తిరుమల తిరుపతి దేవస్థానం నూతన ఈవోగా జె. శ్యామలరావు బాధ్యతలు స్వీకరించారు. మాజీ ఈవో ధర్మారెడ్డి స్థానంలో శ్యామలరావు ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. అంతకముందు ఆలయ సంప్రదాయం ప్రకారం ముందుగా శ్యామలరావు వరాహస్వామిని.. ఆ తర్వాత శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి దర్శనం అనంతరం ఈవో ధర్మారెడ్డి అధికారికంగా బాధ్యతలను శ్యామలరావుకు అప్పగించారు. ఈ సందర్భంగా నూతన ఈవో దంపతులకు అర్చకులు వేదాశీర్వచనం అందించగా.. అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.1997 బ్యాచ్‌కు చెందిన శ్యామలరావును తొలుత అసోం కేడర్‌కు కేటాయించారు. కొంతకాలం తర్వాత 2009లో ఆంధ్రప్రదేశ్‌కు వచ్చారు. విశాఖ కలెక్టర్‌గా, ఏపీఎంఎస్ఐడీసీ ఎండీగా వ్యవహరించారు. అలాగే హైదరాబాద్ మెట్రో వాటర్ సప్లయ్ ఎండీగా పనిచేశారు. ఏపీ హయ్యర్ ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్న సమయంలో టీటీడీ ఈవోగా నియమించారు. ఏపీలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. తిరుమలలో ప్రక్షాళన చేపడతామని స్పష్టం చేశారు. అందులో భాగంగా ధర్మారెడ్డి స్థానంలో ఈవోగా ఈయనకు బాధ్యతలు అప్పగించారు. మరోవైపు టీటీడీ ఈవో కావటం తన అదృష్టమన్న శ్యామలరావు.. అవకాశం ఇచ్చిన చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు. టీటీడీ ఈవోగా బాధ్యతాయుతంగా, పారదర్శకంగా పనిచేస్తూ.. భక్తుల సౌకర్యాలపై దృష్టిపెట్టనున్నట్లు చెప్పారు.