ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కష్టాల కౌగిట్లో వలస కూలీలు.. కన్నీళ్లు ఆగేదెన్నడో..?

national |  Suryaa Desk  | Published : Wed, May 27, 2020, 10:54 AM

వలస కూలీల బతుకుల్లో ఎన్నో కన్నీళ్లు. చుక్కనీరు లేక గొంతు తడవలేదు. చంటోడి దొక్కలు వీపుకు కరుచుకున్నాయ్. రోడ్లపై ఆకలి దండు కదిలింది. వారిది ఆకలి దండు అంటే పొరపాటే.. ఎన్నో రాష్ట్రాల ఎదుగుదలకు ఆదాయాలు తెచ్చిపెట్టిన దండు. వలస కూలీలుగా ఈ రోజు దిక్కుతోచని స్థితిలో నడి ఎండలో దయనీయంగా ముందుకు సాగుతున్నారు. ప్రభుత్వాలు పట్టించుకుంటున్నాయా అంటే ఏదో ఉడత సాయం మాత్రమే చేస్తున్నాయి. కరోనా వైరస్ వారి జీవితాలను చిధ్రం చేసేసింది. అయితే మానవతా దృక్పధంతో చాలా మంది ముందుకు వచ్చి వలస కూలీలకు సాయం చేస్తున్నారు. ఇది మంచి పరిణామం.

లాక్‌డౌన్‌తో దేశం మొత్తం స్థంభించడంతో ఉపాధి లేక, పూట గడవని పరిస్థితుల్లో వలస కూలీలంతా రోడ్లపైకి వచ్చారు. సొంత గూటికి చేరుకుంటే చాలన్న ఆశతో వందల వేల కిలోమీటర్లను సైతం లెక్కచేయకుండా జాతీయ రహదారులపై నడక సాగించారు. భారతదేశంలో సాధారణంగా కుటుంబ పోషణ కోసం పల్లెల నుంచి పట్టణాలకు పెద్దయెత్తున వలసలు పెరుగుతున్నాయి. వలసదారుల్లో ఎక్కువమంది ఉపాధి వేటలో ఉన్న యువజనులేనని వివిధ సంస్థల గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. జాతీయ నమూనా సర్వే (ఎన్‌ఎస్‌ఎస్‌) వివిధ జనాభా అధ్యయనాలు ఈ అంశాన్ని ధ్రువీకరించాయి. ప్రజలు విద్య, ఉపాధి, మెరుగైన అవకాశాల కోసం పట్టణ ప్రాంతాలకు ‘వలస’ వెళుతున్నారు. వలసదారులు కొత్త వాళ్లతో సంబంధాలు ఏర్పర్చుకుంటున్నారు. వారు భిన్న సంస్కృతులను అవగాహన చేసుకుని జీవిస్తున్నారు.

గత పదేళ్లలో అనేక రాష్ట్రాల్లో ఆర్థిక కారణాల వల్ల పట్టణాలకు జనం తరలిపోతున్నట్లు స్పష్టీకరించాయి. నివాస స్థలం నుంచి వేరేచోటికి తరలివెళ్లిన వారిసంఖ్య పెరిగినట్లు జనగణనలు వెల్లడించాయి. 2001 జనగణనలో ఇలాంటివారు 31.45 కోట్లయితే ఇది 2011 జనగణన నాటికి 45.36 కోట్లకు పెరిగింది. ప్రస్తుతం ఏటా కోటీ 40 లక్షలమంది ఉన్న చోటు వదిలి వేరే చోట్లకు తరలిపోతున్నారని గణాంకాలు తెలుపుతున్నాయి. 1991-2001 మధ్య వలసల్లో పెరుగుదల 35.5 శాతంగా కాగా, 2001-11 మధ్య అదీ 44.2 శాతానికి చేరింది. ప్రపంచంలో మరే దేశంలోనూ ఉపాధి కోసం ఇంత భారీగా వలసలు జరగడం లేదు. రైలు ప్రయాణాల సమాచారాన్ని విశ్లేషించడానికి 2017 ఆర్థిక సర్వే కొత్త ఎనలిటిక్స్‌ టెక్నాలజీని ఉపయోగించడం వల్ల వలసలపై మరింత సమగ్ర సమాచారం చేతికి అందింది. దీని ప్రకారం 20-29 ఏళ్ల ప్రాయంలో యువతీ యువకుల్లో ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లినవారి సంఖ్య కోటీ పది లక్షలకు చేరింది. అంటే ఏడాదికి కనీసం 50 లక్షల మంది వలసపోయారన్న మాట.

