ట్రెండింగ్
Epaper    English    தமிழ்

యువతితో ర్యాపిడో రైడర్ అసభ్య ప్రవర్తన,,రన్నింగ్ బైక్‌పై నుంచి దూకేసిన యువతి

national |  Suryaa Desk  | Published : Wed, Apr 26, 2023, 10:10 PM

బెంగళూరు నగరంలో దారుణం జరిగింది. ఓ 31 ఏళ్ల యువతి కదులుతున్న ర్యాపిడో బైక్ పైనుంచి దూకింది. ఈ షాకింగ్ వీడియో తాజాగా వెలుగులోకి వచ్చింది. ఒక రాపిడో రైడర్ వెనుక కూర్చున్న యువతి ఫోన్‌ను లాక్కొని.. ఆమెను విమానాశ్రయం వైపు తీసుకెళ్లాడు. ఈ క్రమంలో ర్యాపిడో డ్రైవర్ అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆ యువతి కదులుతున్న బైక్‌పై నుంచి దూకింది. పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.


తమ ప్రాంతంలో ఇలా జరగడం ఇదే తొలిసారి అని.. బెంగళూరు ఈశాన్య డీసీపీ లక్ష్మీప్రసాద్ వివరించారు. దీపక్‌గా గుర్తించిన నిందితుడిపై పోలీసులు ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుడిపై సెక్షన్ 354, 366 కింద కేసు నమోదు చేశారు. ఏప్రిల్ 21వ తేదీన రాత్రి 11 గంటల 34 నిమిషాలకు ఈ ఘటన జరిగింది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


ఓ యువతి ఇందిరానగర్‌కు బైక్‌ను బుక్ చేసింది. రైడర్ ఆమె దగ్గరికి చేరుకున్నాడు. రైడ్ స్టార్ట్ చేసే ముందు.. ఓటీపీ చెప్పాలని అడిగాడు. ఆ క్రమంలో డ్రైవర్ ఆమె ఫోన్‌ను తీసుకున్నాడు. తర్వాత వెళ్లాల్సిన రూట్‌లో కాకుండా.. వేరే మార్గంలో తీసుకెళ్లాడు. దీన్ని గమనించిన యువతి అతన్ని ప్రశ్నించింది. బైక్ ఆపాలని కోరింది. అతను వినలేదు. దీంతో పెద్దగా అరిచింది. అయినా.. అతను బైక్ ఆపలేదు.


బైక్ ఆపకుండా ఆమెపై వేధింపులకు పాల్పడ్డాడు. యువతిని విమానాశ్రయం వైపు తీసుకువెళ్లాడు. దీంతో తన ప్రాణాలను కాపాడుకోవడానికి యువతి కదులుతున్న బైక్ నుంచి దూకేసింది. ఈ ఘటన తర్వాత మహిళలు, పౌరుల భద్రతపై పోలీసులు ఫోకస్ పెంచారు. అన్ని క్యాబ్ అగ్రిగేటర్లు, బైక్ టాక్సీ సేవలు, ఫుడ్ డెలివరీ భాగస్వాములను పిలిపించి చర్చలు జరిపారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరిగితే సంస్థలపై చర్యలు తప్పవని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.







SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com