ట్రెండింగ్
Epaper    English    தமிழ்

దుర్గమ్మ సన్నిధిలో అపచారంపై మంత్రి స్పందన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Aug 11, 2024, 07:34 PM

విజయవాడలోని కనకదుర్గమ్మ గుడిలో జరిగిన అపచారంపై దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి స్పందించారు. దుర్గామల్లేశ్వర స్వామి దేవాలయంలో దుర్గమ్మతల్లి మూలవిరాట్‌ను ఓ మహిళా భక్తురాలు వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారంటూ వార్తలు వచ్చాయి. దీనిపై మంత్రి ఆనం రామనారాయణరెడ్డి రియాక్టయ్యారు. ఈ విషయాన్ని దేవాదాయశాఖ తీవ్రంగా పరిగణిస్తోందన్న ఆనం రామనారాయణరెడ్డి .. దీనిపై విచారణ జరపాలని విజయవాడ పోలీస్ కమిషనర్‌ను ఆదేశించినట్లు చెప్పారు. పోలీసుల దర్యాప్తులో బాధ్యులైన వ్యక్తిని గుర్తించామని.. వీడియో తీసింది మహిళకాదు పురుషుడని వెల్లడించారు. భవిష్యత్తులో మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు.


 సచివాలయంలో తనకు కేటాయించిన ఛాంబర్‌లో ఆనం రామనారాయణరెడ్డి ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం రెండు ముఖ్యమైన ఫైళ్ల మీద మంత్రి సంతకాలు చేశారు. రూ.113 కోట్ల సి.జి.ఎఫ్. నిధులతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 160 దేవాలయాల ఆధునీకరణ పనుల ఫైల్‌తో పాటుగా.. తూర్పుగోదావరి జిల్లా మండపేటలోని అగస్తేశ్వరస్వామి దేవాలయాన్ని కోటి రూపాయలతో ఆధునీకరించే ఫైల్ మీద మంత్రి సంతకాలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. సీఎం చంద్రబాబు నేతృత్వంలో భగవంతుని ఆస్తుల పరిరక్షణకే తమ ప్రాధాన్యం ఉంటుందని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో దేవాలయాల భూములు అన్యాక్రాంతం అయ్యాయన్న ఆనం రామనారాయణరెడ్డి.. టీడీపీ కూటమి ప్రభుత్వంలో చిన్న తప్పు జరిగినా ఉపేక్షించేది లేదన్నారు.


దివ్వెల మాధురి కారుకు ప్రమాదం.. అసలు కారణం వేరే!


మరోవైపు ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కృష్ణా, గోదావరి పవిత్ర సంగమం వద్ద నదులకు జలహారతులు సమర్పించేవారు. అయితే వైసీపీ ప్రభుత్వంలో ఈ పద్ధతి ఆగిపోయింది. అయితే పవిత్ర సంగమం వద్ద జలహారతులను తిరిగి ప్రారంభించనున్నట్లు దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తెలిపారు. గత టీడీపీ ప్రభుత్వంలో పట్టిసీమ ప్రాజెక్టును పూర్తి చేసి కృష్ణా, గోదావరి జలాల పవిత్ర సంగమం ఫెర్రీ ఘాట్ వద్ద జలహారతులు ఇచ్చే కార్యక్రమం నిర్వహించేవారని మంత్రి గుర్తుచేశారు.


గత వైసీపీ ప్రభుత్వం దీనిని నిలిపివేసిందని.. సీఎం చంద్రబాబు ఆదేశాలతో ఈ కార్యక్రమాన్ని తిరిగి ప్రారంభిస్తామని ఆనం వెల్లడించారు. అలాగే రూ.50 వేలలోపు ఆదాయం ఉన్న ఆలయాలకు ప్రతినెలా పదివేలు అందించే అంశంపై ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించినట్లు ఆనం రామనారాయణరెడ్డి చెప్పారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com