ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నల్లచొక్కాలతో చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jun 16, 2020, 12:10 PM

రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మంగళవారం ఉదయం ప్రారంభం అయ్యాయి. ఈ ఉదయం సరిగ్గా 10 గంటలకు శాసనసభ, శాసన మండలి సమావేశమైంది. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్.. రాజ్‌భవన్ నుంచే ఆన్‌లైన్ ద్వారా ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. మంత్రివర్గం రూపొందించి, ఆమోదించిన ప్రసంగ పాఠాన్ని ఆయన చదివి వినిపించారు. రాజ్‌భవన్‌లోని దర్బార్ హాలు నుంచి గవర్నర్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు.


ఊహించినట్టే- తెలుగుదేశం పార్టీ నిరసనల పర్వానికి తెర తీసింది. సభా కార్యకలాపాలు ఆరంభం నుంచే టీడీపీ సభ్యులు తమ నిరసనలను తెలియజేశారు. శాసనసభ ప్రారంభం కావడానికి ముందే వారు ప్రభుత్వ వైఖరిని దనుమాడారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, మాజీ మంత్రి నారా లోకేష్ సహా ఆ పార్టీ సభ్యులందరూ నల్లచొక్కాలను ధరించి కనిపించారు. సభలో అధికార పార్టీపై తాము ఏ విధంగా వ్యవహరిస్తామనే విషయాన్ని చెప్పకనే చెప్పారు. ఇదివరకు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వ విధానాలను నిరసిస్తూ ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నల్లచొక్కాలను ధరించారు.


ఈ ఉదయం 9 గంటల సమయంలో వెలగపూడిలోని శాసనసభ, శాసన మండలి ప్రాంగణానికి చేరుకున్నారు టీడీపీ సభ్యులు. వచ్చిన వెంటనే అసెంబ్లీ గేటు ఎదుట నిరసన ప్రదర్శనలను చేపట్టారు. నారా లోకేష్ సహా టీడీపీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు ప్లకార్డులను ప్రదర్శించారు. అధికార పార్టీ కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని నినదించారు. ప్రతీకార చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. ప్లకార్డులను ప్రదర్శించారు. బడుగు, బలహీన వర్గాలను అణచి వేస్తోందని మండిపడ్డారు. అందులో భాగంగానే.. తమ పార్టీ శాసనసభాపక్ష ఉప నేత అచ్చెన్నాయుడిని అరెస్టు చేశారని ఆరోపించారు.నారా లోకేష్, ప్రజా పద్దుల కమిటీ ఛైర్మన్ పయ్యావుల కేశవ్, ఎమ్మెల్యేలు నిమ్మల రామానాయుడు, జీవీజీ ఆంజనేయులు, ఎమ్మెల్సీలు దీపక్ రెడ్డి, బీదా రవిచంద్ర తదితరులు ప్లకార్డులను ప్రదర్శించారు. కోవిడ్ మార్గదర్శకాల ప్రకారం.. ప్లకార్డులను తీసుకుని సభా ప్రాంగణంలోనికి ప్రవేశించడానికి అనుమతి లేదు. ఫలితంగా-వారు గేటు బయటే తమ నిరసనను తెలియజేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదాలు చేశారు. పయ్యావుల కేశవ్ సహా కొందరు సభ్యులు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ వైఖరిపై తమ పోరాటాన్ని కొనసాగిస్తామని అన్నారు.


అంతకుముందు- చంద్రబాబు సారథ్యంలో పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు శాసనసభ ప్రాంగణంలోకి ప్రవేశించిన వెంటనే పార్టీ వ్యవస్థాపకుడు, దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు విగ్రహానికి పూలమాలలు వేశారు. నివాళి అర్పించారు. ఎన్టీఆర్ అమర్ రహే అంటూ నినాదాలు చేశారు. ఎన్టీ రామారావు ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని అధికార పక్షంపై నిరంతర పోరాటం కొనసాగిస్తామని అన్నారు. ఎన్టీ రామారావు తన హయాంలో బీసీలను చేరదీశారని, వారిని రాజకీయంగా అత్యున్నత స్థాయికి తీసుకొచ్చారని చంద్రబాబు చెప్పారు. అలాంటి బీసీలను వైసీపీ ప్రభుత్వం అణగదొక్కేస్తోందని మండిపడ్డారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com