ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విమానం గాల్లో ఉండగానే తెరుచుకున్న పైకప్పు.. వీడియోను చూస్తే గుండె ఆగిపోవడం ఖాయం

international |  Suryaa Desk  | Published : Wed, Jun 26, 2024, 10:33 PM

తేలికపాటి విమానంతో గగనతలంలో విన్యాసాలు చేస్తుండగా.. మహిళా పైలట్‌కు ఊహించని అనుభవం ఎదురైంది. విమానం గాల్లో ఉండగానే దాని పైకప్పు తెరుచుకుంది. దీంతో కొద్ది సమయం పాటు అలాగే ప్రయాణించిన తర్వాత సురక్షితంగా ల్యాండింగ్ జరిగింది. దీంతో పైలట్‌‌కు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. తనకు ఎదురైన ఈ భయానక అనుభవం గురించి సదరు పైలట్ ఎక్స్‌ (ట్విట్టర్)లో పోస్ట్ చేయగా.. సోషల్ మీడియాలో ఇది వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే.. నెదర్లాండ్స్‌కు చెందిన నరైన్‌ మెల్కుమ్జాన్‌ అనే మహిళా పైలట్‌.. తేలికపాటి విమానంతో టెకాఫ్ తీసుకున్నారు. అనంతరం గగనతలంలో విన్యాసాలు చేస్తుండగా.. అకస్మాత్తుగా దాని పైకప్పు తెరచుకుంది.


‘అనేక ఏళ్లుగా నా ఏరోబాటిక్ శిక్షణా విమానంలో అది నా రెండో ప్రయాణం.. ఆ రోజు చాలా వేడిగా ఉంది.. నేను నడుపుతున్న ‘ఎక్స్‌ట్రా 330LX విమానం గాల్లో ఉండగానే అకస్మాత్తుగా పైకప్పు తెరుచుకుని పగిలిపోయింది. టేకాఫ్‌కి ముందు సరైన తనిఖీలు చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు.. నిజంగా ఇది సవాల్‌గా ఉండే అనుభవం. విమానం లాకింగ్ పిన్ పడలేదు.. నేను దానిని గమనించడంలో విఫలమయ్యాను. కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకోకుండానే శిక్షణకు వెళ్లి మరో తప్పు చేశాను.. శరీరానికి విశ్రాంతి కోసం సమయం కేటాయించలేదు.. అదనంగా, కంటి రక్షణగా కళ్లజోడు కూడా ధరించకపోవడం నా పరిస్థితి మరింత దిగజారింది.


ఒకవైపు విమానం భారీ శబ్దం.. ఇంకోవైపు సరిగ్గా చూడలేక, శ్వాస తీసుకోలేని దుస్థితి... కంటి చూపు విషయంలో పూర్తిగా కోలుకోడానికి దాదాపు 28 గంటలు పట్టింది. అవి నా జీవితంలో ఎంతో బాధాకరమైన క్షణాలు.. నా కోచ్ రేడియోలో ఏమి చెబుతున్నాడో వినడం చాలా కష్టంగా ఉన్నప్పటికీ ఒక విషయం నేను బిగ్గరగా, స్పష్టంగా విన్నాను ‘ఎగురుతూ ఉండండి’’ అని రెండేళ్ల కిందట తనకు ఎదురైన ఈ అనుభవాన్ని ఆమె పంచుకున్నారు. ఇంత ఆలస్యంగా దీనిని బయటపెట్టానని, కానీ, తన అనుభవం పైలట్లకు ఒక హెచ్చరికగా ఉపయోగపడుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. తాను చేసిన తప్పుల నుంచి వారు పాఠాలు నేర్చుకుంటారని ఆశిస్తున్నట్లు తెలిపారు.


కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఆమెపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. మీరు చాలా ధైర్యవంతురాలని ఒకరు.. విపత్కర పరిస్థితుల్లోనూ ఆందోళన చెందకుండా సురక్షితంగా బయటపడ్డారంటూ మరొకరు ఆమెను మెచ్చుకున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com