స్కిల్‌డెవలప్‌మెంట్ కేసులో 17 ఏపై జడ్జిమెంట్ వచ్చిన తరువాత టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ రద్దు కేసు వింటామని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది. మంగళవారం స్కిల్ కేసులో చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలంటూ ఏపీ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీం విచారణ జరిపింది. తదుపరి విచారణను డిసెంబర్ 8కి వాయిదా వేసింది. రాజకీయ ర్యాలీలు, సభలు, సమావేశాలూ నిర్వహించకుండా చంద్రబాబును కట్టడి చేయాలన్న సీఐడీ అభ్యర్ధనను సుప్రీం తోసిపుచ్చింది. స్కిల్ కేసు గురించి మాత్రమే చంద్రబాబు బహిరంగంగా వ్యాఖ్యలు చేయరాదని సుప్రీం తేల్చిచెప్పింది. ఇరు పక్షాలూ స్కిల్ కేసు గురించి బహిరంగంగా వ్యాఖ్యానాలు చేయరాదని పేర్కొంది. రాజకీయ ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించుకోవడానికి చంద్రబాబుకు అనుమతినిచ్చింది.