ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అయోధ్య ప్రారంభోత్సవంపై రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై వివాదం.. బీజేపీ ఫైర్

national |  Suryaa Desk  | Published : Sat, Sep 28, 2024, 10:40 PM

హిందువుల దశాబ్దాల నాటి కల నెరవేరుతూ.. ఉత్తర్‌ప్రదేశ్‌ అయోధ్యలో ఈ ఏడాది జనవరి 22వ తేదీన దివ్య రామమందిరం ప్రాణ ప్రతిష్ఠను జరుపుకుంది. అయితే ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ సహా ఇండియా కూటమి నేతలు గైర్హాజరు అయ్యారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం కోసం దశాబ్దాల పోరాటం చేసిన ఎల్‌కే అద్వానీ, మురళీ మనోహర్ జోషి సహా రాష్ట్రపతి ద్రౌపది ముర్మును.. అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి పిలవలేదని.. ఇండియా కూటమి నేతలు.. బీజేపీపై తీవ్ర విమర్శలు చేశారు. ఇక ఇండియా కూటమి నేతలు.. అయోధ్య ప్రారంభోత్సవానికి రాకపోవడంపై బీజేపీ నేతలు కూడా అదే స్థాయిలో ప్రతి విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే తాజాగా హర్యానా, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న వేళ.. ప్రచారంలో భాగంగా మాట్లాడిన రాహుల్ గాంధీ.. అయోధ్య ప్రాణప్రతిష్ఠపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా మారాయి.


అయోధ్య రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమం ‘‘నాచ్ గానా"( సాంగ్స్-డ్యాన్స్)’’ కార్యక్రమం అని రాహుల్ గాంధీ తాజాగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదానికి దారి తీస్తున్నాయి. అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా.. ఆదివాసీ అని రాష్ట్రపతి ద్రౌపది ముర్మును పిలవలేదని పేర్కొన్నారు. అంతేకాకుండా ఈ కార్యక్రమానికి అమితాబ్ బచ్చన్, అదానీ, అంబానీ లాంటి పెద్ద పెద్ద వాళ్లకు ఆహ్వానం పలికారని చెప్పారు.


కానీ అట్టడుగు వర్గాలకు చెందినవారిని మాత్రం రామమందిర నిర్వాహకులు ఆహ్వానించలేదని రాహుల్ గాంధీ ప్రశ్నించారు. చాలా మంది సెలబ్రిటీలను అయోధ్య ప్రారంభోత్సవానికి పిలిచిన రామ మందిర నిర్వాహకులు.. ఒక్క కూలీని గానీ, రైతును గానీ, కార్మికులను గానీ పిలవలేదని అన్నారు. అక్కడ డ్యాన్స్ జరుగుతోందని.. నాచ్ గానా అంటూ రాహుల్ గాంధీ అభివర్ణించారు.


అయితే అయోధ్య రామ మందిర ప్రాణ ప్రతిష్ఠ గురించి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర స్థాయిలో మండిపడుతోంది. రాహుల్ గాంధీ పదే పదే హిందువుల్ని అవమానిస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇతర మతాలపై ఇలాంటి వ్యాఖ్యలు చేసే దమ్ము రాహుల్ గాంధీకి ఉందా అని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా ప్రశ్నించారు. రాహుల్ గాందీ కుటుంబం రాముడి ఉనికిని, రామ మందిరాన్ని తిరస్కరించిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో హిందువులపై బీభత్సాన్ని సృష్టించిందని మండిపడ్డారు. ఇప్పుడు ద్వారకా పూజను రాహుల్ గాంధీ నాటకంగా అభివర్ణించారని షెహజాద్ పూనావాలా అన్నారు.


కాంగ్రెస్ కొంత మంది ఓటు బ్యాంకును నమ్ముకుంటోందని బీజేపీ అధికార ప్రతినిధి హెజజాద్ పూనావాల విమర్శించారు. రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాగూర్ మద్దతు తెలిపారు. అయోధ్య ప్రాణప్రతిష్ఠ సమయంలో ప్రధాన వేదిక వద్ద బాలీవుడ్ సెలబ్రిటీలు, దేశంలోని అత్యంత సంపన్నులు ఉన్నారని.. అయోధ్య ప్రజలు మాత్రమం బయటే వేచి ఉన్నారని మాణిక్కం ఠాగూర్ పేర్కొన్నారు. అదే విషయాన్ని రాహుల్ గాంధీ కూడా చెప్పారని కాంగ్రెస్ పార్టీ మద్దతు తెలిపింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com