ఆంధ్రప్రదేశ్‌లో కొత్త మద్యం షాపులు ప్రారంభమయ్యాయి.. రెండు వారాలుగా అమ్మకాలు కొనసాగుతున్నాయి. అయితే కొన్ని మద్యం షాపులు మందుబాబులకు బంపరాఫర్ ప్రకటించాయి.. ఈ మేరకు సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా అన్నమయ్య జిల్లా రాజంపేటలో మందుబాబుల్ని తమ షాపులకు రప్పించుకునేందుకు మద్యం షాపుల యజమానులు అదిరిపోయే ఆఫర్ ప్రకటించారు. ప్రతి మద్యం బాటిల్ కొనుగోలుపై గుడ్డు, గ్లాస్, వాటర్ ప్యాకెట్ ఫ్రీ అంటూ ఊరిస్తున్నారు. ఈ మేరకు మద్యం షాపుల బయట బోర్డుల్ని కూడా ఏర్పాటు చేశారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఆఫర్‌తో కొందరు మందుబాబులు షాపులకు వెళుతున్నారు.. వారి సేల్స్ పెరుగుతున్నాయి.
మరోవైపు ఏపీలో కొత్తగా మద్యం షాపులు దక్కించుకున్నవారు ఆందోళనలో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. భారీ లాభాలు వస్తాయని.. రూ.లక్షలు పెట్టుబడి పెట్టి మద్యం వ్యాపారంలోకి దిగితే చివరికి నష్టపోతున్నామని చెబుతున్నారట. తాము అమ్మకాలపై 20శాతం మార్జిన్ అనుకుంటే చేతికి 10 శాతమే వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. తమకు ఇస్తున్న మార్జిన్ ఎక్కువ లేదని.. తమకు చెప్పిన దానిలో సగమే వస్తోందని చెబుతున్నారట. ఇలా అయితే తాము వ్యాపారం చేయలేమని వాపోతున్నారట.
అయితే గత ప్రభుత్వంలో కొత్తగా ప్రవేశపెట్టిన అదనపు రిటైల్ ఎక్సైజ్ టాక్స్ (ఏఆర్‌ఈటీ) వ్యాపారులను దెబ్బకొట్టిందనే చర్చ జరుగుతోంది. కొత్త పాలసీలో ప్రభుత్వం ఇస్తామని ప్రకటించిన 20శాతం మార్జిన్‌కు సంబంధించి.. అన్ని పన్నులు విధించిన తర్వాత కాకుండా ఏఆర్‌ఈటీకి ముందే ఇస్తున్నారట. పన్నులు విధించిన తర్వాత వచ్చే ధరపై 20శాతం మార్జిన్ ఇస్తున్నారు.. ఆ తర్వాత ఏఆర్‌ఈటీ విధిస్తున్నారు. దీంతో షాపులు దక్కించుకున్నవారికి వాటా లేకుండా నేరుగా ప్రభుత్వానికి వెళ్తోందనే వాదనలు ఉన్నాయి.
దేశంలో తయారైన ఫారిన్ లిక్కర్‌పై 137 శాతం నుంచి 220 శాతం, వైన్‌పై 187 శాతం, బీరుపై 211 శాతం, ఏఆర్‌ఈటీ పన్ను ఉంది. ఈ పన్నుపై మార్జిన్ ఇవ్వకపోవడంతో వ్యాపారులకు ఇచ్చే దానిలో భారీగా కోత పడుతోందట. దీనికి తోడు కొత్తగా విధించిన 2 శాతం డ్రగ్ కంట్రోల్ అండ్ రీహాబిలిటేషన్ సెస్, 1 శాతం టీసీఎస్ పన్నుపైనా మార్జిన్ లేదట. ఇటు సీసాలపై విధించే రౌండా్‌ఫపైనా మార్జిన్ ఇవ్వరని చెబుతున్నారు. అంటే ఒక సీసా ధర రూ.151 ఉంటే రౌండాఫ్ కింద రూ.160 ఎమ్మార్పీ చేస్తారు. ఈ రౌండాఫ్‌లో పెరిగిన రూ.9పై షాపుల యజమానులకు మార్జిన్ ఇవ్వరట. ఈ మూడు కేటగిరీలపై మార్జిన్ ఇవ్వకపోవడంతో పాటు, ఏఆర్‌ఈటీపైనా మార్జిన్ లేకపోవడంతో సగటున చివరికి 10 శాతమే వ్యాపారులకు వస్తోందట. ఆంధ్రప్రదేశ్‌లో 3,396 షాపులకు 89,882 దరఖాస్తులు రాగా.. రూ.1800 కోట్లు ఆదాయం వచ్చింది. అలాగే కొత్త మద్యం పాలసీలో లైసెన్సు ఫీజులు కూడా భారీగా పెంచారు. దీంతో మద్యంషాపులు దక్కించుకున్నవారికి లాభాలు రావడం లేదంటున్నారు.