ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భర్తల కోసం రంగంలోకి నేతల సతీమణులు...ఏపీలో ఆసక్తికర సీన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Apr 16, 2024, 07:03 PM

ప్రతి మగవాడి విజయం వెనుక ఓ మహిళ ఉంటుంది. ఇది ఇప్పుడు చెప్పే మాట కాదు. ఎప్పటి నుంచో చెప్తున్న మాట. ఎందరో గొప్పవాళ్లు.. తమ విజయం తర్వాత పంచుకున్న మాట. అయితే ఇప్పుడీ సంగతి ఎందుకంటే.. ఏపీ ఎన్నికల కురుక్షేత్రంలోకి బరిలోకి దిగుతున్న రాజకీయ ఉద్ధండులు ఈ సారి తమ సతీమణులను సైతం పోరాటానికి తీసుకెళ్తున్నారు. నరకాసురుడిపైకి యుద్ధం కోసం సత్యభామను శ్రీకృష్ణుడు వెంటబెట్టకెళ్లినట్లు.. ఎన్నికల రణరంగంలో తమ ప్రత్యర్థులను చిత్తు చేసేందుకు తమ అర్ధాంగుల సహకారం తీసుకుంటున్నారు. సాధారణంగా తమ గెలుపు కోసం రాజకీయ పార్టీల అభ్యర్థులు తమ కుటుంబసభ్యులతో ప్రచారం చేయించడం పరిపాటి. కానీ పార్టీల అధినేతలే స్వయంగా తమ సతీమణులతో ప్రచారం చేయిస్తుండటం బహుశా నాకు తెలిసి ఇదే తొలిసారి కావచ్చు.


ఈ సారి జరిగే ఎన్నికలు ఏపీలోని పలు రాజకీయపార్టీల మనుగడను, వాటి భవిష్యత్తును నిర్ణయించనున్నాయి. 2019 ఎన్నికల్లో సాధించిన అపూర్వ విజయాన్ని మరోసారి సొంతం చేసుకోవాలని వైసీపీ ఉబలాటపడుతోంది. అయితే అప్పడు ఒక్క ఛాన్స్ అని చెప్పిన వైఎస్ జగన్.. ఈసారి ఆ మాటను అనేందుకు లేదు. వైసీపీ ఐదేళ్ల పాలనను చూసే ఏపీ ప్రజలు తీర్పును ఇవ్వనున్నారు. అందుకే తాము చేసిన మంచి గురించి చెప్తూ ముందుకు సాగుతున్నారు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. రాష్ట్రవ్యాప్తంగా బస్సు యాత్రలు, సభలతో ప్రచారాన్ని పరుగులు పెట్టిస్తున్నారు. 2024 ఎన్నికల్లో ఓడితే వైసీపీ మనుగడకు ప్రమాదం ఎదురయ్యే పరిస్థితి ఉంది. ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ.. బీజేపీతో చేరిపోవటంతో ఎన్నికల్లో ఓడితే వైసీపీ తలనొప్పులు తప్పకపోవచ్చు. తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం ఎదుర్కొంటున్న సమస్యలనే వైసీపీకి కూడా ఎదురయ్యే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా జగన్ ప్రణాళికలు రచిస్తున్నారు.


