అనంతపురం జిల్లాలో నీళ్ల ట్యాంకులో విషం కలపడం కలకలంరేపింది. కనేకల్ మండలం తుంబిగనూరులో ఫ్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ ఉంది.. ఆ వాటర్ ట్యాంక్‌లో గుర్తు తెలియని వ్యక్తులు పురుగుల మందు కలిపారు. అయితే శనివారం ఉదయం ఈ విషయం బయటపడటంతో.. గ్రామానికి విడుదల చేసే తాగునీటి సరఫరాను నిలిపివేయడంతో పెద్ద ప్రమాదమే తప్పింది. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.. వెంటనే ఎస్సై సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. ఊరిలో తాగునీటి ట్యాంకును పరిశీలించారు.
స్థానికులు చెబుతున్న వివరాల ప్రకారం.. శుక్రవారం అర్ధరాత్రి ట్యాంకు దగ్గర.. ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు పారిపోవడాన్ని స్థానికులు గమనించినట్లు తెలుస్తోంది. అనుమానంతో వెంటనే వాటర్ ట్యాంక్ దగ్గరకు వెళ్లి పరిశీలించగా.. అక్కడ ఏదో లిక్విడ్ కిందపడి ఉండటాన్ని గమనించారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓట్లు వేయలేదన్న అక్కసుతోనే గుర్తు తెలియని వ్యక్తులు ఇలా చేశారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకవేళ పొరపాటున పురుగులమందు కలిపిన నీళ్లు స్థానికులు తాగి ఉంటే పరిస్థితి ఏంటి అని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.