ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ ఆలయాల్లో ఇకపై వాళ్లు మాత్రమే పట్టు వస్త్రాలు సమర్ఫించాలి.. చంద్రబాబు సర్కార్ సంచలన ఆదేశాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Sep 28, 2024, 08:49 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆలయాల్లో ప్రోటోకాల్స్‌కు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర పండగలుగా ప్రకటించిన సందర్భాల్లో.. ప్రధాన ఆలయాల్లో స్వామి, అమ్మవార్లకు ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాల సమర్పించే అంశంపై కీలక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల్లో స్వామి, అమ్మవార్లకు ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలను.. సంబంధిత జిల్లా సీనియర్‌ మంత్రి గానీ, దేవాదాయ శాఖ మంత్రి గానీ, ఇంఛార్జ్ మంత్రి గానీ సమర్పిస్తారు.


ఈ మేరకు దేవాదాయశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్‌.సత్యనారాయణ పండగల సమయంలో ఆలయాల్లో పాటించాల్సిన ప్రొటోకాల్‌పై ఉత్తర్వు జారీచేశారు. పండగల ఏర్పాట్లను జిల్లా కలెక్టర్‌ సమన్వయం చేయాలని కూడా ఉత్తర్వుల్లో ప్రస్తావించారు. అలాగే ఈ కార్యక్రమాలకు సంబంధించి ఖర్చును ఆయా శాఖలే భరించాలని కూడా పేర్కొన్నారు. ఒకవేళ అదనంగా ఖర్చులుంటే వాటిని ఆ ఆలయ నిధుల నుంచి గానీ, సర్వశ్రేయోనిధి (సీజీఎఫ్‌) నుంచి కానీ వెచ్చించాలని తెలిపారు. గరిష్ఠంగా రూ.50 లక్షల వరకు సీజీఎఫ్‌ నుంచి పండగలకు వెచ్చించవచ్చని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.


తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై వివాదం రేగింది.. ఆ తర్వాత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తిరుమల పర్యటన అంశంతో రాజకీయాలు వేడెక్కాయి. జగన్ శ్రీవారిని దర్శించుకోవాలంటే కచ్చితంగా డిక్లరేషన్ ఇవ్వాల్సిందేనని హిందూ సంఘాలు, కూటమి నేతలు డిమాండ్ చేశారు. ముందస్తు జాగ్రత్తగా పోలీసులు అప్రమత్తం అయ్యారు. కూటమి నేతలతో పాటుగా వైఎస్సార్‌సీపీ నేతలకు నోటీసులు ఇచ్చారు. అలాగే తిరుపతిలో యాక్ట్ 30న అమలు చేశారు. అయితే చివరి నిమిషంలో వైఎస్ జగన్ తిరుమల పర్యటనను రద్దు చేసుకున్నారు.


సాక్షాత్తూ మాజీ ముఖ్యమంత్రి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్తానంటే వద్దని చెప్పడం దారుణమన్నారు వైఎస్ జగన్. తాను గతంలో ఎన్నో సందర్భాల్లో తిరుమలకు వెళ్లానని.. గత ఐదేళ్లు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో పట్టు వస్త్రాలను సమర్పించిన విషయాన్ని గుర్తు చేశారు. అలాంటప్పుడు ఇప్పుడు డిక్లరేషన్ ఎందుకు తెరపైకి తెచ్చారని ప్రశ్నించారు.. చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇలాంటి రాక్షస ప్రభుత్వం ఎక్కడా చూడలేదని.. మాజీ ముఖ్యమంత్రి పరిస్థితి ఇలా ఉంటే.. సామాన్యుల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.


తిరుమల శ్రీవారిపై విశ్వాసం ఉందని డిక్లరేషన్‌ ఇచ్చి దర్శనానికి వెళ్లడం జగన్‌కు ఏ మాత్రం ఇష్టం లేదన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. అందుకే ఆయన తిరుమల ప్రయాణం రద్దు చేసుకున్నారని.. ఆ విషయం బయటకు చెప్పకుండా స్వామివారి దర్శనానికి వెళ్లేందుకు అనుమతి లేదంటూ పోలీసులు నోటిసులు ఇచ్చారంటూ అబద్ధాలు చెప్పారని మండిపడ్డారు. జగన్ చెప్పినట్లు దళితుల్ని దేవాలయాల్లోకి వెళ్లకుండా ఎవరు అడ్డుకుంటున్నారు? అని ప్రశ్నించారు. తిరుమల వెళ్లకుండా ఉండేందుకు సాకులు వెతుక్కుంటూ, కావాలని ఇతరులపై బురదజల్లడం ఏంటని ప్రశ్నించారు.


జగన్ ముఖ్మయంత్రి కాబట్టి గతంలో ఆయన్ను డిక్లరేషన్ అడలేదని.. ఎవరూ అడ్డుకోలేదన్నారు. అందుకే తిరుమలలో అపచారాలు జరిగాయని.. ముఖ్యమంత్రి హోదాలో చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడ్డానని చెప్పడం సరికాదని.. చట్టాన్ని గౌరవిస్తానని, రాజ్యాంగాన్ని ఉల్లంఘించనని ప్రమాణం చేసిన వ్యక్తి వాటిని ఉల్లంఘించడం నేరం కాదా? అని ప్రశ్నించారు. శాసనాలు, చట్టాలు చేసే శాసనసభ్యులే వాటికి కట్టుబడకపోతే, ప్రజలు ఎందుకు గౌరవిస్తారో చెప్పాలన్నారు. జగన్‌కు ఇష్టం లేకపోతే తిరుమలకు వెళ్లాల్సిన అవసరం లేదని.. ఒకవేళ వెళితే నిబంధనల ప్రకారం అక్కడి సంప్రదాయాల్ని పాటించాల్సిందే అన్నారు. తాను నాలుగు గోడల మధ్య బైబిల్‌ చదువుతానని జగన్ చెప్పారని.. తాను క్రైస్తవ మతాన్ని ఆచరిస్తున్నానని అంగీకరించినట్టే కదా? అన్నారు. తాను హిందువునని.. వేంకటేశ్వరస్వామి భక్తుణ్ని అన్నారు చంద్రబాబు. ఓపెన్‌గానే పూజలు చేస్తానని.. చర్చిలకు, మసీదులకు వెళ్లినప్పుడు వారి ఆచారాల్ని, నియమాల్ని గౌరవిస్తానన్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com