యూట్యూబర్ రేణుకాస్వామి హత్య కేసులో తప్పించుకోవచ్చని భావిస్తున్న కన్నడ నటుడు దర్శన్ చుట్టూ ఉచ్చు బిగిసింది. ఈ కేసులో కీలక నిందితులుగా భావిస్తోన్న జగ్గు అలియాస్ జగదీశ్, అనుకుమార్, రవి అనే ముగ్గురు పోలీసుల ఎదుట లొంగిపోయారు. అయితే, ఆయన్ను కాపాడేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ప్రతిపక్ష బీజేపీ ఆరోపిస్తోంది. కస్టడీలో ఉన్న దర్శన్‌కు పోలీసులు రాచమర్యాదలు చేస్తున్నారని మండిపడిన బీజేపీ.. మరో అంశాన్ని తెరపైకి తెచ్చింది. చన్నపట్న అసెంబ్లీ ఉప ఎన్నికలో ఓ నటుడ్ని పోటీ చేయించేందుకు డీకే శివకుమార్ సోదరులు ప్లాన్ చేశారని పరోక్షంగా దర్శన్ పేరును ప్రస్తావించింది.
డీకే సోదరుల అనుకున్న అనూహ్య అభ్యర్ధి జైలుకెళ్లాడని, ఆ వ్యక్తి ఎవరో తనకు తెలుసని బీజేపీ ఎమ్మెల్సీ సీపీ యోగేశ్వర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘‘డీకే సోదరుల అనూహ్య అభ్యర్థి ఇప్పుడు జైలుపాలయ్యాడు.. ఆ వ్యక్తి ఎవరో నాకు తెలుసు.. వాళ్లు పోటీ చేయించాలని చూసిన వ్యక్తి ఓ హత్య కేసులో అరెస్టయ్యాడు. ఇప్పుడు ఆయనకు టిక్కెట్ ఇవ్వడం సాధ్యం కాదు. అందుకే మరో ఊహించని వ్యక్తి కోసం ప్రయత్నాలు చేస్తుండొచ్చు. ఆయన ఎవరైనా.. బీజేపీ, జేడీఎస్‌లు ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాయి’ అని అన్నారు.
ఎవరూ ఊహించని వ్యక్తిని ఉప ఎన్నికలో నిలబెడతామని డీకే శివకుమార్ సోదరుడు సురేశ్ ఇటీవల చేసిన ప్రకటన నేపథ్యంలో యోగేశ్వర్ పైవిధంగా స్పందించారు. అయితే, ఓ నటుడి కేసు గురించి తానేమీ వ్యాఖ్యానించనని, రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆయన ఆసక్తి చూపారని తెలిపారు. చన్నపట్న నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి.. లోక్‌సభ ఎన్నికల్లో మండ్య నుంచి ఎంపీగా గెలిచి కేంద్ర మంత్రి పదవి చేపట్టారు. దాంతో ఎమ్మెల్యేగా రాజీనామా చేయడంతో అసెంబ్లీ స్థానానికి ఉపఎన్నిక అనివార్యమయ్యింది. ఈ క్రమంలోనే అక్కడి నుంచి కాంగ్రెస్ తరఫున దర్శన్‌ను పోటీ చేయించాలని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ప్రణాళిక వేసినట్లు బీజేపీ ఆరోపిస్తోంది. ఇక, లోక్‌సభ ఎన్నికల్లో దర్శన్.. మండ్యలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధి వెంకటరమణ గౌడకు మద్దతుగా ప్రచారం చేశారు.