కర్నూలు జిల్లాలో ఓ వ్యక్తి మూడేళ్ల పోరాటం పోరాటం ఫలించింది. తన తండ్రి బీమాకు సంబంధించి ఓ కంపెనీ నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో వినియోగదారుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. తాను కట్టి రూ.3,500తో పాటుగా క్లైమ్ డబ్బుల కోసం పోరాటం చేశారు. చివరికి నష్టపోయిన దానికి రెట్టింపు డబ్బు దక్కింది. ఈ మేరకు వినియోగాదారుల కమిషన్ చర్యలు తీసుకుని.. బాధితుడికి న్యాయం చేసింది.
2021, మే 14న నందికొట్కూరుకు చెందిన కాటిపోగు చిన్ననాగన్న ఫోన్‌పే ద్వారా రూ.3,500 ప్రీమియం చెల్లించి.. ఓ ప్రైవేట్ కంపెనీ పాలసీ తీసుకున్నారు. 2022, మార్చిలో నాగన్న అనారోగ్య కారణాలతో చనిపోయాగా.. ఆ పాలసీకి నామినిగా ఉన్న అతడి కుమారుడు శ్రీకాంత్ బీమా పరిహారం ఇవ్వాలని కంపెనీ ప్రతినిధులను కోరారు. చిన్ననాగన్న వార్షిక ఆదాయం రూ.లక్ష లోపే ఉందని.. పాలసీ పొందేందుకు అనర్హుడని ఆ కంపెనీ ప్రతినిధులు తిరస్కరించారు. ఆ వెంటనే శ్రీకాంత్ వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ను ఆశ్రయించారు.
ఈ మేరకు తన తండ్రి నాగన్న వార్షిక ఆదాయం రూ.1.44 లక్షలుగా డాక్యుమెంట్లను కమిషన్‌కు అందించి ఫిర్యాదు చేశారు. ఈ కేసుకు సంబంధించిన అన్ని అంశాలను పరిశీలించిన కమిషన్.. పాలసీ జారీకి ముందే వార్షికాదాయం నిర్ధారించకపోవడం సేవాలోపంగా గుర్తించింది. ఈ మేరకు పాలసీ జారీ చేసిన తర్వాత క్లెయిమ్‌లు నిరాకరించటం సరికాదని అభిప్రాయపడింది. సీపీ చట్టం 2019లోని నిబంధనల ప్రకారం 90 రోజులు పూర్తైందని.. బీమా మొత్తం రూ.5 లక్షలు 9 శాతం వడ్డీతో చెల్లించాల్సిందేనని కమిషన్ తీర్పు ఇచ్చింది. అలాగే కోర్టు ఖర్చుల కింద మరో రూ.15 వేలను 45 రోజుల్లోపు ఇవ్వాలని కూడా సదరు కంపెనీని ఆదేశించారు.