పేదరికం, స్థానికంగా ఉపాధి అవకాశాలు లేకపోవడం, పట్టణాల్లో, ఇతర రాష్ట్రాల్లో పని దొరికే అవకాశం-ఇవన్నీ కలసి గ్రామీణ జనాభాను వలసలకు ప్రేరేపిస్తున్నాయి. దేశంలో కొన్ని రాష్ట్రాల నుంచి వలసల ప్రవాహం అధికంగా ఉంది. అవి ఉత్తర్‌ ప్రదేశ్‌, బిహార్‌, ఝార్ఖండ్‌, అసోం, ఒడిశా. దశాబ్దాలుగా ఈ రాష్ట్రాల్లోని పల్లెల నుంచి పట్టణాలకు, ఇతర రాష్ట్రాలకు భారీగా జనం వలసపోతున్నారు. దక్షిణ భారతదేశంలోని కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, గోవా, పంజాబ్‌, హర్యానా, గుజరాత్‌ రాష్ట్రాల్లో వృత్తి ఉపాధులు ఎక్కువగా ఉండటంతో ఆ రాష్ట్రాలలో పని కోసం భారీగా తరలిపోతున్నారు.

యావత్‌ దక్షిణ భారతదేశమే ఉపాధినిచ్చే ప్రాంతాలుగా ఎదిగాయి. దక్షిణ భారతదేశంలోని రాష్ట్రాలల్లో మెరుగైన వేతనాలు, పని పరిస్థితులు ఉండటంతో గడచిన రెండు దశాబ్దాల నుంచి అక్కడికి చాలా మంది వలస పోతున్నారు. వలస వెల్లేవారిలో నిర్మాణ రంగంలో నాలుగు కోట్ల మందికి, ఇళ్లలో పనిచేసేందుకు 2 కోట్ల మందికి, జౌళి పరిశ్రమలలో 1.1 కోట్ల మందికి, ఇటుక బట్టీలలో కోటి మందికి, రవాణా, గనులు, క్వారీలు, వ్యవసాయ రంగాల్లో పనులు దొరుకుతున్నాయి. దక్షిణ భారతదేశ రాష్ట్రాలల్లో మేస్త్రీలు, కూలీలకు ఎక్కువ డిమాండ్ ఉంది. ఒడిశా నుంచి వలస వచ్చి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇటుక బట్టీల్లో పనిచేస్తున్న కార్మికులు చాలా మంది ఉన్నారు.

వలస కూలీలకు ఆధారమైన రాష్ట్రాలలో బీహార్‌, ఉత్తర్‌ ప్రదేశ్‌, పశ్చిమ్‌ బంగ, ఒడిశా, అసోం, ఝార్ఖండ్‌లు గమ్య రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో వలస కూలీల ప్రయోజనాలను రక్షించాల్సిన అవసరం ప్రభుత్వాలపై ఉంది. అలాగే వారికి కనీస వేతనం, బీమా సౌకర్యాలు లభించేట్లు చూడాల్సిన బాధ్యత ఉంది. లాక్ డౌన్ కారణంగా లక్షలాదిమంది దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఇరుక్కుపోయారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదించి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. ఏపీ, తెలంగాణలోని వలస కూలీలను వారి రాష్ట్రాలకు పంపించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఏపీకి ప్రత్యేక రైళ్లు కేటాయించింది. ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వలస కూలీలను తరలించేందుకు కూడా ఆయా రాష్ట్రాలకు రైళ్లను కేటాయించింది. రాష్ట్రంలో ఇతర రాష్ట్రాలకు చెందిన వలస కూలీలు ఏ జిల్లాలో ఎంత మంది ఉన్నారనే సమాచారాన్ని సేకరించే బాధ్యతను జాయింట్‌ కలెక్టర్లకు అప్పగించింది.

లాక్ డౌన్ వేళ వలస కూలీలు కన్నీటి గాథలు అన్నీ ఇన్ని కావు. కుటుంబాలకు చేరువవ్వడానికి వారు పడుతున్న కష్టాలు అనేకం. ఆకలి కేకలు, అయినవాళ్ల కోసం ఎదురుచూపులు, పిల్లల బాగోగులు, మరోవైపు మండుతున్న ఎండలు... అన్నీ వలస కూలీలపై ఎదురుతిరుగుతున్న శత్రువులే. ప్రభుత్వాల సాయం అంతంత మాత్రమే. కన్నీళ్లు తుడుస్తున్నట్లే ఉన్నా.. కనికరం లేని దయ ప్రభుత్వాలది. గుండెల నుంచి వచ్చే వెచ్చటి శ్వాస చమటతో తడిచి వలస కూలీలపై వర్షిస్తోంది. అయినా వారి బతుకులు రోడ్లపైనే ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రాలకు ఎన్నో కోట్ల ఆదాయాలు తీసుకొచ్చిన వలస కూలీలకు ఇప్పుడు కొన్ని కన్నీళ్లు మాత్రమే మేమున్నామంటున్నాయి. లాక్ డౌన్ ఎడారిలో పొట్టను చేతపట్టుకుని వలసకూలీల ప్రయాణం ఇంకా సాగుతూనే ఉంది. రక్తమాంసాలు ఖర్చు చేసి రాష్ట్రాల అభివృద్ధికి వెన్నుదన్నుగా నిలిచిన వలస కూలీల కన్నీళ్లు ఆగెదెన్నడో...!






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com