ఏలూరు జిల్లాలో నైరుతి రుతుపవనాలు ప్రవేశించడంతో బుధవారం సాయంత్రం నుంచి ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. జిల్లాలో పలు ప్రాంతాల్లో ఈదురు గాలులు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. పలుచోట్ల రోడ్లపై చెట్లు విరిగి పడి వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగింది. విద్యుత్ స్తంభాలు నేలకొరగడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మండల కేంద్రమైన పోలవరం నుంచి తహసీల్దారు కార్యాలయానికి వెళ్లే రోడ్డు మార్గంలో 16 చోట్ల విద్యుత్ స్థంభాలు నేలకూలి విద్యుత్ తీగలు తెగిపోయాయి. దీంతో పోలవరం మండలం అంతా అంధకారంలో చిక్కుకుంది. విద్యుత్ శాఖ అధికారులు ముందస్తు చర్యగా విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు సమయం పడుతుందని అధికారులు తెలిపారు. తహసీల్దారు కార్యాలయానికి వెళ్ళే రోడ్డు మార్గంలో, కన్నాపురం అడ్డరోడ్డు నుంచి కన్నాపురం వెళ్ళే రోడ్డు మార్గంలో, బెస్తా వీధిలో, బీసీ కాలనీ ప్రభుత్వ బాలుర పాఠశాల సమీపంలో రోడ్లపై చెట్లు కూలి వాహనాల రాక పోకలు అంతరాయం కలిగింది. నూతన గూడెంలో ఒక ఇంటిపై చెట్టు కూలింది ఎలాంటి ప్రమాదం జరగలేదు. జంగారెడ్డిగూడెంలో సాయంత్రం వరకు ఎండలు మండిపోగా సాయంత్రం ఒక్క సారిగా వాతావరణం మారి వర్షం కురిసింది. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సమీపంలో పామాయిల్ చెట్టుపై పిడుగు పడింది. అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. బుట్టాయ గూడెం ఏజెన్సీ ప్రాంతంలోను ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఆకాల వర్షం, గాలులు కారణంగా విద్యుత్ నిలిచిపోవడంతో జనాలు ఇబ్బందులు పడ్డారు. అంధకారంలోనే గిరిజన గ్రామాలు మగ్గుతున్నాయి. పెద పాడు మండలంలో భారీవర్షం కురిసింది. పలుచోట్ల చెట్ల కొమ్మలు విరిగిపడ్డాయి. చింతలపూడి పరిసర గ్రామాల్లో బుధ వారం సాయంత్రం గంటసేపు పైగా భారీ వర్షం పడింది. చింతలపూడి, లింగపాలెం, టి.నరసాపురం, జీలుగుమిల్లి, ద్వా రకాతిరుమల, భీమడోలు మండలాల్లోను ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిశాయి. కొయ్యలగూడెంలో రోడ్లన్నీ జల మయం అయ్యాయి. కన్నాపురం వెళ్ళే రహదారిలో అంకాల గూడెం వద్ద భారీ మర్రివృక్షం పడి పోయి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలిగింది. ఉదయం విపరీతమైన ఎండకు తాళ లేకపోయిన జనం వర్షంతో వాతావరణం చల్లబడడంతో ఊపిరి పీల్చుకున్నారు.రుతుపవనాల రాకతో రైతులు సార్వా పనులకు సన్నద్దమవుతున్నారు.