ట్రెండింగ్
Epaper    English    தமிழ்

30 ఏళ్లుగా షుగర్.. ఈ చిట్కాలు పాటిస్తూ ఆరోగ్యంగా ఉన్నా: సీఎం సిద్ధరామయ్య

national |  Suryaa Desk  | Published : Fri, Oct 25, 2024, 11:07 PM

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.. రాష్ట్రవ్యాప్తంగా గురువారం గృహ ఆరోగ్య పథకాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా తన వ్యక్గిగత ఆరోగ్యం గురించి ఆయన కీలక విషయాలు వెల్లడించారు. తనకు షుగర్ వ్యాధి ఉండటం వల్లే, చెప్పులు లేకుండా నడవనని అన్నారు. గత 30 ఏళ్లుగా తాను మధుమేహాన్ని నియంత్రిస్తూ వస్తున్నానని ఆయన తెలిపారు. ప్రతి రోజూ వ్యాయామం, క్రమశిక్షణతో కూడిన జీవన శైలితోనే మధుమేహాన్ని నియంత్రిస్తున్నట్లు సిద్ధరామయ్య పేర్కొన్నారు. సరైన జాగ్రత్తలు తీసుకుంటే చక్కెర వ్యాధిని అదుపులో ఉంచడం సాధ్యమేనని చెప్పారు. గుండె సంబంధిత సమస్య తలెత్తడంతో తాను స్టెంట్ వేయించుకొని 24 ఏళ్లు అయిందని, వైద్యుల సలహాలను పాటిస్తూ పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నట్టు వివరించారు.


ముందుగానే గుర్తించి చికిత్స అందిస్తే క్యాన్సర్‌ను సైతం నయమవుతుందని.. అలాంటిది మధుమేహం, బీపీలను విజయవంతంగా నియంత్రించవచ్చన్నారు. ఇందుకోసం క్రమశిక్షణతో కూడిన జీవనశైలి అవసరమని సూచించారు. ఆరోగ్య సమస్యలను దాచిపెట్టడం మంచిది కాదని సిద్ధరామయ్య అన్నారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల ప్రజలు వైద్యం కోసం ఆసుపత్రులకు వెళ్లలేరని.. అలాంటి వారికి తాము చేపట్టిన ‘గృహ ఆరోగ్య’ పథకం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ పథకం ద్వారా ప్రజలు తమ ఇంటి వద్దే వైద్య పరీక్షలు చేయించుకోవచ్చన్నారు. చాలా మంది ఆర్థిక పరిమితుల కారణంగా ఆరోగ్య పరీక్షలకు దూరంగా ఉంటారని, ఇది గుర్తించలేని వ్యాధులకు దారితీస్తుందని తెలిపారు.


‘ఒత్తిడితో కూడిన జీవితం వల్ల అనారోగ్యాలకు గురవుతారు.. ఇప్పుడు రసాయనాలు వాడే ఆహార పదార్థాల వినియోగం పెరగడం వల్ల ఆ సమస్య మరింత తీవ్రంగా మారింది.. గుడ్లు, చేపలు, మాంసం తింటే షుగర్ వ్యాధి పెరుగుతుందనే అపోహ ఉంది.. అలాంటిదేమీ లేదు. సమతుల ఆహారం తీసుకోవడమే ఎంతో ముఖ్యం’ అని సిద్ధరామయ్య అన్నారు. ‘షుగర్ వ్యాధి కారణంగా బూట్లు తీసేస్తే నేలమీద రాళ్ల వల్ల ఏదైనా సమస్య వస్తుందని భయపడుతున్నాను.. లేదంటే సిద్ధరామేశ్వర జాతరలో డ్యాన్సులు వేసేవాడిని.. నేను నిన్న రాత్రి 12.45 గంటల వరకు ఆలయంలో అన్ని కార్యక్రమాలను చూశాను’ అని తెలిపారు.


మైసూరు జిల్లాలోని సిద్ధరామయ్య స్వగ్రామంలో మూడేళ్లకు ఒకసారి సిద్ధరామేశ్వర జాతర జరుగుతుంది. ఈ జాతరకు లక్షల్లో భక్తులు హాజరవుతారు. ఇక్కడకు వచ్చే భక్తులు.. దేవుడి ఆశీస్సుల కోసం తమ నోటికి చిన్న శూలాన్ని గుచ్చుకునే సంప్రదాయం పాటిస్తారు. దీనిపై సిద్ధరామయ్య మాట్లాడుతూ.. ‘నేను మనస్సాక్షి అనే దేవుడని నమ్ముతాను. ప్రజలు మంచి మార్గంలో పయనించి సమాజ హితం కోసం నడుచుకోవాలి. దేవుడు గుడి లోపల ఉన్నాడో లేక మరే ప్రదేశంలో ఉన్నాడో ఎవరికి తెలుసు’ అని ఆయన వ్యాఖ్యానించారు.


‘ఆరోగ్య సమస్యలు దాచుకోకూడదు. చాలా మంది,ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారు ఆసుపత్రులను సందర్శించలేరు.. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ పథకం ఆరోగ్య సేవలు వారి గుమ్మానికి చేరేలా చేస్తుంది’ అని అన్నారు. గృహ ఆరోగ్య పథకం ద్వారా ప్రతి ఇంటిలోనూ వైద్య పరీక్షలు నిర్వహించినున్నట్టు సిద్ధరామయ్య తెలిపారు. ‘కేన్సర్ వంటి పరిస్థితులను ముందుగానే గుర్తించడం చికిత్స ఫలితాలను మెరుగుపరుస్తుంది అయితే మధుమేహం.. రక్తపోటు వంటి వ్యాధులను జీవనశైలి మార్పులతో సమర్థవంతంగా అదుపులో ఉంచుకోవచ్చు’ అని పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com