సైబర్ నేరగాళ్ల ఆగడాలకు అంతేలేకుండా పోతోంది. పలు రకాలుగా ప్రజలను మోసం చేస్తూ డబ్బులు చేజిక్కించుకునే పనిలో పడ్డారు సైబర్ నేరగాళ్లు. ఎంతో ఈజీగా ఎదుటి వారిని మోసం చేస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారు. ఇప్పటికే సైబర్ నేరగాళ్ల మోసానికి అనేక మంది బలయ్యారు. తాజాగా సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కాడు ఓ రైల్వే ఉద్యోగి. ఎంతో చాకచక్యంగా రైల్వే ఉద్యోగిని మోసం చేసిన సదరు కేటుగాళ్లు.. అతడి వద్ద నుంచి ఏకంగా 72 లక్షలను వసూలు చేశారు. ఇంతకీ ఎవరా రైల్వే ఉద్యోగి.. అతడికి ఏమని చెప్పి బెదిరింపులకు పాల్పడ్డారు.. ఇది ఎక్కడ జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.
సైబర్ నేరగాళ్ల పంజాకు ఓ రైల్వే ఉద్యోగి చిక్కాడు. గుత్తి ఆర్‌ఎస్‌కు చెందిన రైల్వే ఉద్యోగి షేక్ మొహమ్మద్ వలిపై సైబర్ నేరగాళ్లు పంజా విసిరారు. ఒక రోజు సైబర్ నేరగాళ్ల నుంచి రైల్వే ఉద్యోగికి కాల్ వచ్చింది. కాల్ సారాంశం ఏంటంటే.. తాము ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులమని.. ముంబైలో బాంబు బ్లాస్ట్‌లో మీ పేరు ఉందని క్రైమ్ బ్రాంచ్ పోలీసుల పేరుతో రైల్వే ఉద్యోగికి సైబర్ నేరగాళ్లు ఫోన్ చేశారు. ఈ కేసులో అరెస్ట్ చేయకుండా ఉండాలంటే డబ్బులు పంపాలంటూ డిమాండ్ చేశారు సైబర్ నేరగాళ్లు. ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులమంటూ వచ్చిన ఫోన్ కాల్‌తో రైల్వే ఉద్యోగి షేక్ మొహమ్మద్ వలి భయపడిపోయాడు. నిజంగా ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులే కాల్ చేశారని భావించిన సదరు రైల్వే ఉద్యోగి... ఏ మాత్రం ఆలోచించకుండా దాదాపు రూ.72 లక్షల నగదును సైబర్ నేరగాళ్ల అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేశాడు. చివరకు తాను మోసపోయానని గ్రహించిన షేక్ మొహమ్మద్ వలీ పోలీసులను ఆశ్రయించాడు. సైబర్ నేరగాళ్ల మోసంపై గుత్తి పోలీస్‌స్టేషన్‌లో బాధితుడు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. అయితే భారీ మొత్తంలో నగదు ట్రాన్స్ఫర్ కావడంతో ఈ కేసును జిల్లా ఎస్పీ జగదీష్ సీరియస్‌గా తీసుకున్నారు. ఆ ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది.. ఎవరు ఫోన్ చేశారనే దానిపై ముమ్మరంగా విచారణ చేపట్టారు. దయచేసి ఎవరూ కూడా సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కవద్దని పోలీసులు కోరుతున్నారు. మీకు వచ్చిన ఫోన్ కాల్‌ను క్షుణ్ణంగా పరిశీలించాలని.. ఆ ఫోన్ కాల్ నిజమైనదా లేదా చూడాలని.. అనుమానం వస్తే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఖాకీలు చెబుతున్నారు.