ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉత్తరాంధ్ర నుంచి లోకేష్ పోటీ!

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 30, 2019, 08:36 PM

తెలుగుదేశం పార్టీ యువరాజు నారా లోకేష్ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేయాలనే అంశంపై ఆయనతో పాటు పార్టీ కూడా ఒక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. తండ్రి చంద్రాబాబు నాయుడు ఎలాగూ రాయలసీమ నుంచి పోటీ చేస్తారు కాబట్టి.. తనయుడు నారా లోకేష్ ఉత్తరాంధ్ర నుంచి పోటీ చేస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నారు. ఉత్తరాంధ్రలో ఏదో ఒక జిల్లా నుంచి లోకేష్ పోటీలోకి దిగితే ఆ ప్రభావం ఉత్తరాంధ్ర మొత్తం మీద ఉంటుందని టీడీపీ అంచనా వేస్తోంది. వాస్తవానికి ఈ నిర్ణయం తీసుకుని కూడా చాలా కాలం అయినట్లు సమాచారం. అందుకు అనుగుణంగానే నారా లోకేష్ తన కార్యక్రమాలను, పనితీరును మలచుకున్నారని పార్టీ వర్గాలు చెపుతున్నాయి. ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారనే విషయాన్ని రహస్యంగా ఉంచుతున్నప్పటికీ శ్రీకాకుళం జిల్లా నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్ల లోకేష్ సన్నిహితుల ద్వారా తెలుస్తోంది. అయితే అర్బన్ ప్రాంతం ఉండే నియోజకవర్గం నుంచి కాకుండా పూర్తిగా గ్రామీణ ప్రాంతాలు అధికంగా ఉండే నియోజకవర్గం ఎంచుకుని పోటీ చేయనున్నట్లు సమాచారం.
మూడేళ్ళ క్రితం నారా లోకేష్ కు శాసన మండలి సభ్యునిగా తీసుకుని తన మంత్రి వర్గంలో చోటు కల్పించారు చంద్రబాబునాయుడు. అయితే ఆసమయంలో లోకేష్ దొడ్డిదారిన వచ్చాడని.. ప్రత్యక్షంగా అసెంబ్లీకి పోటీ చేసి ప్రజామోదం పొంది చట్ట సభలకు వచ్చే దమ్ము లోకేష్ కి లేదని ప్రతిపక్షాలు ఆనేక విమర్శలు చేశాయి. ఇవన్నీ దృష్టలో పెట్టుకుని ఈ సారి లోకేష్ ను అసెంబ్లీకి పోటీ చేయించి భారీ మెజార్టీతో గెలిపించుకోవాలని పార్టీ మొత్తం కంకణం కట్టుకుంది. ఈ క్రమంలో లోకేష్ తండ్రి నియోజకవర్గమైన కుప్పం నుంచి పోటీ చేస్తారని, లేదు రాజధాని పరిధిలో ఉన్న మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని ఈ రెండూ కాదు కమ్మ సామాజికవర్గం అధికంగా ఉన్న పెనమలూరు అసెంబ్లీ స్ధానం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. లోకేష్ పోటీ చేయడానికి ఈ మూడు సేఫ్ నియోజకవర్గాలనే భావన పార్టీ నేతల్లో కూడా నెలకొంది. అయితే ఏ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలనే అంశం కంటే ముందు లోకేష్ ప్రజామోదం పొందాలనే ఉద్దేశంతో ఆయనకు అత్యంత కీలకమైన పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఐటీ శాఖలు కేటాయించారు చంద్రబాబు. ముఖ్యంగా పంచాయితీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలైతే నేరుగా ప్రజలతో సంబంధాలు కొనసాగించే అవకాశాలు ఉన్నాయనే ఉద్దేశంతో ఆ శాఖలు కేటాయించారు సీయం చంద్రబాబు.
తండ్రి చంద్రబాబు నాయడి ఆలోచనలకు అనుగుణంగానే లోకేష్ ఆంధ్రపదేశ్ గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. మెజార్టీ గ్రామ పంచాయితీల్లో ఏదో ఒక అభివృద్ధి పని పూర్తి చేసి ఆశాఖ మంత్రిగా తన పేరు మీద శిలాఫలకాలు ఏర్పాటు చేయించుకున్నారు. వారంలో రెండు మూడు రోజులు జిల్లా పర్యటనలు పెట్టుకుని గ్రామాల్లో పర్యటించి ప్రజలతో మమేకమయ్యే ప్రయత్నం చేశారు. శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలను పెథాయ్ తుఫాను అతలాకులతలం చేసినప్పుడు రోజుల తరబడి ఆ జిల్లాల్లో తిష్ట వేసి అధికార యంత్రాంగాన్ని ఉరుకులు పరుగులు పెట్టించి తుఫాను సహాయక చర్యల్లో స్వయంగా పాల్గొన్నారు. కారులో వెళ్లలేని గ్రామాలకు టూ వీలర్ మీద వెళ్లారు. మొత్తం మీద కష్ట సమయంలో సిక్కోలు వాసులతో మమేకమై వారిలో ప్రభుత్వం పట్ల ఒక భరోసా కల్పించారు. పనిలో పనిగా తన వ్యక్తిగత ఇమేజ్ కూడా పెంచుకున్నారు.
పైగా ఉత్తరాంధ్ర, అందునా శ్రీకాకుళం జిల్లా తెలుగుదేశం పార్టీకి కంచుకోట. ఆ పార్టీ వ్యవస్ధాపకుడు దివంగ ఎన్టీఆర్ నుంచి నేటి వరకూ మెజార్టీ సిక్కోలు వాసులు టీడీపీ వెన్నంటే ఉన్నారు. ఈ కారణంగా లోకేష్ వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లాలోని ఒక గ్రామీణ నియోజకవర్గం ఎంపిక చేసుకుని అక్కడి నుంచే పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. తాను ఉత్తరాంధ్ర నుంచి పోటీ చేయాలనుకుంటున్నట్లు లోకేష్ కూడా తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానించినట్లు సమాచారం.


 


 


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com