ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నార్పలలో వసతి దీవెన డబ్బులు విడుదల చేసిన సీఎం జగన్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Apr 26, 2023, 10:13 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి శ్రీసత్యసాయి జిల్లా శింగనమల నియోజకవర్గం నార్పలలో పర్యటించారు. జగనన్న వసతి దీవెన లబ్ధిని బటన్‌ నొక్కి విద్యార్థుల తల్లుల ఖాతాలకు దాదాపు 9 లక్షల మందికి పైగా విద్యార్థులకు రూ.912.71 కోట్ల ఆర్థిక సాయాన్ని జమ చేశారు. ఐటీఐ విద్యార్థులకు రూ. 10 వేలు.. పాలిటెక్నిక్‌ విద్యార్థులకు రూ. 15 వేలు.. డిగ్రీ, ఇంజినీరింగ్‌, మెడిసిన్‌ చదువుతున్న విద్యార్థులకు రూ. 20 వేలు అందిస్తున్నారు. ఇది జగనన్న విద్యాదీవెనకు తోడుగా అందిస్తున్న జగనన్న వసతి దీవెన అని గుర్తు చఏశారు. ఫీజు రీయంబర్స్‌మెంట్‌ పూర్తిగా విద్యార్థులకు అందిస్తున్నామన్నారు.


నార్పల సభలో ప్రతిపక్ష నేత చంద్రబాబుపై వైఎస్ జగన్ సెటైర్లు పేల్చారు. ఈ మధ్య జాతీయ మీడియాకు ఒక ముసలాయన వచ్చీ రాని భాషలో ఇంటర్వ్యూ ఇచ్చారని.. ఆయన మాటలు వినేప్పుడు తనకు పులి కథ గుర్తుకు వచ్చిందన్నారు. 'నరమాంసం తినే పులి ముసలిదైపోయిందట.. వేటాడే శక్తి, పరిగెత్తే ఓపిక లేకపోవడంతో ఓ నాలుగు నక్కలను తోడేసుకుందట. మనుషుల్ని తినేందుకు ప్లాన్ వేసి.. ఒక ముడగు పక్క కూర్చుని.. వచ్చీపోయే మనుషులకు కడియం కావాలంటే నీటిలో మునగాలి అని ఆశ పెట్టేదట. ఈ పులిని నమ్మితే తినేస్తుంది అని అందరూ నమ్మకుండా పోయారు' అని కథ చెప్పుకొచ్చారు.


'నేను అడవిలో నలభై ఏళ్ల ఇండస్ట్రీ ఉంది. గతంలో బాగా తినేవాడని.. ఇప్పుడు మంచోడినైపోయినని నమ్మించేది.. రామా.. కృష్ణా.. అంటూ మంచి కార్యక్రమాల కోసమే ఉన్నాను అని చెప్పేది. నమ్మిన వాళ్లూ మడుగులో వెళ్లి నీట మునిగి ఆ నగలు తీసుకునే ప్రయత్నం చేసేవాళ్లు.. వాళ్లను పులి చంపేసి తినేసేది' అని కథను వివరించారు. వెన్నుపోటు పొడిచేవాళ్లను, అబద్ధాలు చెప్పేవాళ్లను ఎట్టిపరిస్థితుల్లో నమ్మకూడదు అన్నారు.. ఇదంతా వింటే అబద్ధాలు కళ్లారప్పకుండా చెప్పే ఓ ముసలాయాన చంద్రబాబు అంటూ ఎద్దేవా చేశారు.


చంద్రబాబు జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ చూస్తే తనకు పంచతంత్ర కథలు గుర్తుకొచ్చాయన్నారు. రోజూ రాజకీయాల మధ్య బతుకున్నామని.. చంద్రబాబు అధికారంలోకి వచ్చి రైతుల్ని నిండా ముంచేశారన్నారు. అక్కాచెల్లెమ్మల పొదుపు రుణాలు మాఫీ పేరుతో మోసం చేశారన్నారు. చంద్రబాబు మళ్లీ మోసం చేసేందుకు ప్రజల్లోకి వస్తున్నారని.. రాబోయే రోజుల్లోమరిన్ని అబద్ధాలు చెబుతారన్నారు. జగన్ వల్ల మంచి జరిగిందా? లేదా? అనేది కొలమానంగా తీసుకోవాలన్నారు. తాను దేవుడి దయను, ప్రజలను నమ్ముకున్నాను అన్నారు. రాబోయే ఎన్నికల కురుక్షేత్రంలో అందరి దీవెనలు కావాలని కోరారు.


రాష్ట్రంలో నాణ్యమైన చదువుల కోసం విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చామన్నారు సీఎం జగన్. గత ప్రభుత్వానికి.. ఈ ప్రభుత్వానికి తేడాను గమనించాలని కోరారు. ప్రభుత్వ విద్యాసంస్థలు ప్రైవేట్‌ విద్యాసంస్థలతో పోటీ పడే పరిస్థితి తెచ్చామని.. పేదలకు పెద్ద చదువులు అందించాలనేది ప్రభుత్వ లక్ష్యం అన్నారు. ప్రతీ మూడు నెలలకు తల్లుల ఖాతాలో నగదు జమ చేస్తున్నామని.. ఈ ప్రభుత్వం వచ్చాక డ్రాపవుట్ల సంఖ్య తగ్గిందన్నారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com