్‌ వ్యాప్తి తీవ్రంగా ఉంటుందని వైద్య వర్గాలు హెచ్చరిస్తున్న నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సి ఉంది. దేశంలో కరోనా విజృంభణ తీవ్రమవుతోంది. గత ఐదు రోజుల్లోనే లక్ష కేసులు నమోదవడం పరిస్థితి తీవ్రతను చాటుతోంది. లక్ష కేసులకు 110 రోజులు పడితే, 44 రోజుల్లోనే మిగతా 5 లక్షల కేసులు నమోదయ్యాయి. మధ్యలో వరుసగా రెండ్రోజుల పాటు తగ్గినట్లే తగ్గిన కేసులు మళ్లీ పెరిగాయి. మంగళ, బుధవారాల్లో 18 వేల పైగా కేసులు నమోదుకాగా.. గురువారం 19,148 మంది వైరస్‌ బారినపడ్డారు. 434 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో 34 వేల మంది రోగులకు ఐసీయూ చికిత్స, 37 వేల మందికి ఆక్సిజన్‌ అవసరం ఉందని, 9 వేల మంది వెంటిలేటర్లపై ఉన్నారని కేంద్ర మంత్రిత్వ వర్గాలు తెలిపాయి.


రికవరీ రేటు 59.52 శాతానికి చేరిందని శాఖ వెల్లడించింది. కరోనా పరీక్షల సంఖ్య 90 లక్షలు దాటింది. బుధవారం 2.29 లక్షల నమూనాలను పరీక్షించినట్లు ఐసీఎంఆర్‌ తెలిపింది. మే 25 నాటికి రోజువారీ సామర్థ్యం లక్షన్నర పరీక్షలు కాగా, ఈ నెల 1 నాటికి అది రెట్టింపైంది.


అనుమానిత లక్షణాలతో ఎవరైనా చనిపోతే వైరస్‌ నిర్ధారణ పరీక్షల ఫలితం కోసం ఆగకుండా మృతదేహాలను వెంటనే బంధువులకు అప్పగించాలని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. అంత్యక్రియలు మాత్రం కొవిడ్‌ నిబంధనలకు అనుగుణంగా జరగాలని స్పష్టం చేసింది.కాగా, మహారాష్ట్రలో వైరస్‌ కారక మరణాలు 8 వేలు దాటాయి. ఆ రాష్ట్రంలో కొత్తగా 5,537 మంది కొవిడ్‌ బారినపడ్డారు. జైళ్లలో ఖైదీలకు కరోనా సోకకుండా..


ఐసీఎంఆర్‌ మార్గదర్శకాలను పాటించాలని ప్రభుత్వానికి బాంబే హైకోర్టు సూచించింది. ఢిల్లీలో.. వైరస్‌ ఉధృతి క్రమంగా తగ్గుతున్నట్లు కనిపిస్తోంది. అక్కడ తాజాగా 2,373 మందికి వైరస్‌ సోకింది.


వజ్రాల పరిశ్రమలకు పేరుగాంచిన ఆరోగ్య కార్యకర్తలకు ప్రైవేటు ఆస్పత్రులు, నర్సింగ్‌ హోంలు ఎన్‌-95 మాస్క్‌లు, పీపీఈ కిట్లు సమకూర్చకుంటే ఫిర్యాదు చేసేందుకు హెల్ప్‌లైన్‌ నంబరు వంటి యంత్రాంగం ఏర్పాటు చేయాలని ఢిల్లీ హైకోర్టు ప్రభుత్వానికి సూచించింది. ఢిల్లీలో గురువారం ప్లాస్మా బ్యాంక్‌ను సీఎం కేజ్రీవాల్‌ ప్రారంభించారు. గుజరాత్‌లోని సూరత్‌లో కేసులు 5 వేలు దాటాయి. కర్ణాటకలో కొత్తగా 1,502 కేసులు నమోదయ్యాయి.


ఇందులో బెంగళూరువే 889 కేసులున్నాయి. నగరంలో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు రద్దీగా మారాయి. నెగిటివ్‌ నివేదిక ఉన్నా బెంగళూరులో ఓ మహిళ ప్రసవం కోసం 16 గంటల పాటు ఐదు ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వచ్చింది. తమిళనాడులో 32 వేల మందికి జరిపిన పరీక్షల్లో 4,343 కేసులు వెలుగుచూశాయి.


చెన్నైలో 2,027 కేసులు నమోదయ్యాయి. 58మంది ప్రాణాలు కోల్పోయారు. ముమ్మరంగా కోవిడ్‌-19 టెస్ట్‌లు.. కోటి దాటనున్న కరోనా టెస్టుల సంఖ్య కరోనా మహమ్మారిని నిరోధించడంలో కీలకమైన కోవిడ్‌-19 పరీక్షలను పెద్దసంఖ్యలో చేపట్టేందుకు చర్యలు చేపడుతున్నట్టు ప్రభుత్వం పేర్కొంది.


త్వరలోనే దేశవ్యాప్తంగా కరోనా పరీక్షల సంఖ్య కోటి దాటనుందని ప్రభుత్వం గురువారం వెల్లడించింది. జులై 2 నాటికి దేశవ్యాప్తంగా పలు ల్యాబ్‌ల్లో మొత్తం 90,56,173 కోవిడ్‌-19 పరీక్షలను నిర్వహించినట్టు ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మొత్తం 1065 టెస్టింగ్‌ ల్యాబ్‌లకు ఐసీఎంఆర్‌ అనుమతి లభించగా వాటిలో 768 ప్రభుత్వ ల్యాబ్‌లు కాగా, 297 ప్రైవేట్‌ ల్యాబ్‌లున్నాయి. రోజురోజుకూ టెస్టింగ్‌ సామర్థ్యం మెరుగుపడుతుండగా ఈనెల 1న 2,29,598 కోవిడ్‌-19 టెస్టులు నిర్వహించారు. మరోవైపు పరీక్షల వేగం పెంచేందుకు కోవిడ్‌-19 పరీక్షను కేవలం ప్రభుత్వ వైద్యుల ప్రిస్క్రిప‍్షన్‌తోనే కాకుండా ఏ నమోదిత డాక్టర్‌ ప్రిస్క్రిప్షన్‌తో అయినా నిర్వహించే వెసులుబాటును కల్పించినట్టు ప్రభుత్వం పేర్కొంది. ఐసీఎంఆర్‌ మార్గదర్శకాలకు అనుగుణంగా కోవిడ్‌-19 పరీక్షలను ముమ్మరంగా చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు, కేంద్ర పాలితప్రాంతాలను కోరింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com