ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆ మొక్కలు ఎవరూ నాటొద్దు.. మనిషి ప్రాణాలకే ముప్పు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Aug 30, 2024, 08:19 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశీయ మొక్కల పచ్చదనంతో కళకళలాడాలన్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ వన మహోత్సవంలో పాల్గొనాలని ఇది సామాజిక బాధ్యత అన్నారు. అన్య జాతుల మొక్కలను పెంచడం మానేద్దామని.. దేశవాళీ జాతుల మొక్కలే పర్యావరణానికి నేస్తాలన్నారు. వన మహోత్సవం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పవన్ కళ్యాణ్ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. అలాగే కొన్ని మొక్కల పెంపకానికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు.


వన మహోత్సవాన్ని ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా తీసుకోవాలని.. అదే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. రాష్ట్రంలో 29 శాతం మాత్రమే పచ్చదనం ఉందని.. విరివిగా ప్రతి ఒక్కరూ మొక్కలను నాటడం ద్వారా, వాటి సంరక్షణ బాధ్యతను తీసుకోవాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 50 శాతానికి పచ్చదనం పెరగాలని కూటమి ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని.. మొక్కల పెంపకం ఒక ప్రాంతానికి మాత్రమే పరిమితం అయ్యేది కాదన్నారు. ప్రతి ఒక్కరూ తమకు అనువైన ప్రదేశాల్లో మొక్కలను నాటి, వాటి పెరుగుదలకు తగిన బాధ్యత తీసుకోవాలని సూచించారు.


రాష్ట్రవ్యాప్తంగా వనమహోత్సవం కార్యక్రమంలో నాటబోయే మొక్కల జాతుల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు పవన్ కళ్యాణ్. దేశీయ జాతులను ఎంపిక చేసుకోవాలని.. స్థానిక వృక్ష జాతులకు చెందిన మొక్కలు నాటడం ద్వారా జీవ వైవిధ్యాన్ని, నేల ఆరోగ్యాన్ని సంపూర్ణంగా కాపాడవచ్చని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అప్పుడు పర్యావరణ సమతుల్యత, మానవ ఆరోగ్యాన్ని కాపాడినవాళ్లమవుతామన్నారు. దేశ భౌగోళిక పరిస్థితులకు విరుద్ధంగా ఉండే, అన్య జాతుల మొక్కలు నాటడం వల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది అన్నారు.


ఈ మొక్కలు వేగంగా పెరుగుతాయని, ఎవెన్యూ ప్లాంటేషన్ అని, నిర్వహణ ఖర్చులు తక్కువ అనే కోణంలో గత దశాబ్ద కాలంగా కోనో కార్పస్, ఏడు ఆకుల పాల, మడగాస్కర్ ఆల్మన్, ఆస్ట్రేలియా తుమ్మ వంటి అన్యజాతుల మొక్కలను నాటారన్నారు డిప్యూటీ సీఎం. వీటి వల్ల పర్యవరణానికి మేలు కంటే కూడా కీడు అధికంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారన్నారు. అన్య జాతుల మొక్కలు- భూగర్భ జలసంపద మీద ప్రభావం చూపడంతోపాటు మనిషికి ఆరోగ్యపరంగానూ ఇబ్బందులు తెస్తాయన్నారు. అందుకే కొన్ని కీలకమైన సూచనలు చేశారు.


అరబ్ దేశాల్లో పచ్చదనం కోసం కోనోకార్పస్ జాతి మొక్కలను విరివిగా పెంచారన్నారు పవన్ కళ్యాణ్. అయితే తర్వాత వాటి దుష్ప్రభావం అర్థం చేసుకొని అరబ్ దేశాలే ఈ మొక్కను వద్దనుకొని నిషేధించాయని చెప్పుకొచ్చారు. దేశంలోనూ తెలంగాణ, కర్ణాటక, గుజరాత్, అస్సాం ప్రభుత్వాలు సైతం కోనోకార్పస్‌ను నిషేధించాయన్నారు. కోనోకార్పస్ వల్ల జరిగే అనర్థాలు అధికంగా ఉన్నాయని.. భూగర్భ జలసంపదను ఎక్కువగా వినియోగించుకోవడంతోపాటు చుట్టుపక్కల ఉన్నవారికి శ్వాస సంబంధ సమస్యలు వస్తాయన్నారు. కోనోకార్పస్ మొక్కను పశువులు తినవని.. పక్షులు గూడుపెట్టుకోవన్నారు. చెట్లను ఆశ్రయించే క్రిమికీటకాలు రావని.. పక్షులే దూరంగా ఉండే ఈ మొక్కలను పెంచుకోవడం సరికాదన్నారు. ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా ఈ మొక్కను నాటడం మానేయాలని సూచించారు.


అందుకే కార్తీకమాసం వనసమారాధన వరకు జరిగే ఈ వన మహోత్సవం వేళ దేశీయ జాతుల మొక్కలను, అందరికీ మేలు చేసే మొక్కలను విరివిగా పెంచుదామని పిలుపునిచ్చారు పవన్. వేప, మామిడి, రావి, కానుగ, చింత, శ్రీగంధం, మర్రి, ఉసిరి, అశోక, రేలా, దిరిసెం మారేడు, నేరేడు, దేవకాంచన, తెల్లమద్ది, కదంబం, జమ్మి, సీత అశోక, వెలగ, సీతాఫల వంటి ఎన్నో మనకు ఉపయోగపడే మన జాతులు మొక్కలను పెంచుదామన్నారు. పదిమందికి నీడనిస్తూ, వాటి ఉత్పత్తులను పంచే మొక్కలను నాటుకుందామని పిలుపునిచ్చారు. 29శాతం ఉన్న పచ్చదనాన్ని 50 శాతం చేర్చేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం పని చేస్తుందన్నారు. అందరం సమష్టిగా వన మహోత్సవంలో పాల్గొని రాష్ట్రాన్ని పచ్చదనంతో నింపుదామని.. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వన మహోత్సవాన్ని జయప్రదం చేయాలని కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com