ఎన్ఆర్ఐలకు టీటీడీ తీపికబురు చెప్పింది.. ఈ ఏడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో యూకే, ఐర్లాండ్, యూరప్‌లోని 8 దేశాల్లోని 13 నగరాల్లో శ్రీ శ్రీనివాస కళ్యాణాలను ఘనంగా నిర్వహించనున్నారు. ఈ మేరకు కార్యక్రమ నిర్వాహకులు సూర్య ప్రకాష్ వెలగా, కృష్ణ జవాజీ జర్మనీ, ఫ్రాంక్‌ఫర్ట్ నుంచి టీటీడీ ఈవో జే శ్యామలరావును తిరుపతి పరిపాలన భవనంలోని ఈవో ఛాంబర్‌లో మర్యాదపూర్వకంగా కలిశారు.. శ్రీనివాస కళ్యాణాలలో పాల్గొనాల్సిందిగా ఆహ్వానించారు.
అనంతరం వారు యూకే, ఐర్లాండ్, యూరప్‌లోని 8 దేశాల్లోని 13 నగరాల్లో శ్రీనివాస కళ్యాణాల నిర్వహణపై మాట్లాడారు. నవంబర్ 9 నుంచి డిసెంబర్ 21 వరకు టీటీడీ సహకారంతో స్థానిక స్వచ్ఛంద, సాంస్కృతిక సంస్థలతో కలిసి ఏపీ ఎన్ ఆర్ టీ ఎస్ శ్రీనివాస కళ్యాణాలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు ఈవోకు తెలిపారు. కాగా ఈ తిరు కళ్యాణ కార్యక్రమాలని టీటీడీ వేదపండితులు వైఖానస ఆగమ సంప్రదాయం ప్రకారం పూజలు నిర్వహించనున్నారు.
యూకే, ఐర్లాండ్ మరియు ఐరోపాలలో శ్రీనివాస కళ్యాణాల వివరాలు ఇలా ఉన్నాయి
నవంబర్ 9 – బెల్ఫాస్ట్, ఐర్లాండ్
నవంబర్ 10- డబ్లిన్, ఐర్లాండ్
నవంబర్ 16- బేసింగ్‌స్టోక్, యూకే
నవంబర్ 17 – ఐండ్‌హోవెన్, నెదర్లాండ్స్
నవంబర్ 23- హాంబర్గ్, జర్మనీ
నవంబర్ 24 – పారిస్, ఫ్రాన్స్
నవంబర్ 30- వార్సా – పోలాండ్ –
డిసెంబర్ 1 – స్టాక్‌హోమ్, స్వీడన్ –
డిసెంబర్ 7 - మిల్టన్ కీన్స్, యూకే
డిసెంబర్ 8 – గ్లౌసెస్టర్, యూకే.
డిసెంబర్ 14 – ఫ్రాంక్‌ఫర్ట్, జర్మనీ
డిసెంబర్ 15- బెర్లిన్, జర్మనీ
డిసెంబర్ 21. – జ్యూరిచ్, స్విట్జర్లాండ్
శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారికి పవిత్ర సమర్పణ
శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో రెండో రోజైన మంగళవారం పవిత్రోత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించి పవిత్ర సమర్పణ చేశారు. ఉదయం స్వామివారిని సుప్రభాతంతో మేల్కొలిపి, తోమాల సేవ, కొలువు, పంచాంగశ్రవణం, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీవారి ఉత్సవర్లను కల్యాణమండపంలోని యాగశాలకు వేంచేపు చేశారు. ఇందులో భాగంగా పుణ్యాహవచనం, పంచగన్యారాధన, రక్షాబంధనం, అన్నప్రానాయానం నిర్వహించారు.
ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు. అనంతరం మధ్యాహ్నం 12 నుండి 1 గంట వరకు ఆలయంలోని మూలవర్లకు, ఉత్సవర్లకు శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ చేశారు. సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు స్వామి, అమ్మవార్లు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించనున్నారు. రాత్రి 7 నుండి 8.30 గంటల వరకు యాగశాల వైదిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.