ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హెజ్బొల్లా రాకెట్ల వర్షం.. ఇజ్రాయేల్‌లో ఎమర్జెన్సీ

international |  Suryaa Desk  | Published : Sun, Aug 25, 2024, 08:07 PM

పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. లెబనాన్‌‌లోని హెజ్బొల్లా ఉగ్రవాద స్థావరాలపై ఇజ్రాయేల్ దాడులు చేసింది. తమపై దాడికి కుట్ర చేశారనే అనుమానంతో ఇజ్రాయేల్ ముందస్తు దాడులకు దిగింది. ఆదివారం ఉదయం లెబనాన్‌లోకి దాదాపు 100 యుద్ధ విమానాలు చొచ్చుకెళ్లి.. వేలకొద్దీ రాకెట్లను ధ్వంసం చేశాయి. ఈ మేరకు ఇజ్రాయేల్ ఓ ప్రకటన విడుదల చేసింది. దాడికి ప్రతిదాడి తప్పదని ఆ దేశ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహు హెచ్చరించారు. ‘అక్టోబర్‌ 7’ నాటి మారణహోహానికి మించి అత్యంత భారీ స్థాయి దాడికి సిద్ధమైన హెజ్‌బొల్లా కుట్రను భగ్నం చేసినట్లు ఆయన తెలిపారు.


‘‘దేశాన్ని రక్షించుకోడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకొంటాం.. ఉత్తర ప్రాంతంలోని ప్రజలను సురక్షితంగా వారి ఇళ్లకు చేర్చేందుకు ఈ చర్యలు తీసుకున్నాం.. దాడి చేస్తే.. ప్రతిదాడి తప్పదన్న సాధారణ నియమాన్ని నిజం చేస్తున్నాం’’ అని నెతన్యాహు పేర్కొన్నారు. ఇదే సమయంలో దేశంలో 48 గంటల ఎమర్జెన్సీని ప్రకటించిన ఇజ్రాయేల్.. టెల్ అవీవ్ నగరంలోని అంతర్జాతీయ విమానాశ్రయాన్ని మూసివేసింది. అటు, ఇజ్రాయేల్‌ దాడుల్లో ఒకరు చనిపోయినట్టు లెబనాన్‌ మీడియా పేర్కొంది.


కాగా, ఏకంగా 6,000 రాకెట్లతో దాడికి హెజ్బొల్లా సిద్ధమైనట్లు ఇజ్రాయేల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్‌) వర్గాలు వెల్లడించాయి. ఒకవేళ ఇదే నిజమైతే అక్టోబర్‌ 7న హమాస్‌ చేసిన దాడి కంటే ఇది పెద్దది కావచ్చు. గతేడాది ఇజ్రాయేల్‌పై హమాస్ 5 వేల రాకెట్లను ప్రయోగించింది. మరోవైపు, దాడులు ప్రారంభమైనా.. ఇజ్రాయేల్ గూఢచారి సంస్థలు మొస్సాద్‌, షిన్‌బెట్‌ చీఫ్‌లు కైరోలో చర్చలకు వెళ్లారు. అమెరికా ఒత్తిడి కారణంగానే ఇది జరిగినట్లు తెలుస్తోంది.


ఈ పరిణామాలో నేపథ్యంలో ఇజ్రాయేల్ రక్షణ మంత్రి గాలంట్‌తో అమెరికా రక్షణ మంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌ ఫోన్‌లో మాట్లాడారు. ఇజ్రాయేల్ రక్షణకు అమెరికా కట్టుబడి ఉందిన ఈ సందర్భంగా ఆయన పునరుద్ఘాటించారు. హెజ్బొల్లా రాకెట్‌ దాడులపై ఇరువురూ చర్చించారు. ఇదిలా ఉండగా, ఇజ్రాయేల్‌-లెబనాన్‌ మధ్య పరిస్థితిని తమ అధ్యక్షుడు జో బైడెన్‌ జాగ్రత్తగా గమనిస్తున్నట్లు అమెరికా నేషనల్‌ సెక్యూరిటీ కౌన్సిల్‌ ప్రతినిధి సియాన్‌ సావెట్ట్‌ వెల్లడించారు. టెల్‌ అవీవ్‌ ఆత్మరక్షణ హక్కును కాపాడుకొనేందుకు మేం సహకరిస్తామని ఆయన పేర్కొన్నారు.


అటు, ఇజ్రాయేల్‌ స్థావరాలే లక్ష్యంగా 320 కత్యూషా రాకెట్లను హెజ్బొల్లా ప్రయోగించింది. దీనిని తమ అగ్రనేత ఫాద్‌ షుక్రు హత్యకు ప్రతీకారంగా తొలివిడత దాడిగా అభివర్ణించింది. లెబనాన్‌లోని హెజ్బొల్లా ఉగ్రవాదులకు ఇరాన్‌ నుంచి సైనిక శిక్షణ, ఆయుధ సహకారం పుష్కలంగా అందుతోందని ఇజ్రాయేల్ ఆరోపిస్తోంది. దీంతో పాటు సిరియా పాలకుల నుంచి సాయం కొనసాగుతోందని, 2022లో లెబనాన్ పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో వారు 13 సీట్లు గెలవడమే దీనికి ఉదాహరణ అని అంటోంది. సిరియా అంతర్యుద్ధంలో అధ్యక్షుడు బషర్‌ తరఫున పోరాడటం వీరికి కలిసివచ్చింది. యుద్ధ శిక్షణ, ఆయుధ వినియోగంలో వీరికి శిక్షణ ఇస్తోందని ఆరోపించిన అమెరికా.. దానిని ఉగ్రవాద సంస్థగా ప్రకటించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com