వాట్సాప్ తన తాజా అప్ డేట్ లో మరో గుడ్ న్యూస్ ను తీసుకువచ్చింది. దీని ద్వారా వీడియో కాల్స్ చేసుకోవడం మరింత మందికి సులభం అవ్వనుంది. ఇకపై గ్రూపుల్లో వీడియో కాల్స్ చేసుకునేటప్పుడు మీరు ఒక్క క్లిక్ తో వీడియో కాల్స్ చేసుకోవచ్చు. అది కూడా చాలా మందికి ఒకేసారి వీడియో కాల్స్ చేసుకోవచ్చు. ఇంతకుముందు గ్రూపుల్లో వీడియో కాల్స్ చేసుకోవాలంటే వినియోగదారులు గ్రూప్ చాట్ లో కుడివైపు పైభాగంలో ఉన్న వీడియో కాల్ ఐకాన్ ను క్లిక్ చేశాక ఏయే గ్రూప్ సభ్యులతో వీడియో కాల్ మాట్లాడాలనుకుంటున్నారో ఎంచుకోవాలి. అయితే ఇప్పుడు ఆ బటన్ పై క్లిక్ చేయగానే నేరుగా వీడియో కాల్ ప్రారంభం అయిపోతుంది. అయితే ఈ వన్ స్టెప్ ప్రాసెస్ కేవలం నలుగురు లేదా అంతకంటే తక్కువమంది ఉన్న గ్రూపుల్లోనే అందుబాటులో ఉంది. నలుగురు కంటే ఎక్కువమంది వీడియోకాల్స్ ను మరింత సులభం చేయాలనే ఈ ఫీచర్ ను అందుబాటులోకి తీసుకురానున్నట్టు వాట్సాప్ తెలిపింది. వివిధ దేశాల్లో ఉన్న లాక్ డౌన్ కారణంగా ప్రస్తుతం వీడియో కాన్ఫరెన్సింగ్ కష్టం అవుతుంది. దీంతో వీడియో కాన్ఫరెన్సింగ్ అవసరం ఉన్న వారు జూమ్ వంటి యాప్స్ పై ఆధారపడటం ప్రారంభించారు. దీన్ని సులభతరం చేయడం ద్వారా వాట్సాప్ కూడా ఇందులో అడుగుపెట్టాలని భావిస్తోంది. అందుకే ఇలాంటి సమయంలో ఎక్కువ మంది వాట్సాప్ వీడియో కాల్స్ లో పాల్గొనే అవకాశాన్ని వాట్సాప్ టెస్ట్ చేస్తోంది. ఇటీవలె ఎక్కువ మంది గ్రూప్ వీడియో కాలింగ్ వైపు మొగ్గు చూపుతుండటంతో వాట్సాప్ కూడా దానిని ప్రాసెస్ చేయాలని భావిస్తోంది. అదే కనుక సక్సెస్ అయితే చాలా మంది వాట్సాప్ వీడియో కాలింగ్స్ నే వాడే అవకాశం ఉంటుంది.