ఏపీలో దీపం 2 పథకానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నవంబర్ 1న శ్రీకారం చుడతారని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. బుధవారం మంత్రి మాట్లాడుతూ... మంగళవారం (అక్టోబర్ 29) ఉదయం 10 గంటల నుండే ఉచిత గ్యాస్ బుకింగ్‌లు ప్రారంభం అయ్యాయన్నారు. నిన్న ఒక్కరోజే 4 లక్షలకు పైగా బుకింగ్‌లు జరిగాయన్నారు. రోజుకు రెండున్నర లక్షల బుకింగ్‌లను డెలివరీ చేయగలమని ఆయిల్ కంపెనీలు పేర్కోన్నాయని చెప్పారు. వచ్చే నెల 1న శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఉచిత గ్యాస్‌ను సీఎం చేతులు మీదుగా లబ్దిదారులకు పంపిణీ చేయిస్తామన్నారు.
ఈరోజు ఆయిల్ కంపెనీలకు ముఖ్యమంత్రి అడ్వాన్స్ పేమెంట్ మొత్తాన్ని చెక్కు రూపంలో అందించారని తెలిపారు. తదుపరి విడత నుంచి లబ్దిదారుల ఖాతాల్లో ముందస్తుగానే ప్రభత్వం నిధులు మంజూరు చేస్తుందన్నారు. మహిళల ఆర్యోగ్యం పట్ల కూటమి ప్రభుత్వం, పార్టీలు ఎంతో శ్రద్ద వహిస్తున్నాయన్నారు. గత ప్రభత్వం 13 లక్షల కోట్ల అప్పులను మిగిల్చి వెళ్లినా ఆర్ధికంగా ఇబ్బందులు ఉన్నా ఈ పథకాన్ని అతికష్టం మీద అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. సూపర్ సిక్స్‌లో అమలు అవుతున్న మొదటి పథకం ఉచిత గ్యాస్ సిలెండర్ పథకమని అన్నారు. రాష్ట్రంలో పెరుగుతున్న నిత్యవసరాల ధరలు నియంత్రించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రేషన్ షాపుల ద్వారా చౌక ధరలకు నిత్యవసరాలు పంపిణీ చేస్తున్నామన్నారు. ధరల పెరగుదల పై మానిటిరింగ్ కమీటీని ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం 44 రూపాయలు పెట్టి కొంటున్న బియ్యాన్ని వినియోగదారుల్లో కొందరు పదికి అమ్ముకుంటున్నారని.. అలా చేయడం వల్ల ప్రభుత్వానికి వినియోగదారులకు తీరని అన్యాయం జరుగుతోందన్నారు. తాము ఇచ్చే బియ్యంలో ఫోర్టిఫైడ్ రైస్‌ను కలిపి ఇస్తున్నందున పోషకాలతో కూడిన ఆ బియ్యాన్ని ప్రతి ఒక్కరూ తీసుకోవాలన్నారు. కాకినాడలో గోడౌన్లు, రైస్ మిల్లులపై దాడులు చేసి పీడీఎస్ రైస్‌ను భారీ ఎత్తున పట్టుకున్నామన్నారు. మహిళలకు 3 ఉచిత సిలెండర్‌లు ఇవ్వడం ద్వారా ఈ కష్టకాలంలో ప్రభుత్వ సాయం.. వారికి ఎంతో ఉపకరిస్తుందని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు.