దీపాల పండుగ దీపావళికి యావత్ దేశం సిద్ధమైపోయింది. వాకిట వద్ద దీపాల కాంతులు.. గుమ్మం ముందు బాణాసంచా పేలుళ్లు.. చిన్నారుల కేరింతలతో దీపాల పండుగకు స్వాగతం చెప్పేందుకు పల్లె నుంచి పట్టణం వరకూ అంతా సిద్ధమైపోయింది. ఇక దీపావళి పండుగ అనగానే ఠక్కున గుర్తొచ్చేది బాణాసంచా. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా చెప్పుకునే ఈ దీపావళి పండుగ సందర్భంగా చిన్నాపెద్దా, ముసలీ ముతకా అందరూ టపాసులు పేల్చి సంబరాలు చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ సంబరాల సమయం విషాదంగా మారకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. చిన్న పొరబాటు చేదు జ్ఞాపకంగా మారకుండా ఉండేలా అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అందరిపై ఉంది. ఈ నేపథ్యంలో దీపావళి పండుగను పురస్కరించుకుని.. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ కొన్ని జాగ్రత్తలు సూచించింది.
దీపావళి బాణాసంచా కాల్చేటప్పుడు భద్రతా సూచనలు-జాగ్రత్తలు
టపాసులు కాల్చే సమయంలో చేయవలసినవి
బాణాసంచా కాల్చే సమయంలో కాటన్ దుస్తులు ధరించండి.
మీ ఇంటి కిటికీలు, ద్వారములు, తలుపులు మూసివేయండి.
పసి పిల్లలు ఉంటే ఇంటి లోపలే ఉంచండి.
బాణసంచా కాల్చేటప్పుడు ఎల్లప్పుడూ ఒక బకెట్ నీరు, ఇసుకను అందుబాటులో ఉంచుకోండి.
బాణసంచాపై వ్రాసిన సూచనలను జాగ్రత్తగా పాటించండి.
పెద్దల పర్యవేక్షణలో మాత్రమే పిల్లలు బాణాసంచా కాల్చాలి.
రాకెట్లు, ఫ్లవర్ పాట్లు, ఇతర ఎగిరే క్రాకర్లను గడ్డితో చేసిన ఇళ్లు, ఎండుగడ్డి స్టాక్‌లకు దూరంగా బహిరంగ ప్రదేశాల్లో కాల్చడం సురక్షితం.
మీకు ప్రమాదవశాత్తూ గాయలైతే చల్లటి నీటిని పోసి వెంటనే వైద్యుడిని సంప్రదించండి.
చేయకూడనివి
బాణాసంచాతో ప్రయోగాలు చేయవద్దు.
బాణాసంచా కాల్చేపుడు మీ ముఖాన్ని దూరంగా ఉంచండి.
కాల్చడంలో విఫలమైన బాణసంచాను మళ్లీ వెలిగించే ప్రయత్నం చేయవద్దు.
విద్యుత్ స్తంబాల దగ్గరగా టపాసులు కాల్చవద్దు.
ఫ్లవర్ పాట్‌లు, హ్యాండ్ బాంబులు వంటి బాణాసంచా కాల్చే సమయంలో చేతితో పట్టుకోవద్దు.
ఫైర్ క్రాకర్లను వెలిగించి విచక్షణా రహితంగా బహిరంగంగా విసిరేయకండి.
అగ్ని ప్రమాదం జరిగితే అత్యవసర సహాయం కోసం 101, 112, 100, 1070 నెంబర్లను సంప్రదించండి.