ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వైసీపీలో రగడ.. ఇద్దరు మంత్రులు రాజీనామా?

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 28, 2020, 04:44 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలతో ఆ పార్టీ సీనియర్లు గుర్రుగా ఉన్నారు. అవసరం లేని విషయాలను తెరపైకి తీసుకొచ్చి రాష్ట్రంలో పాలనకు సజావుగా సాగేందుకు ఆటంకం ఏర్పడిందని వారు భావిస్తున్నారు. ఇటీవల సీఎం జగన్ తీసుకున్న నిర్ణయాలపై మంత్రులు, ఎమ్మెల్యేలు బాహాటంగానే చెప్పకపోయినప్పటికీ లోలోపల అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం భోదనపై తీసుకున్న నిర్ణయం నుంచి తాజాగా శాసనమండలి రద్దు నిర్ణయంపై కూడా వైసీపీ నేతలు గుర్రుగా ఉన్నట్లు తెలిసింది.


శాసన మండలి రద్దును వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలకు ఇష్టం లేకపోయినప్పటికీ జగన్ మెప్పు పొందేందుకు అసెంబ్లీలోగానీ, బయటగానీ ఏదో ఒకటి మాట్లాడి కాలం వెల్లదీస్తున్నారు. మండలి రద్దుపై సోమవారం అసెంబ్లీలో జరిగిన ఓటింగుకు 18మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు గైరాజరు కావడంతో ఒక్కసారి అసమ్మతి బయటపడింది. పైగా ఓటింగు సందర్భంగా స్పీకర్ తమ్మినేని సీతారామ్, ఆయన సిబ్బంది వ్యవహరించిన తీరు కూడా జగన్ కు కోపం తెప్పించింది.


కౌంటింగును రెండుసార్లు చేయాల్సిన అవసమేమిటని జగన్ అసహనం వ్యక్తం చేశారు. పైగా తమ పార్టీ ఎమ్మెల్యేలు కూడా హాజరుకాకపోవడంతో మరింత కోపం తెప్పించింది. ఈ పరిణామాలను జగన్ సీరియస్ గా తీసుకున్నప్పటికీ గైరాజరైన ఎమ్మెల్యేలు బింధాస్ గా ఉన్నట్లు సమాచారం. దీన్నిబట్టి జగన్ తీసుకున్న నిర్ణయాన్ని వాళ్లు వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తున్నది.


మండలి రద్దుతో ఇద్దరు మంత్రులు రాజీనామా


శాసనమండలిని రద్దు చేయాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించిన విషయం తెలిసిందే. ఈ వ్యవహరంతో జగన్ ప్రభుత్వంలోని ఇద్దరు మంత్రులు రాజీనామా చేయనున్నారు. మాజీ సీఎం కీర్తిశేషులు వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత సన్నిహితులు, మంత్రులు పిల్లి సుభాష్ చంద్రబోష్, మోపిదేవి వెంకటరమణలు రాజీనామా చేయకతప్పదు. వీరద్దరూ శాసనమండలి సభ్యులుగా కొనసాగుతున్నారు.


అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడంతో వారికి ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవులను కట్టబెట్టారు. మండలి రద్దుతో ఇరువురి మంత్రి పదవులకు ఎసరు వచ్చింది. ఇప్పటికిప్పడే మంత్రి పదవులకు సాంకేతికంగా ఎలాంటి ప్రమాదం లేనప్పటికీ ఈ రోజు నుంచి వారికి అభద్రతాభావం నెలకొన్నది. దీంతో ఇరువురు రాజీనామా చేయడమే మేలని యోచిస్తున్నట్లు తెలిసింది. దీంతో వైసీపీలో ముసలం తప్పదని తెలుస్తున్నది.


వాస్తవానికి ఇరువురు మంత్రులు వైఎస్ కుటుంబానికి రాజకీయంగా చాలా త్యాగాలు చేశారు. కీర్తిశేషులు వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం తర్వాత జగన్ ను వెన్నంటి ఉన్నారు. పిల్లి సుభాష్ చంద్రబోష్ మంత్రి పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరి జగన్ కు రాజకీయ సలహాలను ఇచ్చారు. జగన్ పై పెట్టిన కేసుల్లో మోపిదేవి వెంకట రమణను ఇరికించారు. దీంతో జగన్ తో పాటు కొంతకాలం జైలు జీవితం గడిపారు. ఇంతటి త్యాగం చేసిన ఇరువురు మంత్రులకు మండలి రద్దుతో గడ్డు పరిస్థితి నెలకొన్నది. ఒకవేళ వీరి మంత్రి పదవులను కొనసాగించాలంటే జగన్ మరో ఇద్దరు వైసీపీ ఎమ్మెల్యేలను రాజీనామా చేయించాల్సిందే.


మరోమారు ఎన్నికల క్షేత్రంలో వారి అదృష్టాన్ని పరీక్షించుకోవాల్సి ఉంటుంది. దీంతో మంత్రి పదవి రాజీనామా చేసేందుకు ఇరువురు సిద్ధపడుతున్నట్లు తెలిసింది.


అసెంబ్లీలో మండలి రద్దు సమయంలో ఓటింగులో పాల్గొనని 18మంది వైసీపీ ఎమ్మెల్యేలు కూడా రాజశేఖరరెడ్డిపై గౌరవంతోనే పాల్గొనలేదని చెబుతున్నారు. మాజీ సీఎం స్వర్గీయ ఎన్టీయార్ మండలిని రద్దు చేసిన తర్వాత 2005లో రాజశేఖరరెడ్డ ప్రభుత్వం మండలిని పునరుద్దరించింది. దీంతో చాలా మంది రాజకీయ నిరుద్యోగులకు అవకాశం లభించింది.


అప్పటి నుంచి ఇప్పటి వరకూ కొనసాగుతున్నది. పైగా జగన్ అధికారంలోకి వచ్చిన ఏడాది కూడా పూర్తి కాకుండానే ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారు. పైగా వైసీపీ ప్రత్యక్షంగా, పరోక్షంగా చాలా మంది రాజశేఖరరెడ్డి అభిమానులు జగన్ కు అండగా నిలిచారు. వారిలో చాలా మంది ఎమ్మెల్సీ కోసం ఎదురుచూస్తున్నారు. ఏకంగా రద్దు చేయగానే వారికి చట్ట సభల్లో చోటు లభించే అవకాశం లేకుండా పోయింది. దీంతో జగన్ తీసుకున్న నిర్ణయంపై వైసీపీలోనే చాలా మంది సీనియర్లు, రాజశేఖరరెడ్డి అభిమానులు మండిపడుతున్నారని తెలిసింది. దీంతో జగన్ కు ముప్పులు తప్పవని తెలుస్తున్నది. దీన్ని ఏ విధంగా నెట్టుకొస్తారో వేచిచూడాల్సిందే.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com