ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాష్ట్రాలకు ట్రంప్ హెచ్చరిక

international |  Suryaa Desk  | Published : Tue, Jun 02, 2020, 08:34 AM

ఆఫ్రికన్‌-అమెరికన్‌ జార్జ్‌ ఫ్లాయిడ్‌ మృతితో అమెరికాలో కొనసాగుతున్న నిరసనలు, ఆందోళనలు పలు రాష్ట్రాల్లో ఉద్ధృతమయ్యాయి. మొత్తం 140 నగరాల్లో నిరసనలు కొనసాగుతున్నాయి. ఏకంగా అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్‌‌ బయటే భారీ స్థాయిలో ఆందోళనలు చేపట్టారు. దీంతో అధ్యక్షుడు కొద్దిసేపు రహస్య బంకర్‌లోకి దాక్కున్న పరిస్థితి ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో కర్ఫ్యూ విధించారు. ముఖ్యంగా వాషింగ్టన్‌ డీసీతో పాటు మరో నలభై నగరాల్లో కర్ఫ్యూ విధించినట్లు ఆయా రాష్ట్రాల గవర్నర్లు వెల్లడించారు.


‘ఆందోళన తీవ్రత ఎక్కువగా ఉన్న 15 రాష్ట్రాల్లో ఇప్పటికే 5వేల మంది నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ దళాలను రంగంలోకి దించాం. అవసరమైతే మరిన్ని ప్రత్యేక బలగాలు సిద్ధంగా ఉన్నాయి’ అని నేషనల్‌ గార్డ్‌ బ్యూరో చీఫ్‌ జనరల్‌ జోసెఫ్‌ లెంగ్యల్‌ పేర్కొన్నారు. ఈ సమయంలో అమెరికా పోలీసు వ్యవస్థలోనే జాత్యాహంకార భావన ఉందని వస్తోన్న ఆరోపణలను అమెరికా జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్‌ ఓబ్రియన్‌ ఖండించారు. కొందరు ఉద్దేశపూర్వకంగానే ఇలాంటివి సృష్టిస్తున్నారని అన్నారు. ఈ ఉద్యమం వెనుక వామపక్ష తీవ్రవాదులు ఉన్నారని ఆయన ఆరోపించారు.


 


జార్జ్ ఫ్లాయిడ్ మృతితో దేశవ్యాప్తంగా అశాంతి తీవ్రతరం కావడం, జాతి, సైద్ధాంతిక, రాజకీయ మార్గాల్లో సయోధ్యకు ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. హింసాత్మక నిరసనలను దేశీయ ఉగ్రవాద చర్యలుగా ట్రంప్ అభివర్ణించారు. ‘ఒక నగరం, రాష్ట్రం అక్కడ ప్రజల ప్రాణాలు, ఆస్తులను రక్షించడానికి అవసరమైన చర్యలకు అక్కడ పాలకులు నిరాకరిస్తే, సైన్యాన్ని మోహరించి, సమస్యను త్వరగా పరిష్కరిస్తాను’ అని ట్రంప్ అన్నారు. అలర్లకు పరోక్షంగా ఆయా రాష్ట్రాల గవర్నర్లే కారణమని ఆయన మండిపడ్డారు. చాలా మంది గవర్నర్లు శక్తిహీనులుగా మారారని దుయ్యబట్టారు.


అంతేకాదు, ట్రంప్ తనను తాను శాంతియుతంగా నిరసనలు తెలుపున్నవారికి మిత్రుడిగా ప్రకటించాడు. శాంతియుతంగా నిరసనలు తెలుపుతున్నవారిపై రబ్బరు బుల్లెట్లు, టియర్ గ్యాస్, ఫ్లాష్ బ్యాంగ్స్ ఉపయోగించి పోలీసులు వైట్ హౌస్ గేట్ల వెలుపల అత్యవసరంగా చెదరగొట్టారు. గ్యాస్ తీవ్రత తగ్గించడానికి అనేక మంది నిరసనకారులు వారి ముఖాలపై నీరు పోయడం కనిపించిందని అన్నారు.


 


నిరసనకారులు ఏకంగా అధ్యక్ష భవనం ‘వైట్‌ హౌస్‌‌’ ముందుకు చేరుకొని బీభత్సం సృష్టించారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు వారిపైకి భాష్పవాయువు ప్రయోగించాల్సి వచ్చింది. దాదాపు వెయ్యి మంది వరకు శ్వేతసౌధానికి ఉత్తర దిశగా ఉన్న లాఫాయెట్‌ పార్క్‌కు చేరుకొని నినాదాలు చేశారు. పోలీసులు ఏర్పాటు చేసిన ప్లాస్టిక్‌ బారికేడ్లను ధ్వంసం చేశారు. వాటికి నిప్పంటించారు. ఇలా నిరసనకారుల ఆందోళనలు క్రమంగా మిన్నంటడంతో వైట్‌ హౌస్‌ సీక్రెట్‌ సర్వీస్‌ ఏజెంట్లు అప్రమత్తమయ్యారు. పరిస్థితులు చేదాటకుముందే అధ్యక్షుడు ట్రంప్‌ను ఉగ్రదాడుల వంటి అత్యవసర సమయంలో ఉపయోగించే రహస్య బంకర్‌లోకి తీసుకెళ్లారు. దాదాపు గంటపాటు ఆయన్ని అక్కడే ఉంచినట్లు సమాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com