ఇదే సమయంలో తమ కుటుంబంలోని వైఎస్ షర్మిల చేస్తున్న విమర్శలు సైతం జగన్‌ను కాస్త చికాకుపెడుతున్నాయనే చెప్పొచ్చు. వివేకా హత్య కేసు విషయంలో షర్మిల చేస్తున్న ఆరోపణలు వైసీపీకి ఇబ్బందికరంగా మారిన పరిస్థితి. ముఖ్యంగా కడప జిల్లాలోనే షర్మిల ప్రభావం చూపించే అవకాశం ఉంది. దీంతో షర్మిల వ్యాఖ్యలకు కౌంటర్ వేసేందుకు.. జగన్ తరుఫున పులివెందులలో ప్రచారం చేసేందుకు భారతీరెడ్డి రంగంలోకి దిగుతారనే వార్తలు వస్తున్నాయి. నామినేషన్ దాఖలు చేసిన సమయం నుంచి పులివెందులలోనే ఉండి వైఎస్ భారతి ప్రచారం చేస్తారని.. ఉమ్మడి కడప జిల్లాలోని మిగతా నియోజకవర్గాలలోనూ భారతి ప్రచారం ఉంటుందని వైసీపీ వర్గాలు చెప్తున్నాయి. అయితే గతంలో ఎప్పుడూ కూడా భారతి రెడ్డి ప్రచారం చేసిందైతే లేదు. కానీ ఈసారి ప్రచారపర్వంలో పాల్గొంటారని టాక్.


ఇక టీడీపీ విషయానికి వస్తే ఈ ఎన్నికలు తెలుగుదేశం పార్టీకి, ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడికి జీవన్మరణ సమస్యగా చెప్పొచ్చు. 2019 ఎన్నికల్లో ఎదురైన ఘోర ఓటమితో పార్టీ డీలాపడింది. అయితే ఎలాగోలా పార్టీని ముందుకు తీసుకువచ్చారు చంద్రబాబు. ఇక ఈసారి కూడా ఫలితం తేడా కొడితే .. టీడీపీ ఉనికి ప్రశ్నార్ధకం అవుతుంది. చంద్రబాబు వయసు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల్లో చంద్రబాబుకు చివరి ఎన్నికలు అయ్యే అవకాశం ఉంది. అందుకే ఈసారి ఎలాగైనా సైకిల్ పార్టీని అధికారంలోకి తేవాలనే ఉద్దేశంతో నారా చంద్రబాబు నాయుడు ప్లాన్ చేస్తున్నారు. అందుకు తగ్గట్లుగానే ఎన్డీయే కూటమిలో చేరారు.


ఇక చంద్రబాబు తరుఫున కూడా ఆయన సతీమణి నారా భువనేశ్వరి ఇప్పటికే జనంలో తిరుగుతున్నారు. స్కిల్ కేసులో చంద్రబాబు జైలుకు వెళ్లిన సమయంలో భువనేశ్వరి ప్రజల్లోకి వచ్చారు. చంద్రబాబు అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ అనేక నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఆ తర్వాత నిజం గెలవాలి యాత్ర పేరిట చంద్రబాబు జైలుకు వెళ్లిన సమయంలో చనిపోయిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను పరామర్శించారు. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా పర్యటించారు. ఈ యాత్ర ఇటీవల పూర్తికాగా.. మరో యాత్రపేరిట భువనేశ్వరిని ప్రచారంలోకి దింపాలని టీడీపీ ఆలోచిస్తోంది.


నారా భువనేశ్వరి సైతం జనంలోకి వెళ్లి ప్రచారం చేయటం ఇదే తొలిసారి. చంద్రబాబు 40 ఏళ్ల రాజకీయ అనుభవంలో భువనేశ్వరి రాజకీయంలో వేలుపెట్టి ఎరగరు. కానీ మారిన పరిస్థితుల దృష్ట్యా అటు భారతి రెడ్డి. ఇటు భువనేశ్వరి జనంలోకి వెళ్లాల్సిన పరిస్థితి. వీరితో పాటు హిందూపురం నుంచి పోటీ చేస్తున్న నందమూరి బాలకృష్ణ తరుఫున ఆయన భార్య వసుంధర సైతం ప్రచారం చేస్తున్నారు. అలాగే మంగళగిరిలో నారా లోకేష్ తరుఫున బ్రాహ్మణి సైతం ప్రచారం చేస్తారని తెలిసింది. ఆ రకంగా భర్తల విజయం కోసం భార్యలు ఇలా ప్రచారంలోకి దిగారన్న మాట. అయితే ఎవరి కృషి ఎంతమేర ఫలిస్తుందనేది చూడాలి మరి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com