ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వాతావరణ అప్ డేట్స్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Oct 24, 2024, 09:36 PM

బంగాళాఖాతంలో ఏర్పడిన దానా తుఫాన్‌.. ఎలాంటి బీభత్సం సృష్టిస్తుందని ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. దానా తుఫాన్‌కు సంబంధించి వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావు మీడియాతో కీలక విషయాలు పంచుకున్నారు. దానా తుఫాన్‌ తీవ్ర తుఫాన్‌గా మారిందని అన్నారు. ఈరోజు(గురువారం) అర్ధరాత్రి నుంచి రేపు ఉదయం మధ్య.. ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరం వద్ద దాటుతుందని తెలిపారు. ఈ సమయంలో ఆంధ్రప్రదేశ్‌లో ముఖ్యంగా ఉత్తరాంధ్రపై తుఫాన్ ప్రభావం ఉంటుందని తెలిపారు. ఉత్తరాంధ్ర తీరం వెంబడి బలమైన గాలులు వీస్తాయని వెల్లడించారు. కళింగపట్నం,భీమునిపట్నం, విశాఖపట్నం , గంగవరం పోర్టుల్లో మూడో ప్రమాద హెచ్చరికలు జారీ చేశామని అన్నారు. తుఫాన్ తీరం దాటిన తర్వాత ఉత్తరాంధ్రలో ఉరుములతో కూడిన వర్షాలు పడతాయని తెలిపారు. అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అన్నారు.


ఈ సమయంలో మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. గురువారం ఒడిశాలో తుఫాన్‌ తీరం దాటనుంది. తుఫాన్‌ ప్రభావం జిల్లాపై ఎక్కువగా చూపనుందని.. ఇప్పటికే వాతావరణ శాఖ అంచనా వేసింది. గురువారం బలమైన ఈదురుగాలులు.. గంటకు 80 నుంచి 100 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని వెల్లడించింది. దీంతో జిల్లా అధికారులను కలెక్టర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పుండ్కర్‌ అప్రమత్తం చేశారు. కలెక్టరేట్‌లో ప్రత్యేకంగా కంట్రోల్‌ రూమ్‌ (08942-240557) ఏర్పాటు చేశారు. ప్రతి మండల కేంద్రంలోనూ కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేయించారు. తుఫాన్‌ చర్యలపై బుధవారం సాయంత్రం అధికారులతో సమీక్ష నిర్వహించారు.తుఫాన్‌ తీరం దాటాక.. భారీవర్షాలు రెండు రోజుల పాటు కురుస్తాయని.. పైగా ఇచ్ఛాపురం నియోజకవర్గంలో సోంపేట, ఇచ్ఛాపురం, కవిటి, కంచిలి మండలాలపై ఎక్కువగా ప్రభావం ఉంటుందని నివేదికలో వెల్లడైంది. దీంతో ఆయా మండలాల్లో అధికారులను కలెక్టర్‌ అప్రమత్తం చేశారు. ప్రజలందరూ ముందస్తు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. అవసరమైతే కంట్రోల్‌రూమ్‌ సేవలను వినియోగించుకోవాలని సూచించారు. ప్రతి రెండు గంటలకు ఇచ్ఛాపురం నియోజకవర్గం గురించి ప్రత్యేక బులిటెన్‌ విడుదల చేయనున్నారు. తీరప్రాంత మండలాల్లో తుపాను ప్రభావాన్ని.. నష్టాన్ని గుర్తించేందుకు.. ఇరవై డ్రోన్లను సిద్ధం చేశారు. సమాచారాన్ని ఎప్పటికప్పుడు గూగుల్‌ షీట్స్‌లో నమోదు చేసేలా చర్యలు తీసుకున్నారు. అలాగే నాగావళి, వంశధార, బహుదా నదులు.. సాగునీటి చెరువులు... సముద్ర తీరప్రాంతాల వద్ద ప్రజలు వెళ్లకుండా హెచ్చరికలు జారీ చేశారు. తుఫాన్‌ రక్షణ చర్యలపై రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు కలెక్టర్‌, ఎస్పీలతో మాట్లాడారు. ప్రజలకు ఏవిధమైన నష్టం కలగకుండా.. సకాలంలో సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రణస్థలం మండలం కొవ్వాడ నుంచి ఇచ్ఛాపురం మండలం డొంకూరు సముద్రతీరం వరకు బుధవారం సాయంత్రం నుంచీ ఈదురుగాలులు వీస్తున్నాయి. అలలు ఎగసి పడుతున్నాయి. తుఫాన్‌ నేపథ్యంలో ప్రధానంగా ఉద్దానం ప్రజలు భయాందోళన చెందుతున్నారు. తితలీ తుఫాన్‌ సృష్టించిన బీభత్సాన్ని ఇప్పటికీ మరచిపోలేకపోతున్నారు. తాజాగా దానా తుఫాన్‌ ప్రభావంతో వాతావరణంలో మార్పులు చోటుచేసుకోవడంతో రైతుల్లో ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో హిరమండలం, జలుమూరు తదితర మండలాల్లో వరి పంట కోత దశకు చేరుకుంది. ఈ సమయంలో తుఫాన్‌ వస్తే.. తమకు పంట నష్టం తప్పదని రైతులు వాపోతున్నారు. ఎకరాకు రూ.25వేలకు పైగా ఖర్చు చేశామని.. పంట చేతికి అందివచ్చే సమయంలో తుఫాన్‌ ముప్పు వెంటాడుతోందని ఆవేదన చెందుతున్నారు. తుఫాను కారణంగా ఈ నెల 24, 25 తేదీల్లో ఈస్ట్‌కోస్ట్‌ రైల్వే పరిధిలో అనేక రైళ్లు రద్దు చేసినట్లు రైల్వేశాఖ పీఆర్వో ఓ ప్రకటన విడుదల చేశారు. 24న కటక్‌-పారాదీప్‌ స్పెషల్‌, భువనేశ్వర్‌-ముంబై కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌, భువనేశ్వర్‌-చెన్నై సెంట్రల్‌ ఎక్స్‌ప్రెస్‌, భువనేశ్వర్‌-ఆనంద్‌విహార్‌ ఎక్స్‌ప్రెస్‌, పూరీ-షాలీమార్‌, న్యూఢిల్లీ-భువనేవ్వర్‌ ఎక్స్‌ప్రెస్‌, బెంగుళూరు-హౌరా ఎక్స్‌ప్రెస్‌ రద్దు కానున్నాయి. 25న పారాదీప్‌-పూరీ ఎక్స్‌ప్రెస్‌, చెన్నై-భువనేశ్వర్‌ ఎక్స్‌ప్రెస్‌, షాలీమార్‌-పూరీ, భద్రక్‌-ఖరగ్‌పూర్‌ స్పెషల్‌ రైళ్లను రద్దు చేసినట్టు ప్రకటనలో తెలిపారు. శ్రీకాకుళం రోడ్డు(ఆమదాలవల స) రైల్వేస్టేషన్‌లో హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేశారు. దానా తుఫాన్‌ ప్రభావంతో ఈ నెల 24, 25, 26 తేదీల్లో అటు భువనేశ్వర్‌, ఇటు విజయవాడ వైపు వెళ్లే 51 రైళ్లను రద్దు చేసినట్టు రైల్వే అధికారులు వెల్లడించారు. రైల్వే ప్రయాణికులకు ఎటువంటి సమాచారం కావాలన్నా హెల్ప్‌లైన్‌ డెస్క్‌ సిబ్బందిని లేదా.. టోల్‌ఫ్రీ 08942- 286 213, 85912 85913 నెంబర్లను సంప్రదించాలని సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com