ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మేనిఫెస్టో చిన్నది.. ఇంపాక్ట్ పెద్దది.. ట్రెండ్ సెట్ చేసిన వైఎస్సార్సీపీ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 26, 2024, 08:24 PM

ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల పర్వం ముగిసింది. ఎన్నికలకు కొద్ది రోజులే సమయం ఉండటంతో అందరి దృష్టి పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలపై కేంద్రీకృతమైంది. మరోసారి అధికారంలోకి రావాలని పట్టుదలతో ఉన్న వైఎస్సార్సీపీ మేనిఫెస్టోలో ఏమేం అంశాలను పొందుపరుస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే అమలు చేస్తోన్న అమ్మఒడి, ఆరోగ్య శ్రీ, రైతు భరోసా లాంటి పథకాలను రెండోసారి కూడా వైఎస్సార్సీపీ కొనసాగించే అవకాశం ఉంది. టీడీపీ కూడా ఇదే తరహా హామీలు గుప్పిస్తోంది. దీంతో మేనిఫెస్టోలు విడుదల కాకపోయినా.. ఏ పార్టీ ఏ హామీలు ఇచ్చిందనే విషయమై ప్రజలకు ఇప్పటికే అవగాహన ఉంది.


వైఎస్సార్సీపీ ఏప్రిల్ 27న మేనిఫెస్టోను రిలీజ్ చేస్తుందనే ప్రచారం జరుగుతోంది. 2019 ఎన్నికల సమయంలో వైఎస్సార్సీపీ విడుదల చేసిన మేనిఫెస్టోకు ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించింది. కేవలం ఓ పాంప్లెట్ సైజ్‌లో నవరత్నాలను హైలెట్ చేస్తూ.. జగన్ పార్టీ మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. ఎక్కువ హామీలు ఇచ్చి ప్రజలను గందరగోళానికి గురి చేయకుండా.. సమాజంలో ఎక్కువ మందిపై ప్రభావం చూపే కీలకమైన 9 హామీలను హైలెట్ చేస్తూ.. ప్రజల దృష్టిని తనవైపు తిప్పుకోవడంలో వైఎస్సార్సీపీ విజయం సాధించింది.


అప్పటికే పాదయాత్ర ద్వారా కోటి మందికిపై ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకున్న జగన్ పట్ల ఓ పాజిటివిటీ క్రియేట్ అయ్యింది. ‘రావాలి జగన్.. కావాలి జగన్’ అంటూ జనాల్లో జగన్ పట్ల ఊపు తెచ్చారు. చివర్లో విడుదల చేసిన మేనిఫెస్టో.. వైఎస్సార్సీపీ క్రేజ్‌ను పీక్స్‌కు తీసుకెళ్లింది. అదిరిపోయే క్లైమాక్స్ పడితే సినిమా హిట్ నుంచి సూపర్ హిట్ అయినట్లు.. వైఎస్సార్సీపీ ఘనవిజయానికి మేనిఫెస్టో కూడా ఓ కారణమైంది. 2019లో సరిగ్గా ఉగాది పర్వదినాన వైఎస్సార్సీపీ మేనిఫెస్టోను రిలీజ్ చేసింది.


గత మేనిఫెస్టోలో పొందుపర్చిన ఎన్ని హామీలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అమలు చేసింది.. ఎన్ని హామీలను అమలు చేయలేకపోయింది అనే విషయాలను పక్కనబెడితే.. వందల కొద్దీ హామీలను మేనిఫెస్టోలో పొందుపర్చి ప్రజలను గందరగోళానికి గురి చేయకుండా.. జనం గుర్తుంచుకోవడానికి వీలుగా ప్రభావవంతమైన, ఓటర్లను తమవైపు తిప్పుకోగల హామీలనే ఆ పార్టీ మేనిఫెస్టోలో పొందుపర్చింది. ఐప్యాక్ డైరెక్షన్లో రూపొందించిన.. 2019 ఎన్నికల మేనిఫెస్టో ద్వారా మేనిఫెస్టో ఎలా ఉండాలనే విషయంలో వైఎస్సార్సీపీ ఓ కొత్త ట్రెండ్ సెట్ చేసిందనే చెప్పొచ్చు.


ఇప్పుడు కూడా అధికార పార్టీ అదే ట్రెండ్‌ను ఫాలో అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే అమలు చేస్తోన్న హామీలతోపాటు.. రైతులు, మహిళలను పూర్తిగా తమవైపు తిప్పుకొనేలా ఒకట్రెండు కీలక హామీలను వైఎస్సార్సీపీ ఈసారి మేనిఫెస్టోలో చేర్చవచ్చనే సంకేతాలు కనిపిస్తున్నాయి. అలాగే బీసీలను తమవైపు తిప్పుకోవడానికి పనికొచ్చే హామీలను కూడా అధికార పార్టీ మేనిఫెస్టోలో చేర్చే అవకాశం ఉంది.


ఇప్పుడు టీడీపీ కూటమి కూడా మేనిఫెస్టో విషయంలో వైఎస్సార్సీపీ బాటలోనే సాగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇప్పటికే టీడీపీ ‘సూపర్ సిక్స్’ పేరుతో ఆరు హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తోంది. ఈ హామీలను హైలెట్ చేస్తూ టీడీపీ మేనిఫెస్టోను రూపొందించే ఛాన్స్ ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com