సిరియా రాజధాని డమాస్కస్‌లో తమ రాయబార కార్యాలయంపై ఇటీవల జరిగిన దాడి వెనుక ఇజ్రాయేల్ ఉందని బలంగా నమ్ముతున్న ఇరాన్.. ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరికలు చేసిన విషయం తెలిసిందే. దాడులు తప్పవని హెచ్చరించిన ఇరాన్.. అన్నంతపని చేసింది. శనివారం ఇజ్రాయేల్‌పై డజన్ల కొద్ది డ్రోన్‌లను ఇరాన్ ప్రయోగించింది. శనివారం రాత్రి ఇజ్రాయేల్‌పై డజన్ల కొద్దీ డ్రోన్లను ప్రయోగించినట్టు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ కార్ప్స్ వెల్లడించింది. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇప్పటికే ఇజ్రాయేల్‌కు అమెరికా మద్దతు ప్రకటించింది. ఆ దేశానికి సమీపంగా క్షిపణి విధ్యంసక యుద్ధ నౌకలను మోహరించింది.
మరోవైపు, ఇరాన్ ప్రయోగించిన వందకుపైగా డ్రోన్లు లక్ష్యాలను చేరుకోవడానికి గంటల కొద్దీ సమయం పడుతుందని, వాటిని ఎదుర్కొనేందుకు తమ సైన్యం సిద్ధంగా ఉన్నామని ఇజ్రాయేల్ సైన్యం ప్రకటించింది. ఇరాన్ నుంచి ఇరాక్ గగనతలం మీదుగా ఇజ్రాయేల్‌వైపు డజన్ల కొద్ది డ్రోన్‌లు ఎగురుతున్నట్లు ఇరాకీ భద్రత వర్గాలు, స్థానిక మీడియా తెలిపాయి. అయితే. వీటిల్లో కొన్నింటిని సిరియా లేదా జోర్డాన్ మీదుగా ఇజ్రాయేల్ కూల్చివేసింది. ఉద్రిక్తతల నేపథ్యంలో ఇజ్రాయేల్, జోర్డాన్, లెబనాన్, ఇరాక్ తమ గగనతలాన్ని మూసివేశాయి. ఈ క్రమంలో సిరియా, జోర్డాన్ తమ వైమానిక దళాలను అప్రమత్తం చేశాయి.
ఏప్రిల్ 1న సిరియాలోని ఇరాన్ రాయబార కార్యాలయంపై దాడి జరిగినప్పటి నుంచి పశ్చిమాసియా నివురుగప్పిన నిప్పులా మారిపోయింది. డ్రోన్ దాడిలో ఇరాన్ ఖుడ్స్ ఫోర్స్‌కు చెందిన పలువురు సీనియర్ సైనికాధికారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి ఇజ్రాయేల్ కారణమని, ఆ దేశం మరో ఘోర తప్పిదం చేసిందని ఇరాన్ మండిపడింది. వారికి తగిన శిక్షవేస్తామని ఇరాన్ హెచ్చరికలు జారీ చేసింది. ఇందులో అమెరికా జోక్యం చేసుకోకుండా ఉండాలని సూచించింది. ఈ అంశాన్ని ఇంతటితో ముగించాలని ఇరాన్ డిమాండ్ చేసింది.
అటు, ఇజ్రాయేల్‌పై ఇరాన్ దాడి చేయడం ఖాయమని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు. ఇజ్రాయేల్‌కు తాము పూర్తిగా అండగా ఉంటామని ఆయన పునరుద్ఘాటించారు. అన్నిరకాలుగా టెల్ అవీవ్‌కు సాయం చేస్తామని.. ఆ దేశ భద్రతకు తాము హామీ అని డేలావేర్‌లో జాతీయ భద్రతా సలహాదారులతో సమావేశం ముగిసిన అనంతరం బైడెన్ ప్రకటించారు. గత అక్టోబరు 7 నుంచి గాజాలో హమాస్-ఇజ్రాయేల్ మధ్య జరుగుతోన్న యుద్దం పశ్చిమాసియాలో ఉద్రిక్తతలకు కారణమైంది. లెబనాన్, సిరియాతో సరిహద్దులకు వ్యాపించింది. యెమెన్, ఇరాక్ వంటి దేశాల నుంచి ఇజ్రాయేల్ లక్ష్యాలపై దాడులు జరుగుతున్నాయి. యెమెన్‌కి చెందిన హౌతీ గ్రూప్ ఇజ్రాయేల్‌పై డ్రోన్‌లను కూడా ప్రయోగించిందని బ్రిటిష్ సముద్ర భద్రతా సంస్థ అంబరీ ఒక ప్రకటనలో తెలిపింది. ఆ ఘర్షణలు ఇప్పుడు ఇరాన్, దాని మిత్రదేశాలు.. ఇజ్రాయేల్, దాని ప్రధాన మద్దతుదారు అమెరికా మధ్య ప్రత్యక్ష సంఘర్షణగా మారే ప్రమాదం ఉంది.