ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.ఎస్. జవహర్ రెడ్డి సెలవుపై వెళ్లారు. వ్యక్తిగత కారణాలతోనే ఆయన సెలవు పెట్టినట్లు తెలుస్తుంది. బుధవారం చంద్రబాబును సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. అయితే తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో జూన్ 12న టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీంతో కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది. మరోవైపు జగన్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించిన పలువురు కీలక ఐఏఎస్ అధికారులు సెలవుపై వెళ్లినట్లు తెలుస్తుంది. ఆర్థిక శాఖ కార్యదర్శి ఎస్ ఎస్ రావత్... అనారోగ్య కారణాలతో సెలవుపై వెళ్లారు. కొత్త సీఎస్‌ను సాయంత్రంలోపు నియమించే అవకాశం ఉన్నట్లు సమాచారం.