ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వృద్ధుడి ప్రాణం తీసిన యువకుల రీల్స్ పిచ్చి.. ఫేమస్ అయ్యేందుకు ఎంతకు తెగించార్రా

national |  Suryaa Desk  | Published : Mon, Jun 24, 2024, 10:19 PM

సోషల్ మీడియా అనేది రెండు వైపులా పదును ఉన్న కత్తి వంటింది. దాన్ని ఎంత మంచికి ఉపయోగిస్తే అంత మంచిది. కాదని చెడుకు వినియోగిస్తే.. అది ప్రాణాలు తీస్తూ ఉంటుంది. ఇక సోషల్ మీడియా కారణంగా అతి సామాన్యులు, పేదలు కూడా రాత్రికి రాత్రి కోటీశ్వురులైన తమ పేదరికాన్ని జయించిన సంఘటనలు ఎన్నో చూశాం. అయితే అదే సోషల్ మీడియా కారణంగా ప్రాణాలు తీసుకున్న వారిని కూడా చూశాం. కానీ ఇప్పుడు చెప్పబోయే సంఘటన మాత్రం తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసేది. ఎందుకంటే కొంత మంది యువకులు.. సరదాకు, ఫేమస్ అయ్యేందుకు తీసిన వీడియోలు, రీల్స్.. ఓ వృద్ధుడి ప్రాణాన్ని తీశాయి. రాజస్థాన్‌లో జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది.


రాజస్థాన్‌లో జరిగిన ఈ సంఘటన ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. బార్మర్ జిల్లాలోని చోహ్‌టాన్ అనే గ్రామానికి చెందిన ప్రతాప్ రామ్‌సింగ్ అనే 70 ఏళ్ల వృద్ధుడు బతుకుదెరువు కోసం చెత్త, ప్లాస్టిక్ ఏరుకుని జీవనం సాగించేవాడు. ఈ క్రమంలోనే చెత్త, ప్లాస్టిక్ సామాన్లు ఏమైనా ఉన్నాయా అని ఇంటింటికీ 3 చక్రాల సైకిల్ ‌మీద వెళ్తూ అడిగేవాడు. అయితే అది చూసిన లొహావత్ గ్రామానికి చెందిన కొందరు యువకులు.. ప్రతాప్ రామ్‌సింగ్ చేస్తున్న పనిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియోను చూసి స్థానికులు ప్రతాప్‌ రామ్‌సింగ్‌ను హేళన చేయడం ప్రారంభించారు. అయితే మొదట్లో ఆ వేధింపులను పట్టించుకోని ప్రతాప్‌ రామ్‌సింగ్‌.. తర్వాత వాటి వల్ల తీవ్ర మనస్తాపానికి గురయ్యేవాడు.


ఇక ఆ లోహావత్ గ్రామంలో ప్రతాప్ రామ్‌సింగ్ అందరికీ ప‌రిచయం కావ‌డంతో అంద‌రూ అత‌న్ని బాబాజీ అని పిలిచేవారు. కానీ లొహావత్ గ్రామ యువకులు ప్రతాప్ రామ్‌సింగ్ వీడియోలు తీసి మీమ్స్‌, రీల్స్‌గా చేసి.. సోష‌ల్ మీడియాలో షేర్లు చేసేవారు. అంతేకాకుండా ప్రతాప్ రామ్‌సింగ్‌ బండిని కొందరు యువకులు చుట్టుముట్టి.. అల్లరి చేస్తూ.. ఆ బండిని తోస్తూ.. తీవ్రంగా అతడ్ని అవమానించేవారు. పైగా ఆ చేష్టలను వీడియోలు తీసి.. సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవారు.


ఈ క్రమంలోనే ఆదివారం కూడా అతడిని కొంతమంది హేళన చేసి అవమానించారు. దీంతో తీవ్రంగా విసిగిపోయిన ప్రతాప్ రామ్‌సింగ్.. అందరూ చూస్తుండగానే పహ్లోదీ స్టేట్‌ హైవే వద్ద తన బండిని వదిలేసి.. పక్కనే ఉన్న ఓ చెట్టును ఎక్కాడు. అయితే అతడు ఏం చేస్తున్నాడో అక్కడ ఉన్నవారికి అర్థం కాలేదు. అంతే అదే చెట్టుకు ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. దీంతో స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు వచ్చి ప్రతాప్‌ రామ్‌సింగ్‌ మృతదేహాన్ని కిందికి దించారు. ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేప‌ట్టారు. అయితే త‌న వీడియోలు వైర‌ల్ కావడం, యువకులు అమానించ‌డం, ట్రోల్స్, మీమ్స్ ఎక్కువ కావడంతోనే ప్రతాప్ రామ్‌సింగ్ ఆత్మహ‌త్య చేసుకున్నట్లు పోలీసులు పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com