ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నీట్, నెట్ పరీక్షల్లో అవకతవకలు.. ఇక నుంచి యూపీఎస్సీ సంచలన నిర్ణయం

national |  Suryaa Desk  | Published : Mon, Jun 24, 2024, 10:17 PM

దేశంలో గత కొన్ని రోజులుగా నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం పెను దుమారం రేపుతోంది. ఈ ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే జరిగిన యూజీసీ నెట్ పరీక్షలో కూడా అక్రమాలు తలెత్తాయని గుర్తించిన కేంద్రం.. ఆ నెట్ పరీక్షను కూడా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం దేశంలో తీవ్ర కలకలం రేపింది. ఇక కేంద్రంలో కొత్తగా ఏర్పడిన నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. ఇక ఈ ఘటనలను సీరియస్‌గా తీసుకున్న కేంద్ర ప్రభుత్వం.. పేపర్ లీకేజీ ఘటనలపై విచారణకు ఆదేశించింది. మరోవైపు ఇప్పటికే కొందర్ని అరెస్ట్ చేసి.. ఈ స్కామ్ వెనుక ఉన్న కారణాలను బయటపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ - యూపీఎస్సీ కీలక నిర్ణయం తీసుకుంది.


యూపీఎస్సీ నిర్వహించే వివిధ పరీక్షల్లో అక్రమాలు, చీటింగ్‌ను కట్టడి చేసేందుకు టెక్నాలజీని ఉపయోగించుకోనుంది. పరీక్షల్లో ఫేషియల్‌ రికగ్నిషన్‌, ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ ఆధారిత సీసీటీవీలతో పటిష్ఠ పర్యవేక్షణ వ్యవస్థలను ఉపయోగించాలని నిర్ణయించింది. ఇందుకోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలో అనుభవం ఉన్న ప్రభుత్వరంగ సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానించేందుకు రంగం సిద్ధం చేసింది. కేంద్ర సర్వీస్ ఉద్యోగులను నియమించేందుకు ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌లతో సహా దాదాపు 14 రకాల కీలక పరీక్షలను యూపీఎస్సీ నిర్వహిస్తూ ఉంటుంది. ఏటా దాదాపు 26 లక్షల మంది ఈ పరీక్షల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటారు.


ఈ పరీక్షలను యూపీఎస్పీ అత్యంత పారదర్శకంగా నిర్వహిస్తూ ఉంటుంది. అందుకోసం ఎప్పటికప్పుడు అందుబాటులో ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకుంటూ ఉంటుంది. ఈ క్రమంలోనే ఆధార్‌ ఫింగర్‌ప్రింట్ వెరిఫికేషన్.. అభ్యర్థుల ఫేస్ రికగ్నిషన్ సిస్టమ్.. ఈ-అడ్మిట్‌ కార్డుల క్యూఆర్‌ కోడ్‌ స్కానింగ్‌, ఆర్టిఫిషయల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే సీసీటీవీలతో పర్యవేక్షణ వ్యవస్థలను వినియోగించుకోవాలని యూపీఎస్సీ నిర్ణయించుకుంది.


ఇందులో భాగంగా ఎగ్జామ్ సెంటర్‌లోని 24 మందికి ఒక రూమ్ కేటాయించనుంది. ప్రతీ గదిలో ఎంట్రీ, ఎగ్జిట్ గేట్ల వద్ద సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి.. కంట్రోల్‌ రూమ్‌కు అనుసంధానం చేయనున్నారు. ఆ కెమెరాలు పనిచేయకపోయినా.. పరీక్షకు ముందు, ఆ తర్వాత గంట వరకు ఆ గదిలో ఎలాంటి అనుమానాస్పద కదలికలు గుర్తించినా.. పరీక్ష సమయం ముగిసిన తర్వాత ఇన్విజిలేటర్‌ ఆ గది నుంచి కదలకపోయినా.. వెంటనే ఉన్నతాధికారులను అప్రమత్తం చేసే టెక్నాలజీని వినియోగించనున్నారు. ఇక పరీక్షల్లో చీటింగ్, అక్రమాలు జరిగినా, ఇన్విజిలేటర్‌ లేని సమయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వెంటనే అలెర్ట్ అయి.. సమాచారం ఇచ్చేలా ఏర్పాట్లు చేయనుంది. అభ్యర్థులు అవకతవకలకు పాల్పడే అవకాశాలను అడ్డుకోవడం.. పరీక్షలను మరింత పారదర్శకంగా నిర్వహించే ఉద్దేశంతో ఈ చర్యలు చేపట్టినట్లు యూపీఎస్సీ తాజాగా వెల్లడించింది.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com