ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైకోర్టులోకి అరకిలో వెల్లుల్లిని తెచ్చిన లాయర్.. జడ్జి సీరియస్

national |  Suryaa Desk  | Published : Sat, Sep 28, 2024, 10:37 PM

ఉత్తర్‌ప్రదేశ్‌లోని అలహాబాద్ హైకోర్టులో తాజాగా ఓ కీలక సన్నివేశం చోటు చేసుకుంది. కేసు విచారణ సందర్భంగా ఓ లాయర్.. హైకోర్టుకు అరకిలో వెల్లుల్లిని తీసుకురావడం తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ క్రమంలోనే లాయర్ వద్ద ఉన్న వెల్లుల్లిని చూసిన జడ్జి ఫైర్ అయ్యారు. అంతటితో ఆగకుండా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్‌కు సమన్లు కూడా జారీ చేశారు. అయితే అసలు లాయర్ కోర్టులోకి వెల్లుల్లిని తీసుకురావడానికి కారణం ఏంటి. అందుకు జడ్జి ఆగ్రహం వ్యక్తం చేయడం ఏంటి. ఇందులో ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్‌కు సమన్లు ఎందుకు ఇచ్చారు అనే చర్చ జరుగుతోంది. ఇంతకీ అక్కడ ఏం జరిగిందంటే.


చైనా వెల్లుల్లి దిగుమతి, వాడకంపై మన దేశంలో 2014 నుంచి నిషేధించారు. అందులో రసాయనాలు, పురుగు మందులు అధికంగా ఉన్నాయని గుర్తించి.. వాటిపై ఆంక్షలు విధించారు. అయితే ఇప్పటికీ మన దేశంలో చైనా వెల్లుల్లి కనిపిస్తుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. అయితే చైనా వెల్లుల్లిపై 10 ఏళ్ల క్రితమే కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించినా ఇంకా విక్రయాలు జరుగుతున్నాయని న్యాయవాది మోతీలాల్ యాదవ్.. అలహాబాద్‌ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ క్రమంలోనే మన దేశంలో ఇంకా చైనా వెల్లుల్లి దొరుకుతుందని చెప్పడానికి.. దాన్ని స్వయంగా జడ్జికి చూపించడానికి లాయర్ మోతీలాల్ యాదవ్.. అరకిలో వెల్లుల్లిని అలహాబాద్ హైకోర్టుకు తీసుకువచ్చారు. దాంతోపాటు మన దేశంలో పండించే సాధారణ వెల్లుల్లిని కూడా కోర్టులోకి తెచ్చాడు.


చైనా వెల్లుల్లిపై మోతీలాల్ యాదవ్ దాఖలు చేసిన పిల్‌పై విచారణ సందర్భంగా జస్టిస్ రాజన్ రాయ్, జస్టిస్ ఓం ప్రకాశ్ శుక్లాలతో కూడిన ధర్మాసనం ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సమన్లు జారీ చేసింది. ఈ చైనా వెల్లుల్లి విక్రయాలపై అలహాబాద్ హైకోర్టు సీరియస్ అయింది. దీనిపై ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వ ఫుడ్ సేఫ్టీ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్ అధికారిని.. హైకోర్టుకు పిలిచి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హానికరమైన ప్రభావాల కారణంగా 2014లోనే చైనా వెల్లుల్లిపై మన దేశంలో నిషేధం విధించినా.. ఇంకా మార్కెట్లో ఎలా విక్రయిస్తున్నారని హైకోర్టు ప్రశ్నించింది. నిషేధిత వస్తువులు దేశంలోకి ప్రవేశించకుండా అడ్డుకునే అధికార యంత్రాంగానికి తగిన సూచనలు చేయాలని డిప్యూటీ సొలిసిటర్ జనరల్ సూర్యభాన్ పాండేకు ఆదేశాలు ఇచ్చింది.


ఈ సందర్భంగా నిషేధిత వస్తువులను దేశంలోకి ఎలా వస్తున్నాయి.. వాటిని రాకుండా అడ్డుకునేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో తెలపాలని కోర్టు ఆదేశించింది. మన దేశంలోకి చైనా వెల్లుల్లిని దిగుమతి, విక్రయాలపై విచారణ జరిపి దోషులుగా తేలిన అధికారులు, ఇతర నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకునేలా సీబీఐని ఆదేశించాలని లాయర్ మోతీలాల్ యాదవ్ తన పిటిషన్‌లో కోరారు.


చైనా నుంచి భారత్‌లోకి ఫంగస్ సోకిన వెల్లుల్లి దిగుమతి అవుతోందని వచ్చిన నివేదికల కారణంగా 2014లో కేంద్ర ప్రభుత్వం చైనీస్ వెల్లుల్లిపై నిషేధం విధించారు. ఈ చైనా వెల్లుల్లిలో పురుగు మందులు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని తీవ్ర ఆందోళనలు వ్యక్తం కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచంలో అత్యధికంగా వెల్లుల్లిని ఉత్పత్తి చేస్తున్న చైనా.. పురుగు మందులు, రసాయనాలను అధికంగా ఉపయోగించి పండిస్తున్నారని మోతీలాల్ యాదవ్ తన పిల్‌లో పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com