తొమ్మిదేళ్ల కిందట అమెరికాలో భార్యను అత్యంత కిరాతకంగా హత్యచేసి పరారైన భారతీయ వ్యక్తి కోసం ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (ఎఫ్‌బబీఐ) ముమ్మరంగా గాలిస్తోంది. అతడ్ని మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ జాబితాలో చేర్చింది. తాజాగా, నిందితుడి తలపై భారీ రివార్డును ప్రకటించింది ఎఫ్‌బీఐ. అతడి ఆచూకీ తెలియజేస్తే 2.5 లక్షల డాలర్లు (భారత కరెన్సీలో రూ.2.1 కోట్లు) అందజేస్తామని పేర్కొంది. 2015 ఏప్రిల్ 12న మేరీల్యాండ్‌లోని హానోవర్‌లో భారతీయుడు భద్రేశ్ కుమార్ చేతన్‌భాయ్ పటేల్ తన భార్య పాలక్‌ను కత్తితో పొడిచి చంపాడు.
భద్రేశ్ పటేల్, అతడి భార్య పాలక్ స్థానికంగా ఉండే డంకిన్ డోనట్ దుకాణంలో ఉద్యోగం చేసేవారు. హత్య జరిగిన రోజున వీరిద్దరూ రాత్రి షిఫ్ట్‌లో ఉన్నారు. అర్ధరాత్రి దాటిన తర్వాత ఆ దుకాణం కిచెన్‌లో ఉన్న పాలక్ దగ్గరకు వెళ్లిన భద్రేశ్ ఆమెను పలుమార్లు కత్తితో పొడిచాడు. రక్తపు మడుగులో పడి ఉన్న ఆమెను వదిలేసి అక్కడి నుంచి పారిపోయాడు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన పాలక్ అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. దీంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసిన ఎఫ్‌బీఐ.. నిందితుడి కోసం తీవ్రంగా గాలింపు చేపట్టింది.
హత్య అనంతరం తన అపార్ట్‌మెంట్‌కు వచ్చిన భద్రేశ్ కొన్ని వస్తువులు తీసుకుని న్యూజెర్సీ ఎయిర్‌పోర్టుకు వెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజ్‌లో రికార్డయ్యింది. ఆ తర్వాత అతడి ఆచూకీ లభించలేదు. అప్పటినుంచి నిందితుడి కోసం ఎఫ్‌బీఐ గాలిస్తూనే ఉంది. 2017లో అతడిని టాప్‌టెన్ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ జాబితాలో చేర్చింది. తాజాగా 2.5 లక్షల డాలర్ల రివార్డు ప్రకటించింది.
వీసా గడువు తీరడంతో పాలక్ భారత్ తిరిగి వెళ్లిపోవాలని నిర్ణయించుకోవడంతో భార్యాభర్తల మధ్య గొడవ మొదలైంది. చివరకూ ఆమెను హత్య చేసే వరకూ వెళ్లింది. తిరిగి స్వదేశానికి వెళ్లడం నచ్చని ఆమె భర్త ఈ దారుణానికి పాల్పడి ఉంటాడని దర్యాప్తు అధికారులు ప్రాథమికంగా ధ్రువీకరించారు. నిందితుడు భద్రేశ్ కెనడాకు లేదా భారత్‌కు తిరిగి వెళ్లి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.
ఎఫ్‌బీఐ బాల్టిమోర్ ఫీల్డ్ ఆఫీస్ స్పెషల్ ఏజెంట్ ఇంఛార్జ్ గోర్డాన్ బీ జాన్సన్ మాట్లాడుతూ. ‘భద్రేశ్‌కుమార్ పటేల్‌ను మోస్ట్ వాంటెడ్ టాప్ 10లో చేర్చడానికి అతడు చేసిన నేరం, అత్యంత హింసాత్మక స్వభావం’ అని అన్నారు. ప్రజల సహకారం, మా దర్యాప్తు అధికారులు కొనసాగిస్తున్న ప్రయత్నాలు భద్రేశ్‌కుమార్ పటేల్‌ను పట్టుకోవడానికి సహకరిస్తాయి... మేము ఎప్పటికీ మరచిపోం.. అతడ్ని పట్టుకుని బంధించి, న్యాయస్థానం ముందు ఉంచే వరకు విశ్రమించం’ అని అధికారి చెప్పారు.