ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కట్టెల కోసం వెళ్తే కనిపించిన వింత ఆకారం.. కట్ చేస్తే ఇద్దరు మృతి.. మన్యంలో మిస్టరీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Jun 24, 2024, 10:32 PM

50 గడపలు ఉన్న ఆ మారుమూల గ్రామంలో 350 మంది నివాసం ఉంటున్నారు. అంతా ఐకమత్యంగా ఉంటూ కొండల మధ్య ప్రశాంతంగా జీవించే ఆ గ్రామస్థులు ఇప్పుడు బిక్కుబిక్కుమంటూ కంటిమీద కునుకు లేకుండా గడుపుతున్నారు. ఇద్దరు గ్రామస్థులు కళ్లెదుటే క్షణాల వ్యవధిలో వాంతులు విరోచనాలతో చనిపోవడం.. ఇది కచ్చితంగా దెయ్యం పనేనని గ్రామస్థులు నమ్ముతున్నారు. వీరి మూఢనమ్మకాన్ని పక్కనబెడితే.. గ్రామంలో చావులకు కారణమేంటనేది ఇప్పుడు మిస్టరీగా మారింది.


అల్లూరి సీతారామరాజు మన్యం జిల్లా పెదబయలు మండలం అరడకోట పంచాయతీ చుట్టుమెట్ట గ్రామంలో.. ఈనెల 19వ తేదీన ముగ్గురు మహిళలు సమీపంలోని అడవికి కట్టెలు కోసం వెళ్లారు. అకస్మాత్తుగా పెద్ద శబ్ధం వచ్చింది. పాంగి అనసమ్మ అనే గృహిణికి ఒక ఆకారం కనిపించింది. దీంతో పాంగి అనసమ్మ పరుగులు పెడుతూ ఇంటికి వచ్చి పడిపోయింది. స్పృహ కోల్పోయిన పాంగి అనసమ్మను చూసిన తమ్ముడు త్రినాథ్ అదే గ్రామానికి చెందిన భూతవైద్యుడికి విషయం చెప్పాడు.


మన్యంలో భూతవైద్యుడిని గొరవడు అని పిలుస్తారు. గొరవడు కిముడు సహదేవ్.. పాంగి అనసమ్మకు మంత్రోచ్ఛారణ చేస్తూ విభూది జల్లాడు. ఈ క్రమంలో మంత్రోచ్ఛారణ చేస్తున్న గొరవడు సహదేవ్ ఒక్కసారిగా కుప్పకూలిపోయి వాంతులు విరేచనాలతో మృతి చెందాడు. గ్రామస్థులు ఏమి జరిగిందో అని తెలుసుకొనే లోపే.. అనసమ్మకు సపర్యలు చేస్తున్న తమ్ముడు త్రినాథ్.. గొరవడు సహదేవ్ మాదిరిగానే వాంతులు, విరోచనాలు చేసుకుని మృతి చెందాడు. క్షణాల వ్యవధిలో ఇద్దరు ఒకే లక్షణాలతో మృతి చెందడంతో గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు.


చనిపోయిన ఇద్దరికీ దహన సంస్కారాలు నిర్వహించడానికి గ్రామస్థులు స్మశాన వాటికకు వెళ్లారు. అక్కడ కొందరు చితిని ఏర్పాటు చేస్తున్న సమయంలో.. ఒకరి నోటి నుండి ఏయ్ మీరెందుకు వచ్చారు, ఇప్పటికే ఇద్దరి పని అయిపోయింది, నీ తొడ భాగం కావాలి అంటూ హెచ్చరించడం గ్రామస్థులను మరింత భయాందోళనకు గురి చేసింది. తమ గ్రామాన్ని దెయ్యం ఆవహించిందని.. ఇంక ఎంత మందిని బలితీసుకుంటుందో అని గ్రామస్థులు భయపడిపోతున్నారు.


అయితే, ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి రావడంతో మీడియా బృందం తాజాగా చుట్టుమెట్ట గ్రామాన్ని సందర్శించింది. మీడియాతో మాట్లాడిన గ్రామస్థులు.. తమ గ్రామానికి దోషం పట్టిందని, దెయ్యాలతో గ్రామానికి ప్రమాదం పొంచి ఉందని తెలిపారు. గ్రామస్థులు అందరూ ఏ పనికీ వెళ్లకుండా గుంపులు గుంపులుగా రాత్రి పగలూ ఓకే చోట ఉంటున్నారు. వైద్య శాఖకు చెందిన ANM గ్రామానికి చేరుకొని వైద్య సేవలు అందిస్తున్నారు. అసలు చుట్టుమెట్ట గ్రామంలో ఏమి జరిగింది అనేది ప్రస్తుతానికి అయితే మిస్టరీగానే ఉంది. అధికారులు ఏమైనా చొరవ తీసుకుని.. మరణాలకు గల కారణాలు తెలుసుకుంటారేమో చూడాలి.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com